
తన ఆటోతో ఇజ్రాయెల్ (Image Credit: TOI)
'ఆశ కేన్సర్ ఉన్న వాడిని బతికిస్తుంది. భయం అల్సర్ ఉన్న వాడిని కూడా చంపేస్తుంది'.. జులాయి సినిమాలోని డైలాగ్ ఇది. ఇప్పుడీ డైలాగ్ ఎందుకు గుర్తుకు వచ్చిందనేగా మీ డౌటు? అయితే మనవ గురుగ్రామ్‌కు చెందిన ఇజ్రాయెల్, అష్రఫుల్ అనే ఇద్దరు ఆటోడ్రైవర్ల గురించి తెలుసుకోవాలి. అంత ఘనకార్యం ఏం చేశారని అనుకుంటున్నారా? మామూలుగా సేఫ్టీ ఫీచర్లన్నీ సవ్యంగా ఉన్న కారులో ఓ వంద కిలోమీటర్ల ప్రయాణం అంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం. కానీ పైన చెప్పుకున్న ఇద్దరు కుటుంబ సభ్యులతో కలిసి రెండు ఆటోల్లో ఏకబిగిన 1400 కిలోమీటర్లు ప్రయాణం చేసి అందరినీ అవాక్కయ్యేలా చేశారు. వారేదో సరదా కోసమో, థ్రిల్ కోసమో అలా చేయలేదు. మరెందుకు చేశారు?
ఇజ్రాయెల్, అష్రఫుల్ అన్నదమ్ములు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లా గజోల్ పట్టణం నుంచి పని వెతుక్కుంటూ 16 ఏళ్ల క్రితం ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌కు వలస వెళ్లారు. చిన్న చిన్న పనులు చేసి కూడబెట్టిన డబ్బుతో రెండు ఆటోలు కొనుక్కుని జీవనం సాగిస్తున్నారు. భర్తలకు తోడుగా వారి భార్యలు గురుగ్రామ్ (Gurugram) సెక్టార్ 49లో ఇళ్లల్లో పనిచేసేవారు. ఇజ్రాయెల్‌కు 9 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అంతా సాఫీగా గడిచిపోతుదనుకుంటున్న సమయంలో 15 రోజుల క్రితం వారి జీవితాల్లో కల్లోలం రేగింది.
బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చేడనే అనుమానంతో ఇజ్రాయెల్, అష్రఫుల్ బంధువొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల తర్వాత పోలీసులు అతడిని విడుదల చేసినప్పటికీ, ఇద్దరు సోదరులకు ఇబ్బందులు మొదలయ్యాయి. వారుంటున్న ఇల్లు ఖాళీ చేయాలని యజమాని హుకుం జారీచేశాడు. దీనికి తోడు పోలీసుల భయం. 'మమ్మల్నిఇంటి ఓనర్ ఖాళీ చేయమన్నాడు. మా దగ్గర ఆధార్ కార్డు, EPIC ఉన్నాయి. కానీ ఏదో భయం. పోలీసులు మమ్మల్ని కూడా తీసుకెళ్తారని బాగా భయపడిపోయాం. అలాంటి అనిశ్చితిలో గురుగ్రామ్‌ను విడిచిపెట్టాలనుకున్నాం. మాకు జీవనాధారమైన ఆటోలను వదిలిపెట్టేందుకు మనసు రాలేదు. ఆటోల్లోనే గజోల్‌కు తిరిగి వెళ్లాలనుకున్నామ'ని ఇజ్రాయెల్ చెప్పాడు.
పోలీసులకు లంచాలు ఇచ్చి..
అనుకున్నదే తడవుగా కొన్ని ముఖ్యమైన వస్తువులను ప్యాక్ చేసుకుని ఇద్దరు సోదరులు కుటుంబ సభ్యులతో కలిసి రెండు ఆటోల్లో ఆగస్టు 1 గురుగ్రామ్ నుంచి బెంగాల్‌కు ప్రయాణం మొదలుపెట్టారు. అయితే వారి ప్రయాణం సాఫీగా సాగలేదు. హైవేలపై పోలీసులు కనిపించిప్పుల్లా భయంతో వణికిపోయారు. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) గుండా వెళుతున్నపుడు కొంత మంది పోలీసులకు లంచాలు ఇచ్చి ముందుకు సాగారు.
బిహార్‌లో దారి తప్పిపోయారు. ఉత్తర దినాజ్‌పూర్‌లోని రాయ్‌గంజ్‌లో వెళ్లడంతో రూటు మారిపోయింది. చివరకు దక్షిణ దినాజ్‌పూర్‌లోని బునియాద్‌పూర్ వద్ద ట్రాఫిక్ పోలీసుల సహాయంతో మళ్లీ సరైన దారిలోకి వచ్చారు. ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా రెండున్నర రోజుల్లో ఆటోల్లో 1400 కిలోమీటర్లు ప్రయాణించి సొంతూరికి చేరుకున్నారు. వీరి గురించి మాల్దా జిల్లా (Malda District) అధికార యంత్రాంగానికి సమాచారం అందడంతో కలెక్టర్ నితిన్ సింఘానియా స్పందించారు. అన్నిధాలుగా వారికి సహాయం అందిస్తామని హామీయిచ్చారు.
మళ్లీ గురుగ్రామ్‌కు..
సొంతూరికి వచ్చిన తర్వాత మళ్లీ భవిష్యత్తు గురించి బెంగ మొదలైంది. పని కోసం మళ్లీ గురుగ్రామ్‌కు వెళ్లాలని అనుకుంటున్నారు. అయితే అక్కడ పోలీసుల వేధింపులు తగ్గే వరకు వేచి ఉంటామని వారు మీడియాకు చెప్పారు. పోలీసు భయం కారణంగానే ఈ సోదరులిద్దరూ ఇంత రిస్క్ చేసి ఆటోల్లో సొంతూరికి తిరిగొచ్చారు.
చదవండి: డిబ్బి డబ్బులతో కాలేజీ ఫీజులు కట్టేస్తున్న స్కూల్ పిల్లలు!