ఒంటరిగా ముగ్గురు దొంగలను ఎదుర్కొన్న మహిళ.. చివరికి ఏమైందంటే! | Caught On CCTV: 3 Robbers Try To Break In Punjab Woman Stops Them Alone | Sakshi
Sakshi News home page

ఒంటరిగా ముగ్గురు దొంగలను ఎదుర్కొన్న మహిళ.. చివరికి ఏమైందంటే!

Oct 2 2024 3:47 PM | Updated on Oct 2 2024 5:04 PM

Caught On CCTV: 3 Robbers Try To Break In Punjab Woman Stops Them Alone

ఓ మహిళా తన ఇంట్లోకి దొంగలు రాకుండా నిలువరించింది. ముగ్గురు వ్యక్తులను ఒంటరిగా ఎదుర్కొని.. వారితో పోరాడింది. దొంగల నుంచి తనను, తన కుటుంబాన్ని రక్షించుకుంది. చివరికి దొంగలు చేసేందేంలేక అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లారు. ఈ ఘటన పంజాబ్‌ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో వెలుగుచూసింది. మన్‌దీప్‌ కౌర్‌ అనే మహిళ తన భర్త జగ్గీత్‌సింగ్‌, పిల్లలతో నివసిస్తుంది. సోమవారం సాయంత్రం మన్‌దీప్‌ కౌర్‌ బాల్కనీలో బట్టలు ఆరేస్తుండగా ముగ్గురు వ్యక్తులు ముసుగులు ధరించి దొంగతనం చేసేందుకు వచ్చారు.

మెల్లమెల్లగా దొంగలు ఆమె ఇంటి వైపు రావడం గమనించింది. వెంటనే లోపలికి వెళ్లి తలుపుకు తాళం వేయడానికి పరుగెత్తింది. అయితే దొంగలు లోపలికి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. డోర్‌ను గట్టిగా నెట్టడం ప్రారంభించారు. కానీ కౌర్‌ తన శక్తితో వారు లోపలికి రాకుండా అడ్డుకుంది. చివరికి డోర్‌కు తాళం వేసి.. పక్కన ఉన్న సోఫాను తలుపుకు అడ్డంగా పెట్టింది.

ఈ దృశ్యాలు అన్నీ ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. మహిళ దొంగలను ధైర్యవంతంగా ఎదుర్కోవడం, డోర్‌ పెట్టి, ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేసేందుకు గట్టిగట్టిగా అరుస్తూ ఉండటం వీడియోలో కనిపిస్తుంది. దొంగలు వెళ్లిపోయారో లేదో కిటికీ ద్వారా చూస్తూ ఎవరికో ఫోన్‌ కూడా చేసింది. ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కాక.. ఆమె కొడుకు, కూతురు అటు ఇటు కంగారుగా చూడటం కనిపిస్తుంది. చివరికి దొంగలు ఏం చేయలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

 మహిళా ధైర్య సాహాసాలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీస్‌ అధికారి ఏకే సోహి తెలిపారు. జగ్గీత్‌ సింగ్‌ నగల వ్యాపారి కాగా..దొంగలు వారి ఇంటిని టార్గెట్ చేయడానికి ఇదే కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement