ప్రయాగ్‌రాజ్ మాఘమేళా ఎపిసోడ్‌లో ట్విస్ట్ చోటు చేసుకుంది. జ్యోతిర్మఠ శంకరాచార్యుడు స్వామి అవిముక్తేశ్వరానందను పోలీసులు పవిత్ర స్నానం చేయనివ్వకుండా అడ్డుకున్న సంగతి దుమారం రేపిన సంగతి తెలిసే ఉంటుంది. ఈ విషయంలో యోగి సర్కార్‌తో అవిముక్తేశ్వరానంద ఓపెన్ చాలెంజ్‌కు దిగారు. ఈ తరుణంలో ఆయనకు అనూహ్య మద్దతు లభించింది.
కాంగ్రెస్ పార్టీ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అవిముక్తేశ్వరానందను ఇబ్బంది పెడుతోందని ఆరోపిస్తోంది. అయోధ్యలో నిర్మాణం పూర్తికాకుండానే ఆలయాన్ని ప్రతిష్టించడం తప్పని ఆయన అన్నారు. మహా కుంభమేళా నిర్వహణ సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కోవిడ్ సమయంలో గంగా నదిలో మృతదేహాలు తేలియాడడంపై ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపారు. అందుకే ప్రభుత్వం ఇప్పుడు ఆయన్ని యూపీ బీజేపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని అని కాంగ్రెస్ అంటోంది.
చాలామంది బీజేపీని కేవలం మైనారిటీలకు వ్యతిరేకంగా ఉన్న పార్టీగా భావిస్తారు. కానీ ఇప్పుడది హిందూ మతానని వదలడం లేదు. ఒక హిందూ సన్యాసినిని అవమానిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం కారణంగా.. శంకరాచార్యుడు మొట్టమొదటిసారి పవిత్ర స్నానానికి దూరంగా ఉన్నారు. మొఘలులు, బ్రిటీషర్ల కాలంలోనూ ఇలా జరగలేదు. హిందువుల రక్షకులమని చెప్పుకునే ప్రభుత్వం ఇలాంటి పని చేయడం సిగ్గుచేటు అని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా విమర్శించారు. అవిముక్తేశ్వరానంద కంటే మోహన్ భగవత్ గొప్పవారా?.. ఆయనకేమో జెడ్‌ప్లస్ సెక్యూరిటీ నడుమ పుణ్య స్నానాలు చేయించి.. ఈయన్నేమో అడ్డుకుంటారా?. ప్రధాని మోదీ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారాయన.
తిట్టిన వ్యక్తే..
అవిముక్తేశ్వరానంద గతంలో కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. 2024లో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం హిందువులకు వ్యతిరేకంగా ఉందని బీజేపీ మండిపడింది. ఆ సమయంలో అవిముక్తేశ్వరానంద ఆయనకు మద్దతు ప్రకటించారు. ఆయన ప్రసంగాన్ని వక్రీకరించారని, నిజానికి రాహుల్ “హిందూ మతం హింసను తిరస్కరిస్తుంది” అని స్పష్టంగా చెప్పారని తెలిపారు. అయితే..
2025 మే నెలలో మనుస్మృతిని రాహుల్ గాంధీ అవమానించారని చెబుతూ.. హిందూ మతం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయంలో శంకరాచార్య మఠం నోటీసు ఇచ్చినా రాహుల్ స్పందించలేదని, క్షమాపణ చెప్పలేదని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది.. జనవరి 16వ తేదీన హిందువులను దూషించిన రాహుల్ గాంధీ అయోధ్య రామ మందిరంలో అడుగు పెట్టడానికి వీల్లేదని.. ఆయన వస్తే గనుక అడ్డుకోవాలని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టును కోరారు. ఈలోపు.. ఆ పార్టీ అనూహ్యంగా ఇప్పుడు ఆయనకు మద్దతు ప్రకటించడం గమనార్హం.
