అచ్చం ఖడ్గం సినిమాలోలా : విద్యావ్యవస్థపై వ్యాపారవేత్త సెటైర్లు | Ace Investor Says Middle Class India Getting College Wrong Says Stop Study After Class 12 | Sakshi
Sakshi News home page

అచ్చం ఖడ్గం సినిమాలోలా : విద్యావ్యవస్థపై వ్యాపారవేత్త సెటైర్లు

Jun 19 2026 12:03 PM | Updated on Jun 19 2026 12:37 PM

Ace Investor Says Middle Class India Getting College Wrong Says Stop Study After Class 12

ఉన్నత చదువులు చదువు కుంటే భవిష్యత్తు బావుంటుంది అని అందరం అనుకునే మాట. చదువును మించిన సంపద లేదని చిన్నప్పటినుంచీ మన తల్లిదండ్రులు,గురువులు నేర్పిన పాఠం. అయితే సామాజిక వాస్తవాలను, విద్యారంగంలోని లోపాలను ఎత్తి చూపడానికి ఖడ్గం సినిమాలో చెప్పినట్టు  చదువుకున్నవారు గుమస్తాలుగా, చదువురానివారు వ్యాపారవేత్తలుగా మారి పోతున్నారనే మాట చలామణీలో ఉంది. అచ్చం ఇలాగే డిగ్రీలొద్దు..బొగ్రీలొద్దు అంటూ ప్రముఖ ఇన్వెస్టర్‌ అభిప్రాయం నెట్టింట సందడి చేస్తోంది. భారతీయ విద్యా వ్యవస్థ,ప్రమాణాలపై ఆయన చేసిన సంచలన  వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

మార్సెల్లస్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ (Marcellus Investment Managers) వ్యవస్థాపకుడు, సీఐఓ సౌరభ్ ముఖర్జియా ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో  ​క్లాస్ 12 (ఇంటర్మీడియట్) తర్వాత చదువు ఆపేయండి పెద్దగా ఫలితంలేదు అన్నట్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ మధ్యతరగతి కాలేజ్ చదువుల విషయంలో తప్పు చేస్తోందని అభిప్రాయపడ్డారు. ఉద్యోగాల్లోకి ప్రవేశిస్తున్న యువతకు భారతదేశ విద్యావ్యవస్థ ఎలాంటి విలువను జోడించడం లేదని విమర్శించారు. అంతేకాదు దేశంలో అత్యధికంగా సంపాదించేవారు డిగ్రీలు పూర్తి చేసినోళ్లు.. కేవలం 12వ తరగతి చదివి చదువు ఆపేసిన వారే అంటూ సెటైర్లు వేశారు. భారతదేశంలోని కంపెనీలు/యజమానులు కాలేజ్ డిగ్రీ వల్ల విద్యార్థులకు ఎలాంటి అదనపు నైపుణ్యాలు రావడం లేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారని ముఖర్జియా పేర్కొన్నారు.

బట్టీ పట్టే (రట్నా మారో) విధానం
భారతదేశ విద్యా విధానం ఇప్పటికీ కేవలం  బట్టీ చదువులు, రుద్దుడుపైనే ఆధారపడుతోందని ముఖర్జియా అన్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే, బట్టీ పట్టడం, పోయి ఎగ్జామ్‌లో రాయడం తప్పే పిల్లలకు  ఒరిగేదేమీ లేదన్నారు.  ఈ విధానం వల్ల విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఎలక్ట్రిక్ వాహనాలు (EV), బయోటెక్, క్లీన్ టెక్ , అధునాతన సైన్స్ వంటి సరికొత్త సాంకేతిక ప్రపంచానికి సిద్ధం కాలేకపోతున్నారన్నారు.

అసలు ఏఐ విషయాన్ని పక్కన పెడితే, మన డేటాలోనే ఈ సమస్య స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. పట్టభద్రుల నిరుద్యోగిత గణాంకాలు దీని  తీవ్రతను తెలియజేస్తోందని వాదించారు. కాలేజీల నుండి బయటకు వస్తున్న ప్రతి 100 మంది గ్రాడ్యుయేట్లలో కేవలం ముగ్గురు మాత్రమే వారు పాసైన సంవత్సరంలో ఉద్యోగం పొందుతున్నారని చెప్పారు.

డిగ్రీలున్నవారే  నిరుద్యోగులుగా!
గ్రాడ్యుయేట్ల నిరుద్యోగిత రేటు దాదాపు 30-40 శాతం వరకు ఉందని, అదే చదువురాని వారిలో (illiterate) ఇది కేవలం 3శాతం మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు.యూనివర్సిటీ వ్యవస్థ అనేది నైపుణ్యాలు పెంచేదిశగా కాకుండా  బండ చదువులు ప్రక్రియగా మారిందని విమర్శించారు. ఇది స్కూలు రోజులనుండే మొదలవుతోందని, ప్రాథమిక స్థాయినుంచే బట్టీ పట్టడమనే అలవాటుతో  వారి మెదళ్లు  మొద్దుబారిపోతున్నాయని విశ్లేషించారు.  ఫలితంగా భారత్ అధునాతన రంగాలలో సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ఇబ్బంది పడుతోందని అన్నారు.  ఏ రంగంలోనూ అభివృద్ధి చెందలేకపోతున్నామంటూ ( నా తో హమ్ AI మే హై, నా EV మే, నా బయోటెక్ మే, నా క్లీన్ టెక్ మే)  అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈసందర్భంగా తాను రాసిన  పుస్తకం 'బ్రేక్‌పాయింట్' (Breakpoint) ను ప్రస్తావిస్తూ... భారతదేశంలో అత్యధికంగా సంపాదించే కొందరు వ్యక్తులు 12వ తరగతి ముగించి చదువు ఆపేసిన వారేనని కంపెనీల యజమానుల ధోరణిని బట్టి అర్థమవుతోందని ముఖర్జియా చెప్పారు. దీనికి ముంబై లేబర్ మార్కెట్‌ను ఆయన ఒక ఉదాహరణగా తీసుకున్నారు, ఏసీ ఆఫీస్ ఉద్యోగం కోసం ప్రయత్నించే ఒక గ్రాడ్యుయేట్ కంటే, కన్‌స్ట్రక్షన్ సైట్ (నిర్మాణ రంగం)లో పనిచేసే వ్యక్తి ఎక్కువ సంపాదించవచ్చు.ఒక నిర్మాణ కార్మికుడు డిగ్రీ చదివిన వ్యక్తి కంటే రెండు రెట్లు ఎక్కువ సంపాదిస్తాడు, ఒక జేసీబీ  ఆపరేటర్ అంతకంటే ఎక్కువ సంపాదించగలడని ఆయన ఉదాహరించారు.ఇది కేవలం విద్యావ్యవస్థకు సంబంధించిన సమస్య మాత్రమే కాదనీ, ఆర్థిక వ్యవస్థకు సంబంధించినది కూడా అభిప్రాయపడ్డారు.  భారతదేశం ఆధునిక ప్రపంచంతో పోటీ పడాలంటే, మన విద్యా విధానం బట్టీ పద్ధతుల నుండి బయటపడి, యువతకు "ఎలా ఆలోచించాలి" అనేది నేర్పించాల్సి ఉంటుందని సూచించారు. 

ఇదీ చదవండి: 60 ఏళ్లకి లవ్‌, 75 రోజులకే పెళ్లి : నటి లవ్‌ స్టోరీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement