
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానాలు ఏదో కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా శాన్ ఫ్రాన్సిస్కో నుండి కోల్‌కతా మీదుగా ముంబైకి నడిచే ఎయిర్ ఇండియా విమానం ఏI180లో చిన్న చిన్న బొద్దింకలు కనిపించాయని ఇద్దరు ప్రయాణికులు ఫిర్యాదు చేసిన దరిమిలా వాటిని తొలగించినట్లు ఎయిర్‌లైన్ తెలిపింది.
ఎయిర్ ఇండియా విమానంలోని ఇద్దరు ప్రయాణికులు తమ సీట్ల వద్ద బొద్దింకలు ఉన్నాయని ఫిర్యాదు చేసిన అనంతరం వారి సీట్లు మార్చామని ఎయిర్ ఇండియా తెలిపింది. ‘శాన్ ఫ్రాన్సిస్కో నుండి కోల్‌కతా మీదుగా ముంబైకి వెళ్లే ఏI180 విమానంలో, ఇద్దరు ప్రయాణికులు దురదృష్టవశాత్తూ చిన్న బొద్దింకల కారణంగా ఇబ్బంది పడ్డారు. దీంతో తమ క్యాబిన్ సిబ్బంది ఆ ఇద్దరు ప్రయాణికులను ఇతర సీట్లకు మార్చారు. అక్కడ వారు సౌకర్యవంతంగా కూర్చున్నారు.
ఇంధన స్టాప్ సమయంలో, మా గ్రౌండ్ సిబ్బంది వెంటనే శుభ్రపరిచే ప్రక్రియను నిర్వహించారు’ అని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. విమానంలో తమ పరిశుభ్రతా చర్యలు కొనసాగుతున్నప్పటికీ, కీటకాలు కొన్నిసార్లు గ్రౌండ్ ఆపరేషన్ల సమయంలో విమానంలోకి ప్రవేశిస్తుంటాయి. ఇటువంటివి జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని ఎయిర్‌లైన్ తెలిపింది, ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నామని పేర్కొంది.