
న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం రెండు నెలల వ్యవధి ఉన్న ప్రస్తుత సమయంలో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ తరుణంలో ఓటర్ల జాబితా సవరణ పేరుతో భారీగా ఓట్లను తొలగిస్తే, ఆయా వర్గాలు కోర్టును ఆశ్రయించేందుకు సమయం కూడా ఉండదని పేర్కొంది.
బీహార్‌లో ముమ్మరంగా జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణలో ఎలాంటి అక్రమాలైనా చోటుచేసుకున్నట్లు తేలితే. ఎన్నికలు సమీపించే సెప్టెంబర్‌లో అయినా ఆ జాబితాను పక్కనపెట్టేస్తామని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికలు చేసింది. ఈసీ గతంలో.. ఆధార్ కార్డు కలిగి ఉన్నప్పటికీ బీహార్ పౌరుల పౌరసత్వాన్ని నిర్ధారించి, ఓటు హక్కు కల్పించలేమంటూ చేసిన వాదనను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. దీనిని నిర్ణయించేది ఐదు కోట్ల మంది ఓటర్లని, ఈసీ కాదని ఎన్నికల కమిషన్ పేర్కొంది.
పౌరసత్వ నిర్ధారణకు ఈసీ ఏమీ పోలీసు కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కాగా బీహార్లో ఎన్నికల సంఘం హడావుడిగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణను ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. మరోవైపు ఈ జాబితా సవరణలోని లోపాలు ప్రతీ రోజూ బయటపెడుతూనే ఉన్నాయి. వీటిపై సుప్రీంకోర్టులోనూ పలు పిటిషన్లు కూడా దాఖలయ్యాయ. ఈ నేపధ్యంలో ఎన్నికలు తరుముకు వస్తున్న తరుణంలో, ఇంత తక్కువ సమయంలో ఈ భారీ ప్రక్రియ ఎందుకు చేపట్టారని ఎన్నికల సంఘాన్ని నిలదీసింది.
దీనిపై స్పందించిన ఈసీ తన నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ, అనర్హులైన ఓటర్లను తొలగిస్తూ, ఓటర్ల జాబితాను శుద్ధి చేసేందుకే ఈ ప్రక్రియ చేపట్టినట్లు వివరణ ఇచ్చింది. అయితే ప్రతిపక్షాలు ఈ ఓటర్లు జాబితా సవరణ ప్రక్రియపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఇంతలో లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మహారాష్ట్ర, కర్నాటకలలో ఓటర్ల జాబితాలో ఓట్ల చోరీని ఆధారాలతో సహా బయటపెట్టడంతో పాటు బీహార్ లో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపైనా పలు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తీరుపై సుప్రీంకోర్టు సీరియస్ కావడం ప్రతిపక్షాలను ఊరటనిచ్చింది.