
కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. తన గర్ల్‌ఫ్రెండ్‌కు అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టాడని ఓ యువకుడు.. మరో యువకుడిపై తన స్నేహితులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
నెలమంగళ తాలుకా సోలదేవనహళ్లిలో జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. కుశాల్ అనే కుర్రాడు గతంలో ఓ యువతిని ప్రేమించాడు. అయితే తర్వాత ఇద్దరికీ బ్రేకప్ కాగా, ఆ యువతి మరో యువకుడితో రిలేషన్ మొదలుపెట్టింది. ఇది భరించలేని కుశాల్.. సదరు యువతికి అసభ్య సందేశాలు పంపాడు. ఈ విషయాన్ని సదరు యువతి తన తాజా ప్రియుడికి చెప్పింది. దీంతో రగలిపోయిన సదరు యువకుడు తన స్నేహితులతో కలిసి కుశాల్‌పై దాడికి పాల్పడ్డాడు. అయితే..
కుశాల్‌ను కిడ్నాప్ చేసి.. ఓ బహిరంగ ప్రదేశంలోకి ఈడ్చుకెళ్లి పడేశారు. పది మంది అతన్ని చుట్టుముట్టి కాళ్లతో, కర్రలతో తన్నారు. బట్టలు విప్పించి.. ప్రైవేట్ బాగాలపై దాడి చేస్తూ హింసించారు. దాడి సమయంలో ఆ యువతి కూడా అక్కడే ఉంది. దాడికి పాల్పడిన టైంలో ఆ గ్యాంగ్ మొత్తం కర్ణాటకలో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి కేసు ప్రస్తావన తెచ్చి మరీ కుశాల్‌పై దాడికి పాల్పడింది. వీడు మరో రేణుకాస్వామి రా అంటూ ఒక్కొక్కరుగా కుశాల్‌ను చితకబాదారు. ఇది కూడా ఆ కేసులాగే ముగుస్తుందంటూ హెచ్చరించారు కూడా.
జూన్ 30వ తేదీన ఈ ఘటన జరగ్గా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాకు ఎక్కింది. బాధితుడి ఫిర్యాదు మేరకు 10 మందిపై సోలదేవనహళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటిదాకా 8 మందిని అరెస్ట్ చేశారు. కిడ్నాప్, దాడి, బెదిరింపు, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టింగ్ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
కన్నడనాట చాలెంజింగ్ స్టార్‌గా పేరున్న దర్శన్ నటి పవిత్రగౌడకు అసభ్య సందేశాలు పంపాడన్న కోపంతో తన అభిమాని అయిన రేణుకా స్వామి అనే వ్యక్తిని సుపారీ గ్యాంగ్‌తో కిడ్నాప్ చేయించి.. అత్యంత దారుణంగా హింసించి చంపాడని తెలిసిందే. ఈ ఉదంతం కర్ణాటకను మాత్రమే కాదు.. యావత్ దేశాన్ని కుదిపేసింది. ప్రస్తుతం ఈ కేసులో దర్శన్ బెయిల్ మీద బయట ఉన్నాడు.