మావోయిస్టు పార్టీని, ఆ ఉద్యమాన్ని పూర్తిగా అణచివేసేందుకు ఆపరేషన్ కగార్(Operation Kagaar) చేపట్టింది అమిత్ షా నేతృత్వంలోని కేంద్ర హోం శాఖ. ఇందుకోసం 2026 మార్చిని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే.. ఈ ఏడాది కాలంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లు, లొంగుబాట్లు.. ఇతరత్రా పరిణామాలు ఆ లక్ష్యానికి భద్రతా బలగాలను చేరువే చేశాయి.
కేంద్ర హోం శాఖ గణాంకాలు పరిశీలిస్తే.. గత పదేళ్లలో మావోయిస్టు ఉద్యమం తీవ్రంగా క్షీణించింది కూడా. ఈ ఏడాది జనవరిలో ఛత్తీస్‌గఢ్-ఒడిశా-తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఆపరేషన్ కగార్ మొదలయ్యాక.. ఆ పార్టీకి వరుస గట్టి దెబ్బలు తగలడం మొదలైంది.
మావోయిస్టు ఒడిశా రాష్ట్ర కమిటీ చీఫ్ చలపతి (రామచంద్ర రెడ్డి అలియాస్ ప్రతాప్)తోసహా 13 మంది మావోయిస్టులు 2025 జనవరి 21న ఛత్తీస్‌గఢ్–ఒడిశా సరిహద్దులోని జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్‌తో ఒడిషాలో మావోయిస్టు ఉద్యమం శకం ముగిసింది. అయితే.. ఈ ఎన్‌కౌంటరే కగార్‌కు ప్రారంభ సంకేతంగా మారింది. ఇక్కడి నుంచే.. కేంద్రం చేపట్టిన విస్తృత వ్యూహాత్మక చర్యలు మావోయిస్టు ఉద్యమాన్ని తీవ్రంగా దెబ్బతీస్తూ వచ్చాయి.
ఆపరేషన్ కగార్ (Operation Kagaar)లో భాగంగా.. 1 లక్షకు పైగా భద్రతా సిబ్బంది, డ్రోన్లు, AI ఆధారిత నిఘా పరికరాలను దట్టమైన అడవుల్లో వినియోగించాయి భద్రతా బలగాలు. ఈ వ్యూహాత్మక చర్యలు వల్ల మావోయిస్టులు చెల్లాచెదురయ్యారు. ఈ క్రమంలో భారీ ఎన్‌కౌంటర్లు, సామూహిక లొంగుబాట్లు.. ఇంకోవైపు మావోయిస్టు పార్టీలో నాయకత్వ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈలోపు..
అబూజ్‌మడ్ అడవుల్లో మే 21వ తేదీన నంబాల కేశవరావు (బస్వరాజ్) ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. నంబాలతో పాటు ఆ ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టులతో పాటు హతమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్ మావోయిస్టు ఉద్యమానికి వ్యూహాత్మకంగా పెద్ద దెబ్బ అయ్యింది. ఇక్కడి నుంచి మావోయిస్టు కార్యకలాపాలు తగ్గుముఖం పట్టసాగాయి.
ఆ వెంటనే మల్లోజుల వెంకటరావు (సోను), ఆశన్న వంటి కీలక నేతలు సరెండర్ కావడం.. ఇంటెలిజెన్స్ ఆధారంగా కూంబింగ్ ఆపరేషన్లు పెరగడం వల్ల ఉద్యమం లోపల భయాందోళనలు పెరిగాయి. సెంట్రల్‌పై కమిటీ లొంగిపోయిన సభ్యుల ఆరోపణలు.. వాళ్లను ఉద్యమ ద్రోహులుగా సెంట్రల్ కమిటీ ప్రకటించడం.. ఇలా మావోయిస్టు ఉద్యమం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లింది.
గత రెండేళ్లలో వివిధ ఎన్‌కౌంటర్‌లలో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టుల సంఖ్య 430 మంది. లొంగిపోయిన వాళ్లు 1,500 మంది. ఈ మధ్యకాలంలో కేంద్ర కమిటీ సభ్యులే లొంగిపోతుండగా.. చేసేదేం లేక కింది స్థాయిలో కేడర్ కూడా పార్టీని వీడుతూ వచ్చింది. ప్రస్తుతం పార్టీలో కేవలం 12మంది కేంద్ర కమిటీ సభ్యులు మాత్రమే మిగిలినట్లు తెలుస్తోంది. ఇందులో ఓ విశేషం ఉంది. ఆ పన్నెండు మందిలో.. 8 మంది రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలే ఉన్నారు. హనుమంతు, గణపతి, తిరుపతి, చంద్రన్న, సంగం వీళ్లంతా ఇక్కడి వాళ్లే. ఇక కీలకంగా ఉన్న ఒకే ఒక్కడు మడావి హిడ్మా. ఆయన కోసం స్పెషల్ ఆపరేషన్ ఏడాది కాలంగా ఉదృతంగా సాగింది. ఆయన ‘లెక్క తేలిస్తే’.. మావోయిస్టు పార్టీ అధ్యాయం ముగిసినట్లేనని కేంద్ర హోం శాఖ బలంగా భావించింది కూడా. ఇప్పుడు అది కూడా జరగడంతో ఆపరేషన్ కగార్ దాదాపుగా ముగిసినట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు.


