కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మరో పర్యటన వాయిదా వేసుకున్నారు. ఆయనతో పాటు ఈసీ ఉన్నతాధికారులు ఇవాళ, రేపు ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించాల్సి ఉండగా.. ‘‘అనివార్య కారణాల’’తో కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం ప్రకటించింది. కొత్త తేదీలను తర్వాత వెల్లడిస్తామని తెలిపింది.
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), ఫామ్-6లో మార్పులపై విపక్షాల ఆందోళనలు ఉద్ధృతమైన సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈసీలో అభిప్రాయబేధాలు, సర్ వివాదాల నేపథ్యం తర్వాత.. మీరట్, వారణాసి, లడఖ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ పర్యటనలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ ఆ జాబితాలో చేరింది. అయితే ఆయన పర్యటనల్లో నిరసనలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారనే చర్చా జోరందుకుంది.
ఛత్తీస్‌గఢ్ పర్యటనలో జ్ఞానేశ్ కుమార్ దంతేవాడలోని దంతేశ్వరి ఆలయం, బస్తర్‌లో చిత్రకూట్ జలపాతం, కబీర్‌ధామ్‌లో భోరమ్‌దేవ్ ఆలయాన్ని సందర్శించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ‘స్టేట్ గెస్ట్’ హోదా కల్పించి భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. అయితే చివరి నిమిషంలో ఈసీ వర్గాలు పర్యటనను రద్దు చేసినట్లు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌పై బుధవారం కూడా విపక్షాల ఆందోళనలు కొనసాగనున్నాయి. ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి నిరసనలో పాల్గొంటామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. అంతకు ముందు..
మంగళవారం ఢిల్లీలో రాహుల్ గాంధీ నేతృత్వంలో విపక్ష ఎంపీలు ఈసీ కార్యాలయం వైపు మార్చ్ చేపట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆకాష్‌వాణి భవన్ వద్ద ఎనిమిది గంటలకు పైగా ధర్నా నిర్వహించారు. రాహుల్, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతరం విడుదల చేశారు. సర్ రద్దు, జ్ఞానేశ్వర్ రాజీనామా, ఎన్నికల సంఘంలో సంస్కరణలు కోరుతూ ఈ నెల 10వ తేదీ నుంచి కాక్రోచ్ జనతా పార్టీ కూడా దేశవ్యాప్త ఆందోళనలకు సిద్ధమైంది.
ఇదీ చదవండి: ఈసీ కోసం నెక్స్ట్ లెవల్ పోరాటం!


