లేడీ ఇన్‌ఫ్లుయెన్సర్‌పై కేసు.. ఆ రాత్రి ఏం జరిగింది? | Boyfriend Falls From Balcony Influencer Sends Him To Hospital With Driver | Sakshi
Sakshi News home page

లేడీ ఇన్‌ఫ్లుయెన్సర్‌పై కేసు.. ఆ రాత్రి ఏం జరిగింది?

Oct 11 2026 9:18 AM | Updated on Oct 11 2026 9:34 AM

Boyfriend Falls From Balcony Influencer Sends Him To Hospital With Driver

లక్నోలో కేఫ్‌ యజమాని శివ శర్మ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. బాల్కనీ నుంచి పడి ప్రాణాలు కోల్పోయిన అతడిని ప్రియురాలు కొంతకాలంగా బ్లాక్‌మెయిల్‌ చేస్తూ, శారీరకంగా వేధించేదని తల్లి ఆరోపించడం సంచలనంగా మారింది. పెళ్లి ప్రస్తావన తర్వాత వేధింపులు మరింత పెరిగాయని ఆమె ఫిర్యాదు చేశారు.  సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ అయిన ప్రియురాలు శ్రద్ధా దూబేపై హత్య కేసు నమోదైంది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? అన్నది మిస్టరీగా మారింది.

తన కుమారుడికి సంబంధించిన అసభ్యకరమైన వీడియోలను బయటపెడతానని, పరువు తీస్తానని శ్రద్ధా బెదిరించేదని తల్లి ఆరోపించారు. ఈ వేధింపులు సుమారు నాలుగు నెలలుగా కొనసాగుతున్నాయని తెలిపారు. రంజనా శర్మ ఫిర్యాదు ప్రకారం.. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో శ్రద్ధా ఆమెకు ఫోన్‌ చేసి, తన బాల్కనీ నుంచి శివ కిందపడ్డాడని, ఆస్పత్రికి తీసుకెళ్తున్నామని చెప్పింది. కొద్దిసేపటి తర్వాత మళ్లీ ఫోన్‌ చేయగా.. తన డ్రైవర్‌ శివను ఆస్పత్రికి తీసుకెళ్లాడని తెలిపింది. డ్రైవర్‌ ఫోన్‌ నంబర్‌ను కూడా ఇచ్చింది.

దీంతో రంజనా శర్మ లక్నోలోని కింగ్‌ జార్జ్‌ మెడికల్‌ యూనివర్సిటీ (కేజీఎంయూ) ఆస్పత్రి అత్యవసర విభాగానికి చేరుకున్నారు. అక్కడ ఓ ప్రైవేటు అంబులెన్స్‌ ఉండగా.. దాని సమీపంలో ఉన్న డానిష్‌ అనే వ్యక్తి తాను శ్రద్ధా డ్రైవర్‌నని చెప్పాడని.. తన కుమారుడికి ఏమైందని ప్రశ్నించగా, తనకేమీ తెలియదని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం శివను ఆస్పత్రిలోకి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

తన కుమారుడిని శ్రద్ధా ఒత్తిడికి గురిచేసేదని.. తమకు నచ్చినట్లు నడుచుకోవాలంటూ వేధింపులకు పాల్పడేందని.. మాట వినకపోతే బెదిరింపులకు దిగేదని తెలిపారు. గతంలోనూ శివ శరీరంపై గాయాల గుర్తులు కనిపించాయని.. వాటి గురించి అడిగితే అతడు ఏమీ చెప్పకుండా దాటవేసేవాడని ఆమె పేర్కొన్నారు.

శివ మృతికి సుమారు 20–25 రోజుల ముందు హజ్రత్‌గంజ్‌లోని ఓ హనుమాన్‌ ఆలయంలో శ్రద్ధాను కలిసినట్లు అతడి తల్లి తెలిపారు. ఆ సమయంలో పెళ్లి విషయం ప్రస్తావించగా.. శ్రద్ధా అంగీకరించిందని చెప్పారు. ఇరు కుటుంబాల సమ్మతితో చిన్న కార్యక్రమం నిర్వహించాలని తాను సూచించినట్లు వెల్లడించారు. అయితే, పెళ్లి చర్చల తర్వాత శ్రద్ధా ప్రవర్తన మరింత మారిందని ఆరోపించారు. తన భర్త వర్ధంతి సందర్భంగా శివ ఇంటికి వచ్చినప్పుడు కూడా శ్రద్ధా పదేపదే ఫోన్‌ చేసేదని రంజనా శర్మ తెలిపారు. తిరిగి తన వద్దకు రాకపోతే దొంగతనం కేసులో ఇరికిస్తానని బెదిరించిందని ఆరోపించారు.

శివ మృతదేహంపై గాయాలు ఉన్నాయని అతడి తల్లి ఆరోపించారు. పక్కటెముకలు, భుజాలు, చేతులు, తొడలపై సిగరెట్‌తో కాల్చిన గుర్తులు ఉన్నాయని పేర్కొన్నారు. దవడకు తీవ్ర గాయమైందని, కళ్ల నుంచి, చెవులు, ముక్కు నుంచి రక్తస్రావం జరిగినట్లు కనిపించిందని తెలిపారు. తన కుమారుడి మృతికి ముందు అతడిపై దాడి జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై పోలీసులు శ్రద్ధా దూబేతో పాటు ఆమె సోదరి రష్మీ దూబే, డానిష్‌ అనే డ్రైవర్‌, ఆదిల్‌ అనే మరో వ్యక్తి, గుర్తుతెలియని మరికొందరిపై కేసు నమోదు చేశారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శివ బాల్కనీ నుంచి ఎలా కిందపడ్డాడు? మృతికి ముందు ఏం జరిగిందనే దానిపై విచారణ కొనసాగుతోంది.

ఇదీ చదవండి: పెళ్లి చేసుకోవచ్చు.. కానీ రిసెప్షన్‌ చేసుకోకూడదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement