బీఎంసీ పోరులో ఘనవిజయం
శివసేన 28 ఏళ్ల ఆధిపత్యానికి గండి
కలిసి పోటీ చేసినా ఠాక్రేలకు ఓటమే
పురపాలికలన్నింటా మహాయుతి జోరే
రాష్ట్రవ్యాప్తంగా 29కి గాను 25 చోట్ల గెలుపు
లాతూర్ మినహా కాంగ్రెస్‌కు మొండిచేయే
చంద్రపూర్‌లోనూ మెజారిటీకి చేరువగా
ఊసులో లేకుండా పోయిన పవార్ పార్టీ
సొంత గడ్డ పుణెలోనూ ఘోర పరాభవం
ముంబై: మహారాష్ట్రలో పురపాలక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని అధికార మహాయుతి కూటమి మెరిసింది. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైపై కాషాయ జెండా ఎగరేసింది. తద్వారా బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)పై దాదాపు మూడు దశాబ్దాల శివసేన ఆధిపత్యానికి ఎట్టకేలకు తెర దించింది. దేశంలోనే గాక ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్న కార్పొరేషన్‌గా పేరొందిన బీఎంసీలో 227 కార్పొరేటర్ స్థానాలకు గాను అధికార మహాయుతి కూటమి భాగస్వాములు శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్)తో కలిసి బీజేపీ ఇప్పటికే 116 సీట్లను కైవసం చేసుకుంది.
తద్వారా 114 స్థానాల మెజారిటీ మార్కును దాటేసింది. కడపటి ఫలితాలు అందేసరికి కాషాయ పార్టీ సొంతంగానే 87 స్థానాలు సాధించింది. తద్వారా 2017లో 82 సీట్లు సాధించిన సొంత రికార్డును అధిగమించింది. ఇంకా పలుచోట్ల ముందంజలో ఉంది. శివసేన (షిండే) 27 స్థానాలను గెలుచుకుంది. మహాయుతి కూటమిలోని మరో పార్టీ ఎన్సీపీ (అజిత్) 2 సీట్లు గెలుచుకుంది. బీఎంసీపై పట్టును ఎలాగైనా నిలుపుకునేందుకు ఠాక్రే సోదరులు శివసేన (ఎంబీటీ) సారథి ఉద్ధవ్, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) చీఫ్ రాజ్ పరస్పర వైరానికి స్వస్తి పలికి ఎన్నికల ముంగిట చేతులు కలిపినా లాభం లేకపోయింది.
వారి ఆశలపై ముంబై ఓటర్లు నీళ్లు చల్లారు. ఉద్ధవ్ సేన 64 సీట్లకు పరిమితం కాగా ఎంఎన్‌ఎస్ 6 చోట్ల మాత్రం నెగ్గింది. ఉద్ధవ్ పార్టీ కనీసం మరో 5 చోట్ల ముందంజలో ఉంది. బీఎంసీ సహా రాష్ట్రంలో 29 మున్సిపల్ కార్పొరేషన్లలో గురువారం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం చేపట్టిన ఓట్ల లెక్కింపులో మహాయుతి ఆరంభం నుంచే స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. ముంబైతో పాటు అత్యధిక కార్పొరేషన్లను చేజిక్కించుకుంది. ఇక శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అన్నిచోట్లా ఘోర ఓటమే చవిచూసింది. భివండీ మినహా ఏ కార్పొరేషన్‌లోనూ కనీసం రెండంకెల స్కోరుకు కూడా చేరుకోలేక చతికిలపడింది.
ముంబైలోనైతే ఒకే ఒక్క కార్పొరేటర్ స్థానానికి పరిమితమైంది! సొంత గడ్డ అయిన పుణెలో కూడా ఘోర పరాభవం పాలైంది. 165 స్థానాలకు గాను కేవలం నాలుగు సీట్లతో సరిపుచ్చుకుంది. అక్కడ బీజేపీ ఒంటరిగానే ఏకంగా 123 సీట్లు దక్కించుకుంది. ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా అత్యధిక పురపాలికల్లో నేలచూపులే చూసింది. బీఎంసీలో హస్తం పార్టీకి కేవలం 24 స్థానాలు దక్కాయి. లాతూర్ కార్పొరేషన్‌లో సొంతంగా మెజారిటీ సాధించడం ఒక్కటే ఆ పార్టీకి ఊరటగా నిలిచింది. మొత్తం 29 కార్పొరేషన్లకు గాను మహాయుతి కూటమి 25 స్థానాలను చేజిక్కించుకోవడం ఇప్పటికే ఖాయమైంది. పురపాలికల ఫలితాల పట్ల ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హర్షం వెలిబుచ్చారు.
54 శాతం పోలింగ్
మహారాష్ట్రలో అన్ని పురపాలికల గడువూ మూడు నుంచి ఐదేళ్ల క్రితమే ముగిసింది. నాటినుంచీ అధికారుల పాలనలో ఉన్న ఆ కార్పొరేషన్లకు గురువారం ఎన్నికలు జరిగాయి. మొత్తమ్మీద 54.77 శాతం పోలింగ్ నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. కొత్తగా ఏర్పాటైన ఇచల్‌కరంజీ మున్సిపల్ కార్పొరేషన్‌లో అత్యధికంగా 69.76 శాతం ఓటింగ్ జరిగింది. 66.53 శాతంతో కొల్హాపూర్ రెండో స్థానంలో నిలిచింది. మీరా–భయందర్‌లో అత్యల్పంగా 48.64 శాతం నమోదైంది. ముంబైలో 52.94 శాతం పోలింగ్ జరిగింది.
ప్రతిష్టాత్మకమైన పుణెతో పాటు పంప్రీ–చించ్వాడ్, నాసిక్, ఛత్రపతి శంభాజీనగర్... ఇలా మెజారిటీ కార్పొరేషన్లలో బీజేపీ కూటమి హవాయే కొనసాగింది. శుక్రవారం రాత్రి పొద్దుపోయేసరికి మొత్తం 2,784 వార్డుల ఫలితాలు వెలువడగా వాటిలో బీజేపీ 1,372 చోట్ల గెలుపొందింది. లాతూర్ కార్పొరేషన్లో మాత్రం 70 స్థానాలకు గాను కాంగ్రెస్ 43 చోట్ల గెలిచింది. బీజేపీ 22 సీట్లకు పరిమితమైంది. చంద్రపూర్‌లో కూడా 66 స్థానాలకు గాను కాంగ్రెస్ 27 సీట్లు నెగ్గి ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. ఉద్ధవ్ శివసేనకు 6 స్థానాలు దక్కాయి. రెండు పార్టీలూ కలిసి మేయర్ పదవి దక్కించుకోవచ్చంటున్నారు.
జనవికాస్ సేనకు 3 సీట్లు రాగా ఇద్దరు స్వతంత్రులు నెగ్గారు. వారి మద్దతూ తమకేనని కాంగ్రెస్ పేర్కొంది. బీజేపీ 23 సీట్లకు పరిమితం కాగా మజ్లిస్, బీఎస్పీలకు ఒక్కో స్థానం దక్కాయి. వసై–వీరార్ కార్పొరేషన్‌లో స్థానిక పార్టీ బహుజన్ వికాస్ అగాఢీ విజయం సాధించడం విశేషం. 115కు గాను ఆ పార్టీ ఏకంగా 71 స్థానాలను చేజిక్కించుకోగా బీజేపీ 43 సీట్లతో సరిపెట్టుకుంది. ఇక పర్బాణిలో 65 స్థానాలకు గాను శివసేన (యూబీటీ) 25, కాంగ్రెస్ 12 సీట్లలో నెగ్గాయి. బీజేపీకి 12, ఎన్సీపీ (అజిత్) వర్గానికి 11 సీట్లొచ్చాయి.
