‘షార్ట్ సెల్లింగ్’ను సులభతరం చేయడంపై సెబీ దృష్టి! | SEBI Plans Major Shake Up Short Selling Made Easier Cash Market Gets Big Boost | Sakshi
Sakshi News home page

‘షార్ట్ సెల్లింగ్’ను సులభతరం చేయడంపై సెబీ దృష్టి!

Jul 6 2026 3:16 PM | Updated on Jul 6 2026 3:18 PM

SEBI Plans Major Shake Up Short Selling Made Easier Cash Market Gets Big Boost

భారతీయ స్టాక్ మార్కెట్‌లో లిక్విడిటీని పెంచడంతో పాటు ఇన్వెస్టర్లకు మరింత సానుకూల వాతావరణాన్ని కల్పించేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’ కీలక మార్పుకు శ్రీకారం చుట్టబోతోంది. మార్కెట్‌లో ‘షార్ట్ సెల్లింగ్’ ప్రక్రియను సులభతరం చేసేలా.. సెక్యూరిటీల లెండింగ్స్‌ అండ్‌ బారోయింగ్స్‌(ఎస్‌ఎల్‌బీ) పరిధిలోకి వచ్చే అర్హత కలిగిన స్టాక్స్ సంఖ్యను దాదాపు రెట్టింపు చేయాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వ్యవహారంతో ప్రత్యక్ష సంబంధం ఉన్న నమ్మకమైన వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం.. అర్హత కలిగిన షేర్ల సంఖ్యను పెంచడంతో పాటు ‘కొలేటరల్’ (హామీ) అవసరాలను కూడా గణనీయంగా తగ్గించేందుకు సెబీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

డెరివేటివ్స్ జోరుకు బ్రేక్.. క్యాష్ మార్కెట్‌కు బూస్ట్!

ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో డెరివేటివ్స్ ట్రేడింగ్ అసాధారణ వృద్ధిని నమోదు చేసింది. అయితే, ఈ విభాగంలో ట్రేడింగ్ చేసే రిటైల్ పెట్టుబడిదారులలో దాదాపు 90% మంది భారీగా నష్టపోతున్నారని సెబీ ఇటీవలే వెల్లడించింది. డెరివేటివ్స్ మార్కెట్ పరిమాణం ప్రస్తుతం క్యాష్ మార్కెట్ కంటే దాదాపు 500 రెట్లు పెద్దదిగా ఉండటం గమనార్హం. ఇది ప్రపంచంలోని ప్రధాన మార్కెట్ల కంటే చాలా ఎక్కువ.

డెరివేటివ్స్‌లో లెవరేజ్ ఎక్కువగా ఉండటం వల్ల సిద్ధాంతపరంగా నష్టాలకు పరిమితి ఉండదు. అదే క్యాష్ మార్కెట్‌లో అయితే రిస్క్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ట్రేడింగ్ వాస్తవ షేర్లు, కొలేటరల్ ఆధారంగా జరుగుతుంది. అందుకే, రిటైల్ ఇన్వెస్టర్లను ఈ ప్రమాదకర డెరివేటివ్స్ మార్కెట్ నుంచి దూరంగా ఉంచి సురక్షితమైన క్యాష్ ఈక్విటీ మార్కెట్ వైపు మళ్లించడమే ఈ కొత్త మార్పుల ప్రధాన ఉద్దేశం.

కఠిన నిబంధనల నుంచి సడలింపుల వైపు..

గతంలో జరిగిన కొన్ని స్టాక్ కుంభకోణాల నేపథ్యంలో భారతదేశం తన నగదు ఈక్విటీ మార్కెట్ భద్రత కోసం అత్యంత కఠినమైన నిబంధనలను రూపొందించింది. మొదట 2000వ దశకంలో, ఆ తర్వాత మళ్లీ 2017 - 2020 కాలంలో ఈ నియమాలను మరింత కఠినతరం చేశారు.

ప్రస్తుత పరిస్థితి ఇలా..

భారత క్యాష్ ఈక్విటీ మార్కెట్‌లో దాదాపు 95% వాటాను కలిగి ఉన్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో సుమారు 2,600 కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి. కానీ, వీటిలో కేవలం 176 కంపెనీల షేర్లు మాత్రమే ప్రస్తుతం అప్పు ఇవ్వడానికి, తీసుకోవడానికి (ఎస్‌ఎల్‌బీ) అర్హత కలిగి ఉన్నాయి. ఈ సంఖ్యను దాదాపు రెట్టింపు చేయడం ద్వారా మార్కెట్‌లోని మెజారిటీ లిక్విడ్ షేర్లను ఈ పరిధిలోకి తీసుకురావచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఖరారయ్యే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement