న్యూఢిల్లీ: దేశమంతటా నవరాత్రుల సందడి మొదలయ్యింది. ఆదివారం మొదటి రోజున ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉత్సవాలు జరుగుతాయి. ఒక రాష్ట్రంలో అమ్మవారిని ప్రతిష్ఠించగా.. మరొక చోట రాజరిక ఉత్సవం మొదలవుతుంది. ఇంకో చోట సంధ్యా సమయంలో ప్రారంభమయ్యే నృత్యం అర్ధరాత్రి దాటే వరకు కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా నవరాత్రుల మొదటి రోజును ఎలా జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉమ్మడి సంప్రదాయం
భారతదేశంలోని చాలా ప్రాంతాలలో మొదటి రోజున ఉత్సవాలు కలశ స్థాపనతో ప్రారంభమవుతాయి. భక్తులు దుర్గాదేవి తొలి రూపమైన శైలపుత్రిని పూజిస్తారు. పలువురు నవరాత్రుల ఉపవాసం ప్రారంభిస్తారు.
గుజరాత్: సందడి చేసే నృత్యం
గుజరాత్‌లో నవరాత్రి వేడుకలు నృత్యాలతో మొదలవుతాయి. ‘గర్బా’ అని పిలిచే మట్టి దీపం చుట్టూ వృత్తాకారంలో చేరి, సాయంత్రం నుంచి అర్ధరాత్రి దాటే వరకు గర్భా, దాండియా నృత్యాలు చేస్తారు.
మహారాష్ట్ర: రంగురంగుల దుస్తులతో..
మహారాష్ట్రలోని ప్రతి ఇంట్లో మట్టి కుండను ప్రతిష్ఠించి, దానిలో విత్తనాలు చల్లుతారు. అవి తొమ్మిది రోజుల్లో మొలకెత్తుతాయి. మొదటి రోజు కలర్ కోడ్ ప్రారంభానికి కూడా సూచిక. ముంబైలో చాలామంది ప్రతిరోజూ కేటాయించిన ఒక్కో రంగు దుస్తులను ధరిస్తారు. కార్యాలయాలు, లోకల్ రైళ్లలోనూ ఈ రోజువారీ రంగు సంప్రదాయాన్ని పాటిస్తారు. ఈ ఏడాది మొదటి రోజు ఆదివారం వచ్చింది, కాబట్టి ఆ రోజు రంగు నారింజ (ఆరెంజ్).
కర్ణాటక: మైసూరులో రాజరిక ఉత్సవం ఆరంభం
కర్ణాటకలో మొదటి రోజు అధికారికంగా ఉత్సవం మొదలువుతుంది. అక్టోబర్ 11న ఉదయం 11:50 గంటలకు చాముండి కొండపై ఉన్న చాముండేశ్వరి ఆలయంలో మైసూరు దసరా ప్రారంభమవుతుంది. ఈ ప్రారంభోత్సవం పవిత్రమైన ధనుర్ లగ్నంలో జరుగుతుంది. అదే రోజు సాయంత్రం మైసూరు ప్యాలెస్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు మొదలవుతాయి. దీనిని నాడ హబ్బ (రాష్ట్ర పండుగ) అని పిలుస్తారు. దీనిని మొదట 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకులు ప్రారంభించారు. రాష్ట్ర షెడ్యూల్ ప్రకారం ప్రసిద్ధ జంబూ సవారీ ఊరేగింపు అక్టోబర్ 21న జరుగుతుంది.
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: బొమ్మల కొలువు
దక్షిణాదిలోని తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో ఇళ్లలో బేసి సంఖ్యల మెట్లపై బొమ్మలను వరుసలలో పేర్చి బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. మహిళలు స్నేహితులను, కుటుంబ సభ్యులను ఈ కొలువును చూడటానికి ఆహ్వానిస్తారు. భక్తి పాటలు పాడతారు. తమిళనాడులో ప్రతిరోజూ ఒక రకమైన పప్పుధాన్యంతో చేసిన సుండల్, తీపి పొంగలిని ప్రసాదంగా పంచుతారు. తెలంగాణలో బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది. మహిళలు పూలను దొంతరలుగా పేర్చి వేడుక చేసుకుంటారు.
పశ్చిమ బెంగాల్: ఒక రోజు ముందే..
బెంగాల్‌లో పద్ధతి భిన్నంగా ఉంటుంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, అస్సాం, త్రిపురలలో చివరి నాలుగు రోజులు దుర్గా పూజగా జరుపుకుంటారు. ఈ పండుగ సీజన్ అక్టోబర్ 10న వచ్చిన మహాలయతో ప్రారంభమవుతుంది. ఇక పూజాది కార్యక్రమాలు అక్టోబర్ 16న షష్ఠి నాడు మొదలవుతాయి.
ఉత్తర భారతదేశం: ఉపవాసాలు, రామలీల
ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలలో మొదటి రోజు భక్తిభావంతో ఘట స్థాపన చేసి, ఉపవాసం ప్రారంభిస్తారు. ఇళ్లలో లేదా దేవాలయాలలో పూజలు చేస్తారు. ఈ పండుగ రాక్షస సంహార ఘట్టాలను ప్రదర్శించే రామలీలా నాటకాలతో మొదలై, దసరా వేడుకలతో ముగుస్తుంది. కుమారి పూజలు చేస్తారు.
ఇదీ చదవండి: స్మిత్ మచ్చార్‌కు ‘నీమ్ కరోలీ బాబా’ అభినందనలు!


