
గగన వీధుల్లో ఘన వీడ్కోలు
62 ఏళ్ల మిగ్–21 ప్రస్థానం ముగింపు
భారత జాతీయ పతాకం గౌరవాన్ని నిలబెట్టింది
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
చండీగఢ్: మేఘావృతం కాని గగనం నీలిరంగులో మెరిసిపోయింది. ఆరు దశాబ్దాలకు పైగా భారతావనికి కొండంత అండగా నిలిచిన వీర విహంగానికి వీడ్కోలు పలికే వేళ.. ఆకాశం వెలిగిపోయింది. యుద్ధ విమానం మిగ్–21 సేవల ఉపసంహరణ ఉద్విగ్నభరిత క్షణాల్లో భారత గగన వీధిలో వాతావరణమిది. చండీగఢ్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో మిగ్–21 డీకమిషనింగ్ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. భారత వైమానిక దళం యుద్ధ విమానాల బృందానికి వెన్నెముకగా ఉన్న ఈ ఐకానిక్ మిఖోయాన్–గురేవిచ్ మిగ్–21 ఫైటర్ జెట్‌లు శుక్రవారం చివరిసారిగా భారత గగనతలంలో ఎగిరాయి. దీంతో 62 ఏళ్ల మిగ్–21ల సుదీర్ఘ ప్రస్థానానికి తెర పడింది.
కనురెప్పవేయనివ్వని విన్యాసాలు
ఒక చారిత్రక అధ్యాయం ముగింపును సూచిస్తూ, లాంఛనప్రాయ ఫ్లైపాస్ట్, డీకమిషనింగ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ వాయుసేనకు చెందిన ప్రఖ్యాత స్కైడైవింగ్ బృందం ’ఆకాశ్ గంగ’.. 8,000 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేసి ఆకట్టుకుంది. తరువాత మిగ్–21 విమానం అద్భుతమైన ఫ్లైపాస్ట్, ఎయిర్ వారియర్ డ్రిల్ బృందం కచి్చతత్వంతో కూడిన కవాతు, వైమానిక వందనం కొనసాగాయి. ఫైటర్ పైలట్లు మూడు విమానాల ’బాదల్’ ఫార్మేషన్, నాలుగు విమానాల ’పాంథర్’ ఫార్మేషన్‌లో చివరిసారిగా గగనతలంపైకి దూసుకుపోయాయి. ’సూర్య కిరణ్’ ఏరోబాటిక్ బృందం కూడా ఉత్కంఠభరితమైన విన్యాసాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
నంబర్ 23 స్క్వాడ్రన్‌కు చెందిన మిగ్–21 జెట్‌లు ఫ్లైపాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్నాయి. వాటికి ’వాటర్ కానన్ సెల్యూట్’ (నీటి ఫిరంగి వందనం) ఇచ్చారు. ’జాగ్వార్’, ’తేజస్’ విమానాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. వీడ్కోలు కార్యక్రమానికి నెల ముందు, రాజస్థాన్‌లోని బికనేర్‌లోని నల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో మిగ్–21 చివరిసారిగా ఎగిరాయి. ఈ వీడ్కోలుకు గుర్తుగా, ఆగస్టు 18–19న భారత వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ నల్ ఎయిర్ బేస్ నుంచి మిగ్–21 సోలో సోర్టీస్ నిర్వహించారు. 1981లో భారతీయ వాయుసేన చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన దిల్‌బాగ్ సింగ్, 1963లో ఇక్కడ మొదటి మిగ్–21 స్క్వాడ్రన్‌కు నాయకత్వం వహించడం విశేషం.
దశాబ్దాలపాటు భారతీయ భద్రతను మోసింది
మిగ్–21 కేవలం ఒక విమానం లేదా యంత్రం మాత్రమే కాదని.. అది దేశ గౌరవం, భారత్, రష్యాల మధ్య ఉన్న లోతైన సంబంధాలకు నిదర్శనమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. మిగ్–21 సేవల ఉపసంహరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. అరవయ్యేళ్లకు పైగా మిగ్–21 సాగించిన ప్రయాణం అసమానమైనదని అభివరి్ణంచారు. ఈ శక్తివంతమైన విమానం దశాబ్దాలుగా దేశ భద్రత భారాన్ని తన రెక్కలపై మోసిందని కొనియాడారు. మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి.. యుద్ధ వ్యూహాలను బలోపేతం చేసిందని పేర్కొన్నారు. భారత సైనిక విమానయాన చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన ఒక అధ్యాయానికి వీడ్కోలు పలుకుతున్నామని వ్యాఖ్యానించారు.
1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధం, 1999 కార్గిల్ యుద్ధం, 2019 బాలాకోట్ వైమానిక దాడుల నుంచి ఇటీవలి ఆపరేషన్ సిందూర్ వరకు, మిగ్–21 మన సాయుధ దళాలకు అపారమైన శక్తిని అందించిందని వివరించారు. భారతీయ సైనిక విమానయాన ప్రయాణంలో అనేక గరి్వంచదగిన క్షణాలను ఈ విమానం జోడించిందని తెలిపారు. 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో ప్రతికూల పరిస్థితుల్లో మిగ్–21 విమానం ఢాకా గవర్నర్ హౌస్‌పై దాడి చేసిన రోజే.. ఆ యుద్ధం ఫలితం స్పష్టమైపోయిందని రాజ్‌నాథ్ సింగ్ గుర్తు చేసుకున్నారు. అదెలాంటి చారిత్రక మిషన్ అయినా.. మిగ్–21 భారతీయ జాతీయ పతాక గౌరవాన్ని ఉన్నతంగా నిలబెట్టిందన్నారు.
ఎప్పుడో సేవల ఉపసంహరణ
‘మిగ్–21 గురించి మాట్లాడేటప్పుడు, భారతీయ వాయుసేన 60 ఏళ్ల నాటి విమానాలను నడుపుతోందన్న వ్యాఖ్య లు వింటుంటాం. కానీ 1960, 1970ల లో సాయుధ దళాల్లోకి వచ్చిన మిగ్–21 యుద్ధ విమానాలను చాలా కాలం క్రితమే సేవల నుంచి తొలగించారన్న ముఖ్యమైన వాస్తవాన్ని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను’.. అని రాజ్‌నాథ్‌సింగ్ ప్రకటించారు. వీడ్కోలు కార్యక్రమంలో భారతీయ వాయుసేన మాజీ చీఫ్‌లు ఏవై టిప్నిస్, ఎస్పీ త్యాగి, బీఎస్ ధనోవా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారతదేశపు తొలి వ్యోమగామి, గ్రూప్ కెపె్టన్ శుభాన్షు శుక్లా సహా మిగ్ విమానాన్ని నడిపిన ఎందరో పైలట్లు పాల్గొన్నారు.