న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన భారీ నిరసన ప్రదర్శనలు తీవ్ర గందరగోళానికి దారితీశాయి. అక్టోబర్ 10న జరిగిన ఈ ధర్నాల వల్ల ఒక్క రోజులోనే దాదాపు రూ. 2,000 కోట్ల విలువైన వ్యాపారం పూర్తిగా స్తంభించిపోయిందని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) వెల్లడించింది. పండుగల సీజన్ ప్రారంభంలోనే ఇలాంటి నిరసనలు చెలరేగడంతో వ్యాపార రంగం భారీగా నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది.
ఈ ఆందోళనల తీవ్రతతో చాందినీ చౌక్, సదర్ బజార్, కన్నాట్ ప్లేస్, కరోల్ బాగ్ వంటి నగరంలోని ప్రధాన మార్కెట్లు పూర్తిగా మూతపడ్డాయి. సాధారణంగా షాపింగ్ కోసం బయటి ప్రాంతాల నుండి ప్రతిరోజూ వచ్చే 3 నుంచి 4 లక్షల మంది వినియోగదారులు రాకపోగా, ట్రాఫిక్ జామ్‌లు, మెట్రో స్టేషన్ల మూసివేత భయంతో స్థానిక ప్రజలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో రిటైల్ మార్కెట్లన్నీ కస్టమర్లు లేక వెలవెలబోయాయి.
కేవలం వస్తువుల అమ్మకాలే కాకుండా సేవా, ఆతిథ్య రంగాలు కూడా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, బ్యూటీ పార్లర్లలో ముందస్తు బుకింగ్‌లు రద్దయ్యాయి. రవాణా, పర్యాటక రంగాలతో పాటు పెట్రోల్ పంపుల వద్ద సైతం కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఢిల్లీ ఆర్థిక వ్యవస్థపై ఈ ఒక్కరోజు నిరసన కోలుకోలేని దెబ్బ కొట్టింది.
నవరాత్రులు, రామ్‌లీలా ఉత్సవాలు, దీపావళి.. ఢిల్లీలోని 20 లక్షల మంది వ్యాపారులకు అత్యంత కీలకమైనదని సీటీఐ చైర్మన్ బ్రిజేష్ గోయల్ పేర్కొన్నారు. నగరంలో జరిగే 650 రామ్‌లీలల ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని గుర్తు చేస్తూ, దీపావళి ముగిసే వరకు ఢిల్లీలో ఎలాంటి ధర్నాలు, ఆందోళనలు చేపట్టవద్దని సీజేపీతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. నిరసనలు కొనసాగించాలనుకుంటే వేరే నగరాలను ఎంచుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: దేశమంతటా నవరాత్రి సందడి షురూ.. వివిధ రాష్ట్రాల్లో..