‘ధురంధర్’ ఫడ్నవీస్!
మహాయుతి కూటమికి పురపాలిక పోరులో బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన హీరోగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేరు మారుమోగిపోతోంది. ‘మా గత రికార్డులన్నింటినీ తిరగరాస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్పొరేషన్లనూ కైవసం చేసుకోనున్నాం’ అని ఎన్నికల ముందు చెప్పి మరీ ఫలితం సాధించి చూపించారాయన. తద్వారా రాష్ట్రంలో అట్టడుగు స్థాయి దాకా ప్రజల్లో తనపట్ల గట్టి ఆదరణ ఉందని నిరూపించుకున్నారు. ముఖ్యంగా ముంబైపై పట్టును ఎలాగైనా నిలుపుకునేందుకు ఠాక్రే సోదరులు ఉద్ధవ్, రాజ్ 20 ఏళ్ల వైరాన్ని గట్టుమీద పెట్టి ఒక్కటైనా ఫడ్నవీస్ వ్యూహాలు వారి ఆశలపై నీళ్లుజల్లాయి. ప్రచారంలో అంతటా తానై వ్యవహరించారు.
దాదాపు అన్ని కార్పొరేషన్లలోనూ కలియదిరిగి ముమ్మరంగా ప్రచారం చేశారు. వయోజన ఓటర్లతో పాటు జెన్ జెడ్‌ను కూడా తన ప్రచార తీరుతో బాగా ఆకట్టుకున్నారు. అంతేగాక దక్షిణ భారతీయులను ముంబై నుంచి వెళ్లగొడతామన్న ఠాక్రేల హెచ్చరికల నడుమ, నగరంలో పెద్ద సంఖ్యలో ఉన్న ఆ ప్రాంతీయులను కూడా సీఎం తానున్నానంటూ అక్కున చేర్చుకున్నారు. ఆసియాలోనే అతి పెద్ద మురికివాడ అయిన ముంబై ధారావీ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేందుకు తలపెట్టిన ప్రాజెక్టుతో పాటు ముంబైవాసుల కోసం పలు పథకాలు ప్రకటించి ఆకట్టుకున్నారు. ఈ విజయంతో 54 ఏళ్ల ఫడ్నవీస్ మరాఠా రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా అవతరించినట్టేనని చెబుతున్నారు.
అభివృద్ధికే ఓటేశారు: మోదీ
న్యూఢిల్లీ: మహారాష్ట్ర మున్సిపల్ పోరులో బీజేపీ కూటమి విజయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు. ఎన్డీఏ కూటమి సారథ్యంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రజలు ఎంత సంతృప్తిగా ఉన్నారో చెప్పేందుకు ఈ విజయమే తార్కాణమని ఆయన అన్నారు. అత్యధిక కార్పొరేషన్లలో ఘనవిజయం కట్టబెట్టడం ద్వారా తమ పనితీరును వారు మరోసారి ఆశీర్వదించారన్నారు. ‘థాంక్యూ మహారాష్ట్ర!’ అంటూ ఎక్స్ పోస్టులో రాష్ట్ర ప్రజలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఫలితాల నేపథ్యంలో వారితో ఎన్డీఏ బంధం మరింత బలపడిందని అభిప్రాయపడ్డారు. ‘‘ఎన్డీఏకు ఇంతటి ఘనవిజయం సాధించిపెట్టిన కూటమి కార్యకర్తలను చూసి గరి్వస్తున్నా. మీ అవిశ్రాంత శ్రమే ఇందుకు కారణం’’ అన్నారు.
