కన్నవారినే కడతేర్చిన కూతురు.. ప్రియుడితో కలిసి టెక్కీ ఘోరం | Bengaluru Shocker, Woman And Boyfriend Allegedly Kill Parents And Sister Over Family Dispute, More Details Inside | Sakshi
Sakshi News home page

కన్నవారినే కడతేర్చిన కూతురు.. ప్రియుడితో కలిసి టెక్కీ ఘోరం

Jun 24 2026 7:41 AM | Updated on Jun 24 2026 10:34 AM

Bengaluru Daughter Triple Murder Case

సిలికాన్‌ సిటీలో వెర్రితలలు వేస్తోన్న సహజీవన సంస్కృతిలో ఎన్నో విషాదాలు ఇప్పటికే బయటపడ్డాయి, అంతకుమించిన ఘోరం మరొకటి సంభవించింది. లివ్‌ ఇన్‌ మత్తులో కూరుకుపోయిన ఓ యువతి ఏకంగా తల్లిదండ్రులు, సోదరినే హతమార్చింది. ఇందుకు ఆమె ప్రియుడు కూడా సహకరించాడు. 

కర్ణాటక: ఆమె టెక్కీగా ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది, ఇంతలో ప్రేమలో పడి సహజీవనం చేయసాగింది. ఇంటికి కూడా రావడం మానేసింది. అమ్మా.. ఇది సరికాదు, నువ్వు ఇంటికి రా అని తల్లిదండ్రులు ఎంతగానో నచ్చజెప్పేవారు. కానీ పెడదారిన పడిన కుమార్తె ససేమిరా అనేది. ఆమెతో మాట్లాడదామని వెళ్లి తల్లిదండ్రులు, చెల్లెలికి అదే చివరిరోజు అయ్యింది. కృష్ణరాజపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నల్లూరహళ్లి నివాసులైన సోమసుందర్‌ (55), ముత్తులక్ష్మీ (49), సుప్రియా (20)ను వారి పెద్ద కుమార్తె శ్వేత (26), ఆమె ప్రియుడు కెన్నెత్‌ (29) నరికి చంపారు.  

నచ్చజెప్పాలని వెళ్తే  
శ్వేత కుటుంబాన్ని వదిలేసి శీగేహళ్లిలోని డొమినిక్‌ లేఔట్‌ సాయిగ్రీన్‌ హోమ్స్‌  అపార్టుమెంట్‌లో ఫ్లాటు తీసుకుని ప్రియునితో జీవిస్తోంది. ఆమెకు నచ్చజెప్పాలని తల్లిదండ్రులు సోమవారం రాత్రి శ్వేత ఫ్లాటుకు వచ్చారు. ఈ సమయంలో శ్వేత, కెన్నెత్‌ వారిని దూషించి గొడవ పడ్డారు. ఇంట్లో ఉన్న పెద్ద కత్తులను తీసుకుని కిరాతకుల్లా విరుచుకుపడ్డారు. ముత్తులక్ష్మి, సుప్రియా ఈ హత్యాకాండలో ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలైన తండ్రి సోమసుందర్‌ ఫ్లాటు బయటకు పరిగెడుతూ మెట్ల వద్ద కుప్పకూలాడు. అరుపులు కేకలు విని భయపడిన ఇతర ఫ్లాట్లవారు పోలీసులకు కాల్‌ చేశారు. పోలీసులు చేరుకుని ప్రాణాపాయంలో ఉన్న సోమసుందర్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. అంతకుముందు అతడు కూతురి ఘోరం గురించి పోలీసలుకు వివరించాడు. పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించి మృతదేహాలను ఈస్ట్‌పాయింట్‌ ఆసుపత్రికి తరలించారు.  

పెళ్లి, ఆస్తి పేరిట గొడవలు 
గత కొన్నిరోజులుగా శ్వేత తాను కెన్నెత్‌ను పెళ్లి చేసుకుంటానని, ఆస్తిలో భాగం ఇవ్వాలని తల్లిదండ్రులను సతాయిస్తోంది. ఇందుకు తల్లిదండ్రులు వ్యతిరేకించేవారు. శ్వేత సుమారు రూ.30 లక్షలు అప్పులు చేసింది. అప్పు తీర్చాలి, లేదా ఆస్తి ఇవ్వాలని కుటుంబాన్ని వేధించేది. ఆస్తి ఇవ్వలేమని తల్లిదండ్రులు చెప్పడంతో కసి పెంచుకుంది. హంతకులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ మారణహోమంతో అపార్టుమెంటువాసుల్లో భయాందోళన నెలకొంది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement