అదే జాబితాలో ఉయికే గణేశ్..తాజాగా రూ.1.20 కోట్ల రివార్డు
ఎన్‌ఐఏ అధికారిక వెబ్‌సైట్‌అప్‌డేట్ హిట్‌లిస్టులోకనిపించని బడే దామోదర్,కంకణాల రాజిరెడ్డి పేర్లు
సాక్షిప్రతినిధి, వరంగల్ : ఆపరేషన్ కగార్‌కు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మావోయిస్టుల కార్యకలాపాలపై మరింత దృష్టి సారిస్తోంది. మరోవైపు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సైతం ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులను అధ్యయనం చేస్తోంది. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీలో ఇంకా కీలకంగా వ్యవహరిస్తున్న నేతల వివరాలపై ఆరా తీస్తోంది.
నెల రోజులపాటు ‘హైడ్’లో ఉంచిన అధికార వెబ్‌సైట్‌ను ఇటీవల అప్‌డేట్ చేసింది. ఇందులో దేశంలోని నాగాలాండ్, మణిపూర్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, జార్ఖండ్‌లతోపాటు వివిధ రాష్ట్రాల్లో తీవ్రవాద, ఉగ్రవాద సంస్థలు, ఆర్థిక నేరగాళ్లను కలిపి మొత్తం 331 మందిని ‘మోస్ట్ వాంటెడ్’లుగా పేర్కొంటూ పేర్లు, వివరాలు పేర్కొంది. 331 మందిలో 82 మంది మినహా అందరి ఫొటోలను వెబ్‌సైట్‌లో ఎన్‌ఐఏ చేర్చింది.
2024లో ఛత్తీస్‌గఢ్‌లో అరెస్టయిన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మొబైల్ పొలిటికల్ స్కూల్ ఇన్‌చార్జ్‌గా బల్మూరి నారాయణరావు అలియాస్ ప్రభాకర్, ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన కేంద్ర కమిటీ నేతలు మోడెం బాలకృష్ణ, మడావి హిడ్మా అలియాస్ సంతోశ్‌ల పేర్లు, ఫొటో లు ఇంకా వెబ్‌సైట్‌లో అలాగే ఉన్నాయి.
కేంద్రం టార్గెట్ గణపతి, దేవ్‌జీ..
మావోయిస్టు పార్టీ కీలక నేతలుగా ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి, కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తాజా ప్రకటనలో పేర్కొంది. కేంద్ర కమిటీ సభ్యుడు మడావి హిడ్మా ఎన్‌కౌంటర్ ఇప్పటికీ సంచలనం కలిగిస్తుండగా, ఆ స్థానంలో పనిచేస్తున్నట్టు ప్రచారమున్న బర్సే దేవ అలియాస్ బర్సే సుక్కను వాంటెడ్ జాబితాలో చేర్చింది.
నల్లగొండ జిల్లాకు చెందిన ఏవోబీ ఇన్‌చార్జ్, కేంద్ర కమిటీ సభ్యుడు ఉయికే గణేశ్ (గురువారం ఒడిశాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు)పై రూ.1.20 కోట్ల రివార్డు ఉండగా.. ఎన్‌ఐఏ తాజా మోస్ట్‌వాంటెడ్ జాబితాలో ఆయన పేరుంది. అనిల్ దా, మెట్టూరి జోగారావు, సోమ్‌జీ, కుమ్మె మాడియం, జైలాల్ మాండవి, దేవా మడకామి, సోహాన్ అలియాస్ రంగా పొట్టం, అశ్విన్ అలియాస్ లచ్చు కోర్సల పేర్లు హిట్‌లిస్టులో పేర్కొన్నారు.
కేంద్ర కమిటీలో కీలకంగా ఉన్న మల్లా రాజిరెడ్డి, యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ మృతి చెందిన తర్వాత ఆయన స్థానంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన బడే దామోదర్ అలియాస్ చొక్కారావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ తదితరుల పేర్లు ఎన్‌ఐఏ జాబితాలో కనిపించలేదు.