బీజేపీ ఓట్ల చోరీ: రాహుల్
న్యూఢిల్లీ: ఎప్పట్లాగే మహారాష్ట్ర పురపాలికల ఎన్నికల్లో కూడా అధికార బీజేపీ కండబలంతో ఓట్ల చోరీకి పాల్పడిందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఓటర్ల వేలిపై గుర్తు పెట్టేందుకు వాడిన మార్కర్ పెన్నుల్లో ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగానే నాసిరకం ఇంకు వాడిందని మరోసారి ఆరోపించారు. ఈ ఆరోపణలపై దర్యాప్తు జరపనున్నట్టు ముంబై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. రానున్న జిల్లా పరిషత్ ఎన్నికల్లో మార్కర్ పెన్నులు వాడబోమని కూడా ఎస్‌ఈసీ దినేశ్ వాగ్మారే పేర్కొన్నారు. 2011 నుంచీ రాష్ట్రంలో అన్ని స్థానిక ఎన్నికల్లోనూ మార్కర్లనే వాడుతున్నట్టు ఆయన గుర్తు చేశారు.
గౌరీ లంకేశ్ హత్య కేసునిందితుని గెలుపు
జల్నా: జర్నలిస్టు, సామాజిక కార్యకర్త గౌరీ లంకేశ్ హత్య కేసులో నిందితుడైన శ్రీకాంత్ పనగార్కర్ పురపాలిక ఎన్నికల్లో విజయం సాధించాడు. జల్నా కార్పొరేషన్‌లో స్వతంత్ర అభ్యరి్థగా బరిలో దిగిన అతడు 13వ వార్డు కార్పొరేటర్‌గా నెగ్గాడు. సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన రావ్‌సాహెబ్ ధోబ్లేపై స్వల్ప మెజారిటీతో గెలుపొందాడు. లంకేశ్ 2017లో దారుణ హత్యకు గురవడం తెలిసిందే. ఆమెను బెంగళూరు నివాసం బయటే దారుణంగా కాల్చి చంపారు. దీనిపై అప్పట్లో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన శ్రీకాంత్‌ను 2018 ఆగస్టులో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అదుపులోకి తీసుకుంది. 2024లో అతను బెయిల్‌పై బయటికొచ్చాడు.
మజ్లిస్‌కు 114 స్థానాలు
మహారాష్ట్ర పుర పోరులో ఆలిండియా మజ్లిస్ ఈ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) 114 కార్పొరేటర్ స్థానాలు గెలుచుకుంది. ఛత్రపతి శంభాజీనగర్‌లో అత్యధికంగా 33 సీట్లు నెగ్గడం విశేషం. మాలెగావ్ (21), అమరావతి (15), నాందేడ్ (13), ధులే (10) కార్పొరేషన్లలో పార్టీ రెండంకెల స్కోరు దాటింది. బీఎంసీలో కూడా ఖాతా తెరిచింది. 2017 నాటి కార్పొరేషన్ ఎన్నికల్లో మజ్లిస్ 80 స్థానాలు నెగ్గింది.
చతికిలపడ్డ శివసేన
శివసేన. మహారాష్ట్రలో ఈ పేరే ఓ సంచలనం. ముంబైలో శివసేన తిరుగులేని శక్తి. వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే రోజుల నుంచీ నగరంలో ఆ పార్టీ హవాయే సాగుతూ వచి్చంది. కొన్నేళ్లుగా కొడిగడుతూ వచి్చన ఆ ప్రభ తాజా బీఎంసీ ఎన్నికల ఫలితాలతో దాదాపుగా పరిసమా ప్తమైనట్టేనని పరిశీలకులు భావిస్తున్నారు. మూడు దశాబ్దాల శివసేన ఆధిపత్యానికి ఇక తెర పడ్డట్టేనని చెబుతున్నారు. ఉద్ధవ్ ఠాక్రే అధికార యావే ఇందుకు కారణమని, ఆయన అత్యాశ కారణంగా చిట్టచివరి దుర్గమైన ముంబై కూడా శాశ్వతంగా పార్టీ చేజారిందని ఆయన వర్గీయులే వాపోతున్న పరిస్థితి. ముంబైపై పట్టును సవతి సోదరుడు రాజ్ ఠాక్రేతో ఉద్ధవ్ చేతులు కలిపినా లాభం లేకపోయింది.


