పవన్మయిని బలవంతంగా బయటకు తీసుకువస్తున్న పోలీసులు
కౌన్సిల్ సమావేశానికి వెళ్లకుండా చైర్‌పర్సన్‌ను అడ్డుకున్న పోలీసులు
ఆమె సెలవులో ఉన్నారంటూ గేటు వద్దే నిలిపివేత
కీలక సమావేశంలో ఓటు వేసేందుకు అవకాశమివ్వని అధికారులు
వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల ఆందోళన
గురజాల: పల్నాడు జిల్లా గురజాలలో పోలీసులు ప్రజా స్వామ్యానికి తూట్లు పొడిచారు. కౌన్సిల్ సమావేశంలో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకునేందుకు బయలుదేరిన వైఎస్సార్‌సీపీకి చెందిన చైర్‌పర్సన్‌పై పోలీసులు దౌర్జన్యం చేసి అడ్డుకున్నారు. ఆమె సెలవులో ఉన్నారంటూ కౌన్సిల్ హాలు గేటు బయటే నిలిపేశారు. టీడీపీ కూటమి నేతల ఒత్తిడి మేరకు గురజాల నగర పంచాయతీ నుంచి జంగమహేశ్వరపురం గ్రామాన్ని విడదీసి ప్రత్యేక పంచాయతీగా మార్చేందుకు కౌన్సిల్ తీర్మానం కోసం సోమవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశారు.
ఈ సమావేశంలో పాల్గొనేందుకు వైఎస్సార్‌సీపీకి చెందిన చైర్‌పర్సన్ పోలు పవన్మయి రాగా, పోలీసులు అడ్డుకున్నారు. పవన్మయి కొద్దికాలం కిందట చైర్‌పర్సన్ పదవికి సెలవు పెట్టారని, ఆమె స్థానంలో మరొకరు చైర్మన్‌గా కొనసాగుతున్నారని, ముందస్తు సమాచారం లేకుండా కౌన్సిల్ సమావేశానికి హాజరై ఓటు వేయడానికి వీల్లేదని పోలీసులు గేటు బయటే నిలిపేశారు.
ఓటు హక్కు కల్పించాలని కోరినా...
చైర్‌పర్సన్ పదవికి సెలవు పెట్టినా కనీసం తాను కౌన్సిలర్‌గా అయినా సమావేశంలో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వాలని పవన్మయి కోరినా, మున్సిపల్ అధికారులు, పోలీసులు అనుమతించలేదు. దీంతో ఆమె గేటు వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. ఆమెకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు వచ్చి పవన్మయిని సమావేశానికి అనుమతించాలని డిమాండ్ చేశారు.
కానీ, పోలీసులు, మున్సిపల్ అధికారులు మాత్రం ఆమె సెలవులో ఉన్నారంటూ లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. చాలాసేపు వాగ్వాదం అనంతరం ఆమె బయట ఉండగానే కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. మొత్తం 20 మంది సభ్యులకు గాను, 18 మంది హాజరయ్యారు. గురజాల నగర పంచాయతీ నుంచి జంగమహేశ్వరపురాన్ని విడదీసి ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసే తీర్మానానికి అనుకూలంగా టీడీపీలో కొనసాగుతున్న 11 మంది, వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీకి చెందిన ఏడుగురు ఓటు వేశారు. మెజార్టీ సభ్యులు ఓటు వేయడంతో తీర్మానాన్ని ఆమోదించారు.
కౌరవ సభను తలపించిన గురజాల కౌన్సిల్
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి యెనుముల మురళీధర్‌రెడ్డి
గురజాల రూరల్: పల్నాడు జిల్లా గురజాల నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశం కౌరవ సభను తలపించిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, వినుకొండ, పెదకూరపాడు నియోజకవర్గాల పరిశీలకుడు యెనుముల మురళీధర్‌రెడ్డి అన్నారు. స్థానిక నగర పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓ మహిళా చైర్‌పర్సన్‌ను కౌన్సిల్లోకి రానీయకపోవడం దారుణమని, గురజాల చరిత్రలో దీనిని బ్లాక్‌డేగా పరిగణించాలన్నారు. ‘గురజాలకు 90 ఏళ్ల చరిత్ర ఉంది. 1999లో రాజకీయ కారణాల వల్ల గురజాల నుంచి జంగమహేశ్వరపురాన్ని విడగొట్టారు.
అభివృద్ధికి ఆమడ దూరంలోఉన్న జంగమహేశ్వరపురాన్ని 2019లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచి్చన తరువాత అప్పటి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి చొరవతో గురజాలలో విలీనం చేశారు. అప్పటినుంచి సుమారు రూ.22 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. టీడీపీ కూటమి అధికారం చేపట్టాక మళ్లీ జంగమహేశ్వరపురాన్ని మళ్లీ గురజాల నుంచి విడదీయాలని చూస్తోంది’ అని యెనుముల విమర్శించారు. కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి వచి్చన నగర పంచాయతీ చైర్ పర్సన్ పోలు పవన్మయిని కౌన్సిల్ బయటే అడ్డుకోవడం దారుణమని, ఇదేనా మహిళలకు ఇచ్చే గౌరవం అని ప్రశి్నంచారు.
‘జంగమహేశ్వరపురం గురజాలలోనే ఉండాలి. నగర పంచాయతీగా ఉంటేనే అభివృద్ధిసాధ్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ గురజాల నుంచి జంగమహేశ్వరపురాన్ని విడదీయనీయం’ అని స్పష్టం చేశారు. ఆరుగురు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను బెదిరింపులకు గురిచేసి టీడీపీకి మద్దతుగా చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ తీరుపై కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు కొమ్మినేని వెంకటేశ్వర్లు, కె.బుజ్జి, కె.అన్నారావు, సిద్దాడపు గాందీ, పాల్గొన్నారు.


