ఢాకా: బంగ్లాదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాలో మరో హిందువు దారుణ హత్య చోటుచేసుకుంది. తన దుకాణంలోని ఉద్యోగికి.. కస్టమర్లకు మధ్య జరుగుతున్న గొడవను ఆపడానికి ప్రయత్నించిన ఒక హిందూ వ్యాపారిని దుండగులు కొట్టి చంపారు. ఈ హత్య అక్కడి మైనారిటీ వర్గాలలో తీవ్ర భయాందోళనలను నింపింది. మృతుడిని 55 ఏళ్ల లిటన్ చంద్ర ఘోష్‌గా గుర్తించారు. ఇతను వైశాఖి పేరుతో స్థానికంగా ఓ స్వీట్ షాపును నడుపుతున్నాడు.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం, లిటన్ దుకాణంలో పనిచేసే అనంత దాస్ అనే ఉద్యోగికి.. ఒక కస్టమర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, తన సిబ్బందిని రక్షించేందుకు యజమాని లిటన్ జోక్యం చేసుకున్నారు. అయితే అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు లిటన్‌పై తిరగబడ్డారు. ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం మొదట లిటన్‌పై పిడిగుద్దులతో దాడి చేసిన దుండగులు, అనంతరం ఒక పారతో అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన లిటన్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కలిగంజ్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్-ఇన్-చార్జ్ ఎండి జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ ఈ హత్యకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. లిటన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. దర్యాప్తులో భాగంగా అధికారులు ఆ ప్రాంతంలోని సిసిటివి ఫుటేజీని పరిశీలిస్తున్నారు. రిపన్ సాహా (30) అనే హిందూ యువకుడిని కారుతో తొక్కి చంపిన ఘటన మరువక ముందే ఈ దారుణం చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: బాంబు బెదిరింపు.. ‘ఇండిగో’ ఎమర్జెన్సీ ల్యాండింగ్


