నిర్వాహకులకు కేంద్రం ఉత్తర్వు
భద్రతా అవసరాలకు కీలకమని వ్యాఖ్య
కోర్టును ఆశ్రయించనున్న క్లబ్
న్యూఢిల్లీ: ఢిల్లీ నడిబొడ్డునున్న చారిత్రక జింఖానా క్లబ్‌ను జూన్ 5వ తేదీలోగా తమకు అప్పగించాలంటూ కేంద్రం నిర్వాహకులను ఆదేశించింది. అత్యంత కీలకమైన ల్యుటెన్స్ ప్రాంతం లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని ప్రధానమంత్రి అధికార నివాసాన్ని ఆనుకుని 27.3 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ స్థలం రక్షణ మౌలిక సదుపాయాల బలోపేతానికి, భద్రతను మరింత పటిష్టం చేయడానికి ఎంతో అవసరమని కేంద్రం తన ఆదేశాల్లో పేర్కొంది.
గృహ, పట్టణ వ్యవహారాల శాఖ అధీనంలోని భూ అభివృద్ధి కార్యాలయం(ఎల్ అండ్‌డీవో) ఈ మేరకు ఈ నెల 22వ తేదీన ఉత్తర్వు జారీ చేసింది. సఫ్దర్‌జంగ్ రోడ్ నంబర్–2లోని అత్యంత సున్నితమైన, వ్యూహాత్మకమైన చోట ఉన్న ఈ క్లబ్ స్థలం ప్రజా భద్రత అవసరాల కోసం ఎంతో కీలకమైందని అందులో పేర్కొంది.
నేడు ఢిల్లీ జింఖానా క్లబ్ లిమిటెడ్‌గా అందరికీ పరిచయమైన ఒకప్పటి ఇంపీరియల్ ఢిల్లీ జింఖానా క్లబ్ లిమిటెడ్‌కు ఈ స్థలాన్ని గతంలో ప్రభుత్వం ‘సోషల్ అండ్ స్పోర్టీంగ్ క్లబ్’నిర్వహణ కోసం లీజుకిచ్చిందని అందులో వివరించింది.
పరిపాలనాపరమైన, సంస్థాగతమైన తక్షణావసరాల దృష్ట్యా, ప్రజా ప్రయోజనాల కోసం ఈ భూమి ఎంతో అవసరమని, పక్కనే ఉన్న ప్రభుత్వ భూములతో దీనిని అనుసంధానించాల్సిన అవసరముందని ఎల్ అండ్ డీవో తెలిపింది. లీజ్ డీడ్‌లోని క్లాజ్–4 ద్వారా సంక్రమించిన అధికారం కింద భూ అభివృద్ధి కార్యాలయం ద్వారా భారత రాష్ట్రపతి ఈ భూమిని తిరిగి తక్షణమే స్వా«దీనం చేసుకునేందుకు నిర్ణయించారని తెలిపింది.
మొత్తం 27.3 ఎకరాల్లో ప్రస్తుతమున్న అన్ని భవనాలు, శాశ్వత నిర్మాణాలు, లాన్‌లు, ఇతర అమరికలు అన్నీ లీజు దాత, ఎల్ అండ్ డీవో ద్వారా భారత రాష్ట్రపతికి పూర్తిగా చెందుతాయని పేర్కొంది. ఈ ఉత్తర్వు ప్రకారం జూన్ 5వ తేదీన భూ అభివృద్ధి కార్యాలయం క్లబ్ ఆవరణను స్వా«దీనం చేసుకోనుందని ఆ ఉత్తర్వులో స్పష్టం చేసింది. ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించని పక్షంలో చట్ట ప్రకారం స్వాధీనం చేసుకుంటామని కూడా తెలిపింది.
ప్రభుత్వ ఆదేశాలపై ఢిల్లీ జింఖానా క్లబ్ సభ్యుడు సిద్థార్థ విస్మయం వ్యక్తం చేశారు. క్లబ్ కారణంగా భద్రతకు ముప్పు ఉందనడాన్ని ఆయన తప్పుబట్టారు. అత్యంత భద్రత కలిగిన ఈ ప్రాంతంలో కీలకమైన కేంద్ర ప్రభుత్వ, రక్షణ శాఖ కార్యాలయాలు ఉన్నాయన్నారు. పెద్ద సంఖ్యలో సభ్యులు, ఎంతో చరిత్ర కలిగిన క్లబ్‌ను కాపాడుకునేందుకు తాము కోర్టుకు వెళతామన్నారు. కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు. క్లబ్ స్వాధీనం విషయమై మరోసారి ఆలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
సభ్యత్వం కోసం దశాబ్దాల వెయిటింగ్
బ్రిటిష్ జమానాలో 1913లో ఇంపీరియల్ ఢిల్లీ జింఖానా క్లబ్ పేరుతో దీనిని స్థాపించారు. స్వాతంత్య్రం వచ్చాక పేరును ఢిల్లీ జింఖానా క్లబ్‌గా మార్చారు. ఇప్పుడున్న కట్టడాలన్నీ 1930ల్లో నిర్మించినవే. ఇందులో సభ్యత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యవహారంగా మారింది. ప్రస్తుతం ఈ క్లబ్ సభ్యుల సంఖ్య 11 వేలు కాగా ఇందులో కొత్తగా చేరాలనుకునే వారు 30–40 ఏళ్లు వేచి ఉండక తప్పదని జింఖానా సెక్రటరీ తెలిపారు. ప్రస్తుతం 3 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఏటా ఖాళీ అయ్యే స్థానాల్లో 70 మంది వరకు కొత్తగా తీసుకుంటుంటారు. ఇందులో వెయిటింగ్ ఫీజే రూ.7.5 లక్షలు. ప్రభుత్వ అధికారి కేటగిరీ కింద సాధారణ రుసుము రూ.4.5 లక్షలు, ప్రభుత్వేతర కేటగిరీ అయితే రూ.18.91 లక్షల ఫీజు కట్టాల్సి ఉంటుంది. సభ్యత్వానికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.


