అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం కేసులో కీలక పురోగతి | Ahmedabad Plane Incident Investigation Black box data downloaded | Sakshi
Sakshi News home page

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం కేసులో కీలక పురోగతి

Jun 26 2025 2:07 PM | Updated on Jun 26 2025 4:08 PM

Ahmedabad Plane Incident Investigation Black box data downloaded

న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌(గుజరాత్‌) విమాన ప్రమాదం కేసులో అధికారులు కీలక పురోగతి సాధించారు. అత్యంత ముఖ్యంగా భావిస్తున్నబ్లాక్‌బాక్స్‌(Air India Black Box) నుంచి డేటాను సేకరించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినట్లు ఆంగ్ల మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి.

బ్లాక్‌బాక్స్‌లో ముందు భాగంలో ఉండే క్రాష్‌ ప్రొటెక్షన్‌ మాడ్యూల్‌ డాటాను అధికారులు గురువారం రికవరీ చేశారు. ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో(AAIB) ల్యాబ్‌లో ఆ డాటాను విశ్లేషిస్తున్నట్లు ఆ కథనాలు వెల్లడించాయి. అలాగే.. కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్స్‌, ఫ్లైట్‌ డాటా రికార్డర్స్‌   నుంచి డాటా సేకరించే పనిలో ఉన్నారట. విచారణ కొనసాగుతోందని ప్రభుత్వం వెల్లడించింది.

జూన్‌ 12వ తేదీన బోయింగ్‌ సంస్థకు చెందిన డ్రీమ్‌లైనర్‌ విమానం(ఏఐ 171 సర్వీస్‌) ప్రమాదంలో నేలను తాకగానే పేలిపోయి.. కాలి బూడిదైన సంగతి తెలిసిందే. అయితే ఘటన జరిగిన 28 గంటల తర్వాత శకలాల నుంచి బాక్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రమాదం ధాటికి అందులో ఓ పార్ట్‌ పైభాగం బాగా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో..

బ్లాక్‌బాక్స్‌ను డీకోడ్‌ చేసేందుకు అమెరికాకు పంపించబోతున్నట్లు తొలుత ప్రచారం జరిగింది. అయితే టెక్నికల్‌, సెక్యూరిటీ అంశాలను పరిశీలించాకే బ్లాక్‌బాక్స్‌ను ఎక్కడికి పంపించాలనే విషయాన్ని ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (AAIB) మాత్రమే నిర్ణయిస్తుందని కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆప్షన్లను పరిశీలించిన ఏఏఐబీ.. ఇక్కడే దానిని విశ్లేషిస్తున్నట్లు సమాచారం.

బ్లాక్‌బాక్స్‌తో..
డిజిటల్‌ ఫ్లైట్‌ డాటా రికార్డర్‌(DFDR), కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌(CVR)లను కలిపి బ్లాక్‌బాక్స్‌గా వ్యవస్తారు. పేరుకు బ్లాక్‌బాక్స్‌ అనే కానీ.. ప్రమాదం తర్వాత శకలాల నుంచి సేకరణ కోసం సులువుగా బ్రైట్‌ ఆరెంజ్‌ కలర్‌లో ఉంటుంది అది.  ఇక ఇందులో.. ఇప్పుడొస్తున్న సీవీఆర్‌లు 25 గంటలపాటు కాక్‌పిట్‌ సంభాషణలను నమోదు చేయగలవు. 2021లో తీసుకొచ్చిన నిబంధనే అందుకు కారణం. కానీ, ప్రమాదానికి గురైన బోయింగ్‌ 787 విమానం అంతకు ముందు మోడల్‌​. ఇందులో కేవలం రెండున్నర గంటల రికార్డును మాత్రమే రికార్డుచేయగలదు. 

ఇక ఏడీఆర్‌.. విమానం వేగాన్ని, నియంత్రణ క్షణాలు తదితరాలను నమోదు చేస్తుంది. బ్లాక్‌బాక్స్‌లోని డాటాను ఇంజినీరింగ్‌ ఫార్మట్‌లోకి మార్చిన తర్వాతే సమాచారాన్ని సేకరించడానికి వీలవుతుంది. సేకరణ టైంలో ఏదైనా పొరపాటు దొర్లితే.. డాటా మొత్తం కనిపించకుండా పోతుంది(ఎరేస్‌ అవుతుంది).

జూన్‌ 12వ తేదీ మధ్యాహ్నాం.. అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 241 మంది(సిబ్బందితో కలిపి), జనావాసాలపై విమానం కూలి పేలిపోవడంతో మరో 34 మంది స్థానికులు మరణించారు.

బ్లాక్ బాక్స్ డేటాను డౌన్‌లోడ్ చేసిన AAIB ల్యాబ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement