వైమానిక దళంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది
ఏటా కనీసం 36 నుంచి 40 యుద్ధ విమానాలు అవసరం
చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ వెల్లడి
న్యూఢిల్లీ: భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో వైమానిక శక్తి అత్యంత కీలకంగా మారుతోందని.. ఇలాంటి తరుణంలో తేజస్ యుద్ధ విమానాల రాకలో జరుగుతున్న విపరీతమైన జాప్యం భారత వైమానిక దళం(ఐఏఎఫ్)పై ప్రతికూల ప్రభావం చూపుతోందని చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ పేర్కొన్నారు. ఇప్పటికే ఫైటర్ జెట్ స్క్వాడ్రన్ల బలం తగ్గుతోందని చెప్పారు. 94వ ‘ఎయిర్‌ఫోర్స్ డే’ను పురస్కరించుకొని ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు.
రాబోయే కొన్నేళ్లపాటు ఏటా కనీసం 36 నుంచి 40 యుద్ధ విమానాలను ఐఏఎఫ్‌లో చేర్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ‘తేజస్ మార్క్–1ఏ’విమానాలు, మల్టీ–రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్(ఎంఆర్‌ఎఫ్‌ఏ) కార్యక్రమం కింద సమకూరనున్న రఫేల్ యుద్ధ విమానాల రాకతో పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అన్నీ ప్రణాళిక ప్రకారం జరిగితే.. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఎంఆర్‌ఎఫ్‌ఏ ఒప్పందాన్ని ఖరారు చేసుకొని, సంతకాలు చేసే దిశగా ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో భారత్, ఫ్రెంచ్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయని వివరించారు. తేజస్ మార్క్–1ఏ యుద్ధ విమానాల సరఫరాలో జరుగుతున్న జాప్యం పట్ల కూడా ఏపీ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.
హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) ద్వారా జెట్ల సరఫరాలో జరుగుతున్న భారీ జాప్యంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘ఈ జాప్యం వైమానిక దళానికి నష్టం కలిగిస్తుంది’అని వ్యాఖ్యానించారు. ఐఏఎఫ్ కోసం 83 తేజస్ మార్క్–1ఏ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు 2021 ఫిబ్రవరిలో రక్షణ శాఖ హెచ్‌ఏఎల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ రూ.48,000 కోట్లు. మొదటి విడత విమానాలను 2024 మార్చిలో అందజేయాల్సి ఉంది. ఇప్పటి వరకు ఒక్క విమానం కూడా వైమానిక దళానికి అందలేదు.
స్మిత్ మచ్ఛార్‌కు ఏపీ సింగ్ ప్రశంసలు
ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడటంలో భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ అసాధారణ ధైర్యం ప్రదర్శించారని ఏపీ సింగ్ ప్రశంసించారు. ఆయనను చూసి ప్రతి భారతీయుడూ గర్వపడుతున్నట్లు చెప్పారు. మచ్ఛార్ చేసిన పని అత్యంత సాహసోపేతమైనదని తెలిపారు. విమానంలో దాడి జరిగినప్పటికీ గొప్ప శారీరక, మానసిక దృఢ సంకల్పాన్ని ప్రదర్శించారని పేర్కొన్నారు.


