
ముంబైకర్లు, జైన్ సమాజం ఆందోళన
కార్పొరేషన్ సిబ్బంది, పోలీసులతో వాగ్వాదం
మూసివేత తాత్కాలికంగా రద్దు చేసిన బీఎంసీ
తాత్కాలిక రద్దు హామీతో తగ్గిన ఉద్రిక్తత
ముంబై: దాదర్‌లోని ప్రముఖ కబూతర్ ఖానా మూసివేత వివాదం రోజురోజుకూ ముదురుతోంది. కబూతర్ ఖానాను మూసివేయాలని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తీసుకున్న నిర్ణయంపై ముంబైకర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. పావురాలకు దాణా వేయవద్దని బీఎంసీ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఎవరైనా దాణా వేసే ప్రయత్నం చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఆ మేరకు కబూతర్ ఖానాపై పావురాలు వచ్చి వాలకుండా, పక్షుల ప్రేమికులు దాణా వేయకుండా ప్లాస్టిక్ షీట్‌ను కప్పారు. దీంతో కబూతర్ ఖానాకు ఎదురుగా ఉన్న జైన్ మందిరానికి వచ్చే భక్తులు, సామాన్య ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. బుధవారం ఉదయం పెద్ద సంఖ్యలో అక్కడకు వచ్చిన జైన్ సమాజం ప్రజలు ప్లాస్టిక్ షీట్‌ను తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
బీఎంసీ అధికారులు, సిబ్బంది, పావురాలకు దాణా వేయకుండా కాపలా కాస్తున్న పోలీసులు, జైన్ సమాజం ప్రజల మధ్య కొద్దిసేవు వాగ్వాదం నెలకొంది. కబూతర్ ఖానాను మూసివేయవద్దంటూ సాధారణ ప్రజలు, జైన్ వర్గం ప్రజలు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. దీంతో దాదర్ రైల్వే స్టేషన్ దిశగా వెళ్లే రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది. కబూతర్ ఖానా (Kabutar khana) చుట్టూ తిరిగి వచ్చే వాహనాలు కూడా ఎక్కడిక్కడే నిలిచిపోవడంతో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఉదయం విధులకు వెళ్లే వివిధ రంగాల ఉద్యోగులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా బాంబే హైకోర్టు (Bombay High Court) ఆదేశాల మేరకే కబూతర్ ఖానాను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు బీఎంసీ అధికారులు తెలిపారు. అయినప్పటికీ వీరంతా ఆందోళనను ఆపలేదు. దీంతో కబూతర్ ఖానాను మూసియబోమని బీఎంసీ అధికారులు తాత్కాలికంగా ప్రకటించడంతో ఆందోళన విరమించారు.
హైకోర్టు నిర్ణయం మేరకే మూసివేత: బీఎంసీ
ముంబై నడిబొడ్డున ఉన్న దాదర్ ప్రాంతంలో కబూతర్ ఖానా ఉంది. దాదర్‌లో పశ్చిమ, సెంట్రల్ రైల్వే మార్గాలు కలుస్తాయి. అంతేగాకుండా ఇక్కడ ఫాస్ట్ లోకల్ రైళ్లతోపాటు ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ (సీఎస్‌ఎంటీ) నుంచి దూరప్రాంతాలకు బయలుదేరే, అక్కడి నుంచి సీఎస్‌ఎంటీ దిశగా వెళ్లే మెయిల్, ఎక్స్‌ప్రెస్, వందేభారత్, దురంతో వంటి ఆధునిక రైళ్లు ఆగుతాయి. అదేవిధంగా దాదర్ వివిధ వ్యాపారాలకు కేంద్ర బిందువుగా ఉంది. దీంతో ఈ ప్రాంతం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ప్రయాణికులు, షాపింగ్‌లకు వచ్చే జనాల రాకపోకలతో బిజీగా ఉంటుంది. దాదర్ పశ్చిమ దిశలో సుమారు 60 ఏళ్ల కిందట నిర్మించిన కబూతర్ ఖానా రైల్వే స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉంది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు సుమారు వంద రెట్లు వాహనాలు, జనాల సంఖ్య పెరిగింది.
ముక్కు మూసుకుని వెళ్లాల్సి వస్తోంది
ముఖ్యంగా ఈ కబూతర్ ఖానావల్ల రాకపోకలు సాగించే జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పావురాలకు వేస్తున్న దాణా కుళ్లిపోవడం, వాటి రెట్టల వల్ల పరిసరాలు తీవ్ర దుర్గంధం వెదజల్లుతున్నాయి. వాటి శరీరంలో ఉన్న సుక్ష్మజీవులవల్ల ప్రజల ఆరోగ్యానికి హానీ జరుగుతుంది. దీంతో ఈ ప్రాంతం మీదుగా రాకపోకలు సాగించేవారు ముక్కు మూసుకుని వెళ్లాల్సి వస్తోంది. రెట్టల వల్ల ఉత్పన్నమయ్యే సూక్ష్మజీవులతో వివిధ రకాల తీవ్ర శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ వివాదం ముంబై హైకోర్టు వరకు వెళ్లింది. దీంతో ఇటీవల జరిగిన విచారణలో మనుషుల ఆరోగ్యంతో చెలగాటమాడే అధికారం ఎవరికి లేదని, దాదర్‌తోపాటు ఉప నగరాల్లో ఉన్న కబూతర్ ఖానాలన్నీ మూసి వేయాలని ఇటీవలి విచారణ సందర్భంగా కోర్టు ఆదేశించింది.

ఈ మేరకు పావురాలకు దాణా వేయకూడదని, ఒకవేళ వేస్తే చర్యలు తీసుకుంటామని బీఎంసీ (BMC) హెచ్చరించింది. అనేక ప్రాంతాల్లో బోర్డులు, ప్లెక్సీలు ఏర్పాటు చేసింది. బందోబస్తుకోసం పోలీసులను ఏర్పాటుచేసింది. అంతటితో ఊరుకోకుండా కబూతర్ ఖానా చుట్టూ ఆధునిక సీసీ టీవీ కెమరాలు ఏర్పాటు చేసింది. మూసివేసే ప్రయత్నంలో భాగంగా కబూతర్‌ఖానా చుట్టు ప్లాస్టిక్ షీట్ కప్పడంతో పక్షి ప్రేమికులు, సాధారణ ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుని ఆందోళన చేపట్టారు. మూసివేయబోమని తాత్కాలికంగా బీఎంసీ అధికారులు స్పష్టం చేయడంతో ఆందోళన విరమించుకున్నారు.