ముగిసిన రెండో విడత పోలింగ్
మొదటి దశకు మించి ఓటేసిన జనం
కిషన్‌గంజ్‌లో అత్యధికంగా 76.26%
నవాడాలో అత్యల్పంగా 57.31శాతం
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీశ్ కుమార్‌పై ప్రజాభిప్రాయ సేకరణగా భావిస్తున్న అత్యంత కీలకమైన రెండో విడత పోలింగ్‌లో అత్యధికంగా సుమారు 69 శాతం ఓటింగ్ నమోదైంది. నవంబర్ 6వ తేదీన మొదటి విడత పోలింగ్‌లో రికార్డు స్థాయిలో 65.09 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకోగా, ఈసారి అంతకుమించి జనం పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. సమయం పూర్తయిన తర్వాత కూడా బూత్‌ల వద్ద బారులు తీరి కనిపించారు. పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.
ముఖ్యంగా, ముస్లింల ప్రాబల్యమున్న కిషన్‌గంజ్‌లో ఏకంగా 76.26 శాతం ఓటింగ్ నమోదు కావడం విశేషం. పొరుగునున్న కటిహార్‌లో 75.23 శాతం, పుర్నియాలో 73.79 శాతం, అరారియాలో 67.79 శాతం నమోదైంది. అత్యల్పంగా నవాడాలో 57.31 శాతం మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల సమయానికి రాష్ట్రంలో 60 శాతం మార్కును దాటని ఏకైక జిల్లా కూడా ఇదే కావడం గమనార్హం. మొదటి విడతలో 121 నియోజకవర్గాల్లోని 3.75 కోట్ల మంది అర్హులైన ఓటర్లకుగాను 65.09 శాతం మంది ఓటేశారు. ఈసారి 122 స్థానాల్లో 3.70 కోట్ల మంది ఓటర్లుండగా 1,302 మంది పోటీ చేస్తున్నారు.
గతం కంటే 9 శాతం ఎక్కువ
రాష్ట్రంలో రెండో విడత పోలింగ్‌లో రికార్డుస్థాయిలో 68.79 శాతం ఓటింగ్ నమోదైందని చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) వినోద్ సింగ్ గుంజియాల్ తెలిపారు. రెండు విడతల్లో కలిపి 66.91 శాతం మంది ఓటేసినట్లు గణాంకాలు చెబుతున్నాయన్నారు. 1951 తర్వాత మొదటిసారిగా భారీ ఓటింగ్ నమోదైందని చెప్పారు. అదేవిధంగా, పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓటేశారని చెప్పారు. 2020 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇది 9.6 శాతం ఎక్కువని ఆయన వివరించారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో 57.29 శాతం ఓటింగ్ నమోదైందని గుర్తు చేశారు.
మరో 2 వేల పోలింగ్ స్టేషన్ల ఓటింగ్ వివరాలు అందాల్సి ఉన్నందున, ఓటింగ్‌శాతం పెరిగే అవకాశముందన్నారు. తాజా ఫలితాలపై ఇండియా కూటమి నేతలు..ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయడానికి ఇదే నిదర్శనమని పేర్కొనగా, గతంలోనూ ఇలాంటి సందర్భాల్లోనూ ప్రభుత్వాలు కొనసాగిన ఉదాహరణ లున్నాయని ఎన్డీయే నేతలంటున్నారు.
మొదటి, రెండో విడత పోలింగ్ సందర్భంగా అత్యధికంగా 70 శాతానికి మించి ఓటింగ్ నమోదైన జిల్లాలు గంగా నది ఉత్తర ప్రాంతంలోని అత్యధిక జనసాంద్రత కలిగి, ఎన్డీయేకు గట్టి పట్టున్న ప్రాంతాలు కావడం విశేషం. అదే సమయంలో, ముస్లింలు ఎక్కువగా ఉన్న కిషన్‌గంజ్, కటిహార్, పుర్నియా జిల్లాల్లో గత ఎన్నికల్లో ఇండియా కూటమి వైపు మొగ్గు చూపారు. ప్రజలు ప్రత్యామ్నాయం వైపు ఎదురు చూస్తున్నా రనేందుకు ఓటింగ్ శాతాలే తార్కాణమని వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని అంచనా వేశారు.
ఓటేసిన ప్రముఖులు..
జేడీయూ యాక్టింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా, కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ, జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రాజేశ్ రామ్, రాష్ట్రమంత్రి నితీశ్ మిశ్రా తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.