అసలేం జరిగింది..
ఉత్తరాఖండ్‌లోని జ్యోతిర్మఠానికి 46వ శంకరాచార్యుడు(స్వయం ప్రకటిత) స్వామి అవిముక్తేశ్వరానందను మాఘమాసి అమావాస్య సందర్భంగా ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమానికి తన అనుచర గణంతో రథంపై వచ్చారు. అయితే రథం దిగి నడుచుకుంటూ వెళ్లాలని అధికారులు అభ్యంతరాలు చెప్పారు. అలా మొదలైన వాగ్వాదం చిలికి చిలికి గాలివానంగా మారింది. పోలీసులు సాధువుల మధ్య తోపులాట జరిగింది. ఆ గొడవలో రథాన్ని నదీ సంగమానికి దూరంగా తీసుకెళ్లారు. అలా అవిముక్తేశ్వరానంద పవిత్ర స్నానం చేయలేకపోయారు.
ఆయనతో పాటు 200–300 మంది భక్తులు ఉన్నారని.. అనుమతులు లేవని.. భద్రతా సమస్యల దృష్ట్యా అడ్డుకోవాల్సి వచ్చిందని పోలీసులు వివరణ ఇచ్చుకున్నాయి. అయితే ఇది శంకరాచార్యుడి హోదా వ్యక్తికి జరిగిన అవమానమంటూ అక్కడే శిబిరం ఏర్పాటు చేసుకుని నిరసన తెలుపుతున్నారాయన.
అవిముక్తేశ్వరానందకు నోటీసులు
జ్యోతిర్మఠ శంకరాచార్య అవిముక్తేశ్వరానందకు మాఘమేళ నిర్వాహకులు షాకిచ్చారు. నిజమైన శంకరాచార్యా అవునా కాదా అని 24 గంటల్లోగా నిరూపించుకోవాలని నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు మాఘ మేళ వద్ద అవిముక్తేశ్వరానంద ఏర్పాటు చేసిన తాత్కాలిక క్యాంపును ఓ అధికారి వెళ్లి నోటీసులు అందించారు.
సుప్రీం కోర్టులో వివాదం..
ఉత్తరాఖండ్ జ్యోతిర్మఠ శంకరాచార్య స్థానంపై దశాబ్దాలుగా వివాదాలు కొనసాగుతున్నాయి. 1989 ఏప్రిల్ 8వ తేదీన స్వరూపానంద సరస్వతి తనకు తాను శంకరాచార్య అని ప్రకటించుకున్నారు. అయితే 1989 ఏప్రిల్ 15వ తేదీన ఆ పీఠానికి చెందిన వసుదేవానంద సరస్వతిని వారసుడిగా శతానంద ప్రకటించారు. దీంతో ఆ పీఠానికి ఇద్దరు పీఠాధిపతులు కొనసాగారు. 2022 సెప్టెంబర్‌లో స్వరూపానంద సరస్వతి పరమపదించారు. ఆ మరుసటి రోజే తానే శంకరాచార్య అంటూ అవిముక్తేశ్వరానంద ప్రకటించుకున్నారు. కానీ అదే ఏడాది అక్టోబర్‌లో ఆయనపై సుప్రీంకోర్టు బ్యాన్ విధించింది. తుది తీర్పు వెల్లడించే వరకు ఎవర్నీ శంకరాచార్యగా ప్రకటించరాదు అని, పట్టాభిషేకం కూడా నిర్వహించరాదని.. ఆ పోస్టును ఎవరూ ఆక్రమించరాదని కోర్టు స్పష్టం చేసింది.
అయితే.. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ మాఘమేళ క్యాంపు వద్ద శంకరాచార్య అంటూ అవిముక్తేశ్వరానంద బోర్డు పెట్టుకున్నారని.. అందుకే నోటీసులు ఇచ్చామని మాఘమేళ అధికారులు చెప్తున్నారు.


