ఒకడు నన్ను ఫాలో అయ్యాడు.. అందుకే ఇలా.. | Bengaluru Woman Helmet Camera Frightening Encounter | Sakshi
Sakshi News home page

ఒకడు నన్ను ఫాలో అయ్యాడు.. అందుకే ఇలా..

Oct 7 2026 7:57 PM | Updated on Oct 7 2026 8:01 PM

 Bengaluru Woman Helmet Camera Frightening Encounter

బెంగళూరులో తనను ఓ వ్యక్తి ఇంటి వరకు వెంబడించడంతో భయాందోళనకు గురైన ఓ మహిళ.. ఇప్పుడు ప్రయాణ సమయంలో భద్రత కోసం హెల్మెట్‌కు కెమెరా అమర్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

బెంగళూరు రహదారిపై ట్రాఫిక్‌లో ప్రయాణిస్తున్న సమయంలో కంటెంట్ క్రియేటర్ లోకేశ్ సోలో రైడర్ ఆ మహిళను గమనించారు. ఆమె హెల్మెట్‌కు ప్రత్యేక పరికరం అమర్చి ఉండటాన్ని చూసి దాని గురించి అడిగారు. అది కెమెరా అని ఆమె చెప్పారు. దాని ధర సుమారు రూ.3,000 అని తెలిపారు.  

తనకు ఎదురైన అనుభవం కారణంగానే కెమెరాను ఏర్పాటు చేసుకున్నట్లు ఆమె వివరించారు. ఓ వ్యక్తి తనను అనుసరిస్తూ ఇంటి వరకు వచ్చాడని, ఆ ఘటన తర్వాత ప్రయాణ సమయంలో తన చుట్టూ జరిగే విషయాలను రికార్డు చేసుకునేందుకు ఈ కెమెరాను ఉపయోగిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ వీడియోలో ఆమె చెప్పిన అనుభవం మహిళల వ్యక్తిగత భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది.

సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ కావడంతో పలువురు ఆమె తీసుకున్న ముందు జాగ్రత్తను ప్రశంసించారు. మహిళలు ప్రయాణించే సమయంలో ఎదురయ్యే వేధింపులు, వెంబడింపుల వంటి ఘటనలకు ఆధారాలను భద్రపరచుకోవడం అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ కెమెరా మోడల్‌ గురించి కూడా కొందరు ప్రశ్నించగా, అది ‘క్యూబో బైక్ డ్యాష్‌క్యామ్’గా కొందరు పేర్కొన్నారు.

బెంగళూరులో గతంలోనూ మహిళలను వెంబడించడం, రహదారులపై వేధింపులకు సంబంధించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. 2025లో ఓ మహిళను స్కూటర్‌పై కొంత దూరం వెంబడించిన ముగ్గురు వ్యక్తుల ఘటనపై పోలీసులు స్పందించి, వాహనం యజమానిని గుర్తించినట్లు కూడా వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో మహిళల భద్రత కోసం సాంకేతిక పరికరాలను ఉపయోగించుకోవడంపై ఈ ఘటన కొత్త చర్చకు తెరతీసింది. అయితే ఇలాంటి పరికరాలు భద్రతకు అదనపు సహాయంగా మాత్రమే ఉపయోగపడతాయని, ప్రమాదం ఎదురైనప్పుడు పోలీసులను సంప్రదించడం కీలకమని గుర్తుంచుకోవాలి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement