ఈ నెల 11న రెండో దశ పోలింగ్
తొలి దశ రికార్డు స్థాయి పోలింగ్‌తో అంచనాలు తారుమారు
తమకే అనుకూలం అంటూ అధికార, విపక్షాల ధీమా
అసెంబ్లీ ఎన్నికలపై మరింత పెరిగిన ఉత్కంఠ
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. ప్రచార పర్వం ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఇన్నాళ్లూ రాజకీయ పారీ్టల నినాదాలు, ప్రసంగాలతో హోరెత్తిపోయిన గ్రామాలు, పట్టణాలు నిశ్శబ్దంగా మారిపోయాయి. చివరిదైన రెండో దశ పోలింగ్ ఈ నెల 11వ తేదీన 122 నియోజవర్గాల్లో జరుగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ నెల 6వ తేదీన 121 స్థానాల్లో జరిగిన తొలి దశ పోలింగ్‌లో రికార్డు స్థాయిలో 65 శాతం ఓటింగ్ నమోదైంది. రెండో దశలో కీలక నేతలు పోటీపడుతున్నారు. బిహార్ ఎన్నికల చరిత్రలో 5 శాతానికి మించి ఓటింగ్ పెరిగిన ప్రతిసారీ.. అది అధికార మారి్పడికే దారితీసిందని రాజకీయ విశ్లేషకులు చెప్పారు. ఈసారి భారీ ఓటింగ్ నమోదు కావడం తమకే అనుకూలమని ఇరుపక్షాలూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
సమీకరణాల చదరంగం
రెండో దశలో పోలింగ్ జరుగనున్న 122 నియోజకవర్గాలు అత్యంత సంక్లిష్టమైనవి. ఇక్కడ ప్రచారం మాత్రమే కాకుండా, క్షేత్రస్థాయిలో కుల సమీకరణాలు, ఓట్ల చీలిక వంటి అంశాలే అభ్యర్థుల గెలుపోటములను శాసించనున్నాయి. రెండో దశలో సీమాంచల్ అత్యంత కీలకం. కిషన్‌గంజ్, అరారియా, పూరి్ణయా, కతిహార్ వంటి జిల్లాలున్న ఈ ప్రాంతంలో ముస్లిం మైనారిటీల జనాభా ఎక్కువ. ఇది దశాబ్దాలుగా ఆర్జేడీ–కాంగ్రెస్ కూటమికి కంచుకోట. అయితే, 2020 నాటి ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ నేతత్వంలోని ఎంఐఎం ఇక్కడ 5 స్థానాలు గెలుచుకొని మహాగఠ్‌బంధన్ ఓట్లను చీల్చింది.
మైనారిటీల ఓట్లను ఆకర్శించేందుకు ఆర్జేడీ, కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతుండగా.. ఎంఐఎం సైతం అదే ఓటు బ్యాంకుకు గాలం వేస్తోంది. ఈ ’ఓట్ల చీలిక’అంతిమంగా ఎన్డీఏకు లాభం చేకూరుస్తుందనడంలో సందేహం లేదు. రెండో దశలోనూ కులమే ప్రధాన పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ముస్లిం–యాదవ్ సమ్మేళనం మహాగఠ్‌బంధన్‌కు ప్రాణవాయువు లాంటిది. ఆర్జేడీ అభ్యర్థులు పూర్తిగా ఈ ఓటు బ్యాంకును నమ్ముకుంటున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బలం ఈబీసీలు, మహాదళితులే. ఈ నిశ్శబ్ద ఓటు బ్యాంకు గత రెండు దశాబ్దాలుగా జేడీయూ వెంటే నడుస్తోంది. భూమిహార్, రాజ్‌పుత్, బ్రాహ్మణ వర్గాలు ఆనవాయితీగా బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నాయి.
ఓట్ల చీలికలతో తంటాలు
ఈ ఎన్నికల్లో ‘ఓట్లను చీల్చే’పార్టీల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన సురాజ్ పార్టీ చాలా నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను నిలబెట్టింది. ఇది సంప్రదాయ రాజకీయాలకు అలవాటుపడని ఓటర్లను ఆకర్శిస్తోంది. ఈ పారీ్టతో జేడీ(యూ), ఆర్జేడీలకు కొంత నష్టం జరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ‘సన్ ఆఫ్ మల్లా’గా పిలుచుకునే ముకేశ్ సహానీ.. బిహార్ నిషాద్ (మత్స్యకార) వర్గంలో గట్టి పట్టున్న నాయకుడు. ఈయన మహాగఠ్‌బంధన్‌లో భాగస్వామిగా ఉండటం ఆర్జేడీకి కలిసొచ్చే అంశం.
సమస్యాత్మక ప్రాంతాలు
రెండో దశలో పోలింగ్ జరగనున్న పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, సీతామఢీ వంటి జిల్లాలు నేపాల్ సరిహద్దును ఆనుకొని ఉన్నాయి. ఇక్కడ ఎన్నికల నిర్వహణ భద్రతా బలగాలకు పెద్ద సవాల్. ఎన్నికలకు 72 గంటల ముందే నేపాల్ సరిహద్దును మూసివేశారు. అసాంఘీక శక్తులు సరిహద్దులు దాటకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మరోవైపు సీమాంచల్ ప్రాంతం మతపరంగా అత్యంత సున్నితమైనది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రాంతాల్లో భారీగా సాయుధ బలగాలను మోహరించింది. ప్రజలు స్వేచ్ఛగా, శాంతియుతంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లూ చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 14న ఫలితాల కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.


