వివాహం అంటే కేవలం రెండు మనసుల కలయిక మాత్రమే కాదు, బంధుమిత్రుల సంబరం. అయితే ఇటీవల రోజుల్లో పెళ్లి, ఆ తర్వాత ఘనంగా నిర్వహించే విందు(రిసెప్షన్) కేవలం సంప్రదాయంగా మిగలకుండా ప్రతిష్టకు నిలయంగా మారింది. వాళ్లు పది గొర్రెలు కోశారు, మనం ఏమీ తక్కువ చేయకూడదు అనే అహంభావం పేద, మధ్య తరగతి వర్గాలను అప్పుల ఊబిలోకి నెడుతోంది. ఈ ఆడంబరాలు, దుబారా ఖర్చులకు కళ్లెం వేసేందుకు శివమొగ్గ జిల్లా శికారిపుర తాలూకా హరగి గ్రామస్తులు గట్టి ముందడుగు వేశారు. కరువుతో రైతులు, పేద కుటుంబాలు అల్లాడుతున్న నేపథ్యంలో గ్రామంలో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేయడాన్ని పూర్తిగా నిషేధిస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. గ్రామస్తుల ఏకాభిప్రాయ నిర్ణయం మేరకు రాబోయే రోజుల్లో రిసెప్షన్ ఏర్పాటు చేస్తే అలాంటి వారికి రూ.1 లక్ష జరిమానా, ఎవరైనా ఆ రిసెప్షన్‌లో భోజనం చేస్తే వారికి రూ.50 వేల భారీ జరిమానా విధించాలని నిర్ణయించారు.
చర్చనీయంగా గ్రామస్తుల నిర్ణయం
ఆర్థిక క్రమశిక్షణను కాపాడేందుకు గ్రామస్తులు తీసుకున్న ఈ కఠిన నిర్ణయం ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా భారీ చర్చకు దారి తీసింది. సుమారు 350 కుటుంబాలు ఉన్న హరగి గ్రామంలో చాలా వరకు ఈడిగ సముదాయం వాసులే ఎక్కువగా నివసిస్తున్నారు. గతంలో 10 నుంచి 15 మందికి పరిమితమైన పెళ్లి వేడుక ఇప్పుడు షామియానాలు, టేబుళ్లు, కిరాణ సరుకులు, పెళ్లి కొడుకు వారి ఖర్చులతో సహా కనీసం రూ.8 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చు చేయాల్సిన భారీ ట్రెండ్‌గా మారింది.
పేదలు కనీసం రూ.2 లక్షలను అప్పు చేసి ఈ భోజనాలు పెట్టించాల్సిన అనివార్యత నెలకొంది. ప్రత్యేకంగా పెళ్లికుమార్తె కుటుంబానికి భారీ ఆర్థిక భారంగా మారింది. రిసెప్షన్ మలెనాడు ప్రాంతంలో సంప్రదాయం కాదు. పాత మైసూరు ప్రాంతంలోని మండ్య, హాసన, చామరాజనగర, రామనగర, బెంగళూరు గ్రామీణ జిల్లాల పద్ధతి. అది ఈ వైపునకు కూడా విస్తరించింది. మొత్తం మీద ప్రెస్టేజీ ప్రదర్శన కన్నా మానవత్వం, ఆర్థిక భద్రత ముఖ్యం అనే మహత్తర సందేశాన్ని హరగి గ్రామం చాటింది.
గ్రామస్తుల నిర్ణయం స్వాగతార్హం
ఈ విషయంపై గ్రామాభివృద్ధి కార్యదర్శి గురుమూర్తి హరగి మాట్లాడుతూ ఇటీవల రోజుల్లో రిసెప్షన్ నిర్వహించే పద్ధతి అధికమైంది. దీంతో వెనుక బడిన, పేద, మధ్య తరగతి వర్గాలకు ఆర్థికభారం అధికమైంది. ఈనేపథ్యంలో గ్రామస్తులంతా ఐకమత్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఎస్‌డీఎంసీ ఉపాధ్యక్షుడు సోమశేఖర్ మాట్లాడుతూ శికారిపుర తాలూకా హరగి గ్రామస్తుల నిర్ణయం స్వాగతార్హం. ఇలాంటి సంప్రదాయానికి కళ్లెం వేయడం వల్ల కుటుంబాలకు ఆర్థిక భారం తప్పుతుందన్నారు. ఇతర గ్రామాల వారు స్వచ్ఛందంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.
-కర్ణాటక


