
న్యూఢిల్లీ:ప్రపంచంలోని పలు దేశాలపై ఇష్టమొచ్చిన రీతిలో సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, దీనికి భిన్నంగా కంబోడియా ట్రంప్‌కు మద్దతు పలుకుతోంది. పైగా ఆయన అసాధారణ రాజనీతిజ్ఞుడంటూ కితాబిచ్చింది. దీనివెనుక ప్రత్యేక కారణముంది.
పాకిస్తాన్, ఇజ్రాయెల్ ఇప్పుడు కంబోడియా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతిని ప్రధానం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ట్రంప్ కూడా తాను ప్రపంచ శాంతిదూతను అని చెప్పుకుంటూ నోబెల్‌కు అర్హుడనని అంటున్నారు. ఇస్లామాబాద్, టెల్ అవీవ్ ఇప్పుడు కంబోడియాలోని మిత్రదేశాలు ట్రంప్‌కు నోబెల్ ఇవ్వాలంటూ ఒకే స్వరాన్ని ఆలపిస్తున్నాయి. తాజాగా యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కంబోడియా నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది. దీనితో నోబెల్ శాంతి బహుమతి డిమాండ్‌కు మద్దతు ఇస్తున్న మూడవ దేశంగా కంబోడియా నిలిచింది.
ఈ అంశంపై కంబోడియా ప్రధాని హున్ మానెట్ మాట్లాడుతూ తాము ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తున్నామని, కంబోడియా- థాయిలాండ్ మధ్య సరిహద్దు వివాదాన్ని నియంత్రించడంలో ఆయన అసాధారణ రాజనీతిజ్ఞతను చూపారని ప్రశంసించారు. అలాగే తమ దేశంపై సుంకాన్ని 49 శాతం నుంచి 19 శాతానికి తగ్గించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఫేస్‌బుక్ పోస్ట్‌లో హున్ మానెట్ ఈ ప్రకటన చేశారు. ట్రంప్ జోక్యం అనేది ప్రపంచంలోని అత్యంత అస్థిర ప్రాంతాలలో ఉద్రిక్తతలను తగ్గించడానికి, దోహదపడుతున్నదంటూ నార్వేజియన్ నోబెల్ కమిటీకి ఆయన పేరును పంపినట్లు పేర్కొన్నారు. జూలై 26న ట్రంప్ పిలుపు కారణంగా థాయిలాండ్- కంబోడియా మధ్య యుద్ధ ప్రతిష్టంభన తొలగిందని, జూలై 28న కాల్పుల విరమణ జరిగిందనే వార్తలు వినిపించాయి. ఈ ఘర్షణల్లో 43 మంది మృతిచెందగా, మూడు లక్షల మంది నిరాశ్రయులయ్యారు. కాగా భారత్- పాక్ మధ్య జరిగిన ఘర్షణలతో సహా ఆరు వివాదాలకు ట్రంప్ ముగింపు పలికేలా చేశారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఇటీవల అన్నారు.