రోజుకు 12 గంటలు, అయినా : 82 ఏళ్ల మన్సుఖ్ కాకా స్టోరీ తెలిస్తే! | 82 Year Old Mumbai Man Works 12 Hours A Day By Selling Snacks On Footpath, Internet Salutes His Spirit | Sakshi
Sakshi News home page

రోజుకు 12 గంటలు, అయినా : 82 ఏళ్ల మన్సుఖ్ కాకా స్టోరీ తెలిస్తే!

Jun 18 2026 11:07 AM | Updated on Jun 18 2026 12:04 PM

82 year old Mumbai man works 12 hours a day by selling snacks on footpath

ఇప్పటివరకు ఎన్నో సక్సెస్‌ స్టోరీలను చదువుకున్నాం. ఎంతోమంది విజయగాథలను తెలుసుకుని  స్ఫూర్తి పొందాం. కానీ కష్టం ఎక్కువ, సంపాదన తక్కువ అయినా కూడా తన కాళ్ల మీద తాను నిలబడుతూ ఎంతో గౌరవంగా, హుందాగా జీవనం సాగిస్తున్న 82 ఏళ్ల  పెద్దాయన గురించి తెలుసుకుందాం.

ముంబైకి చెందిన కంటెంట్ క్రియేటర్ ఆరాధన ఛటర్జీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ద్వారా మన్సుఖ్ కాకా కథ వెలుగులోకి వచ్చింది. దీంతో ఈయన  నైజం, కష్ట పడేతత్వం నెటిజనులను ఆలోచింపచేస్తోంది.

ముంబైకి చెందిన 82 ఏళ్ల మన్సుఖ్ కాకా కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఎందరికో స్ఫూర్తినిస్తోంది. వృద్ధాప్యంలో విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో కూడా ఆయన ప్రతిరోజూ 12 గంటల పాటు ఫుట్‌పాత్‌పై చిరుతిళ్లు (ఫర్సాన్) అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. మన్సుఖ్ కాకా తన జీవితంలో ఎక్కువ భాగం ఒక చీరల దుకాణంలో సేల్స్‌మ్యాన్‌గా పనిచేశారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆయన అనారోగ్యానికి గురవడంతో ఉద్యోగం కోల్పోయారు. ఆ సమయంలో ఆయనను చూసుకోవడం కోసం ఆయన కుమారుడు కూడా తన ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది.

అనారోగ్యం నుండి కోలుకున్న తర్వాత, ఆయనఇతరులపై ఆధారపడకుండా, ఏదో ఒక చిన్న పని అయినా చేసుకొని జీవించాలని నిర్ణయించు కున్నారు. తన ఇంటికి సమీపంలోని ముంబై ఫుట్‌పాత్‌పై సొంతంగా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు.అదీ తన సోదరి సాయంతో. ఆమె ఇంట్లోనే తాజా ఫర్సాన్ లేదా మురుకులు  (సాల్టీ, సేవరీ స్నాక్స్) తయారు చేసి  ఇస్తారు. మన్సుఖ్ కాకా  వాటిని ప్యాకెట్లుగా చేసి తన స్టాల్‌కు తీసుకొచ్చి అమ్ముతారు. ఇలా

సంపాదించేది ఎంతో తెలుసా? 
ఇలా రోజుకి 12 గంటలు శ్రమిస్తున్నప్పటికీ, ఆయనకు రోజుకు లభించే ఆదాయం కేవలం రూ. 300 మాత్రమే. అయినా ఆయన ఏ విచారం లేదు.ఎంతో నిబద్ధతగా పనిచేసుకుంటారు. వ్యాపారానికి సంబంధించిన ప్రతి చిన్న ఖర్చును, అమ్మకాలను ఒక చిన్న డైరీలో లెక్క రాసుకుంటూ ఉంటారు. ఇది నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.

నెటిజనుల ప్రశంసలు
"ఈ వయసులో కూడా మన్సుఖ్ కాకా ఎంతో నమ్మకంతో, కష్టపడి తన స్టాల్‌ను నడుపుతున్నారు. మనమందరం కలిసి ఆయనకు మద్దతు ఇద్దాం" అని  ఆరాధన ఛటర్జీ టిజన్లను కోరారు.

మరోవైపు  ఆయనపై పలువురు ప్రశంసలు  కురిపించారు.  నీట్‌గా  ఇన్‌ షర్ట్ చేసుకొని, ప్రొఫెషనల్‌గా, చిరునవ్వుతో కస్టమర్లను ఆదరించడం సూపర్‌ అంటూ  ఫిదా అవుతున్నారు. ఆయనను కలిసిన వారు "ఆయన ఎంతో వినమ్రుడు, దయాగుణం గలవాడు" అని కొనియాడుతున్నారు. ముంబై ప్రజలు ఆయన స్టాల్‌కు వెళ్లి స్నాక్స్ కొనుగోలు చేసి ఆయనకు మద్దతుగా నిలవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇంట్లో మనవలు మనవరాళ్లతో సంతోషంగా గడపాల్సిన ఆయన కారణాలేమైనప్పటికీ రోజూ ఇలా కష్టపడటం చూస్తే మనసు ద్రవించక మానదు.  మన జీవితంలో తారసపడే ఇలాంటి వారికి మన వంతుగా  చేయూత నిద్దాం! ఏమంటారు?

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement