
ఉల్లంఘనలకు ఏడేళ్ల జైలు, భారీ జరిమానా
ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు
కఠిన నిబంధనలతో కేంద్రం ముసాయిదా జారీ
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో జరుగుతున్న అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ రంగాన్ని నియంత్రించేందుకు ‘ది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్–2025’పేరుతో అత్యంత కఠినమైన నిబంధనలతో ముసాయిదాను విడుదల చేసింది. తాజా నిబంధనల ప్రకారం, డబ్బుతో పందెం ఆటలను (ఆన్‌లైన్ మనీ గేమ్స్) నిర్వహించే వారికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.20 లక్షల జరిమానా విధించనున్నారు. ఈ నిబంధనల అమలు కోసం సివిల్ కోర్టు అధికారాలతో ‘ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా’ను ఏర్పాటు చేయనున్నారు.
అన్ని అధికారాలతో అథారిటీ
కొత్తగా ఏర్పాటయ్యే ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీకి విస్తృత అధికారాలు కట్టబెట్టారు. అథారిటీ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంటుంది. ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి దీనికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. సమాచార, ప్రసార, యువజన వ్యవహారాలు, క్రీడలు, ఆర్థిక సేవల శాఖల అధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ అథారిటీకి సివిల్ కోర్టుకు సమానమైన అధికారాలు ఉంటాయి. ఏ గేమ్‌ను ‘ఆన్‌లైన్ మనీ గేమ్’గా వర్గీకరించాలనే తుది నిర్ణయం అథారిటీకే ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే రిజి్రస్టేషన్లను రద్దు చేయడం లేదా సస్పెండ్ చేయడంతో పాటు, చట్టవిరుద్ధమైన వేదికలను బ్లాక్ చేయాలని బ్యాంకులు, ఇతర సరీ్వస్ ప్రొవైడర్లను ఆదేశించగలదు.
భారీ జరిమానాలు, కఠిన శిక్షలు
ముసాయిదాలో నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు ప్రతిపాదించారు. ఆన్‌లైన్ మనీ గేమ్స్ నిర్వహిస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.20 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. అథారిటీ ఆదేశాలను పాటించకపోవడం వంటి ఇతర ఉల్లంఘనలకు మూడేళ్ల వరకు జైలు, రూ.10 లక్షల జరిమానా విధించవచ్చు. ఈ–స్పోర్ట్స్, ఆన్‌లైన్ సోషల్ గేమ్‌లను అందించే ప్రతి సంస్థ తప్పనిసరిగా అథారిటీ వద్ద నమోదు చేసుకోవాలి.
ఈ రిజి్రస్టేషన్ సర్టిఫికెట్ ఐదేళ్ల వరకు చెల్లుబాటులో ఉంటుంది. వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం పటిష్టమైన మూడంచెల యంత్రాంగాన్ని ప్రతిపాదించారు. మొదటిది గేమింగ్ కంపెనీ గ్రీవెన్స్ ఆఫీసర్, రెండోది స్వీయ–నియంత్రణ సంస్థ, మూడోది ప్రభుత్వం ఏర్పాటు చేసే అప్పిలేట్ బాడీ. దీని ద్వారా వినియోగదారుల ఫిర్యాదులకు స్పష్టమైన, సమర్థవంతమైన పరిష్కారం లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ–స్పోర్ట్స్‌ను క్రీడల శాఖ, ఆన్‌లైన్ సోషల్ గేమ్‌లను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నియంత్రిస్తుంటాయి.