తమిళనాడు: కోర్టు ఆదేశాల మేరకు భార్యకు జీవనాంశం ఇవ్వని 70 ఏళ్ల వృద్ధుడికి 17 నెలల జైలుశిక్ష విధిస్తూ పళ్ళిపట్టు న్యాయస్థానం ఆదేశించింది. ఆంధ్రాలోని తిరుపతి జిల్లా నారాయణవనంకు చెందిన అన్నాదురై(70)కు మొదటి భార్య మృతితో పళ్ళిపట్టు సమీపంలోని సొరకాయపేటకు చెందిన నిర్మల(45) అనే ప్రత్యేక ప్రతిభావంతురాలిని వివాహం చేసుకున్నారు. దంపతులకు ఇద్దరు అమ్మాయిలు వున్నారు.
గత కొన్నేళ్ల కిందట భార్యను ఆన్నాదురై విడిచిపెట్టడంతో సొరకాయపేటలోని పుట్టింట్లో ఇద్దరు ఆడ బిడ్డలతో నిర్మల వుంటున్నారు.తన భర్త తనతో కాపురం చేయకుండా విడిచిపెట్టినట్లు దీంతో తనకు బిడ్డలకు జీవనం కష్టంగా మారిందని బాధితురాలు 2022లో పళ్లిపట్టు మున్సిల్ జ్యుడిషియల్ కోర్టులో కేసు దాఖలు చేసారు. నిర్మల తరపున న్యాయవాధి భరత్‌కుమార్ వాదనలు వినిపించారు. భార్య బిడ్డలను విడిచిపెట్టిన అన్నాదురై వారి జీవనాంశంగా ప్రతినెలా రూ. 20 వేలు చెల్లించాలని 2022లో న్యాయస్థానం ఆదేశించింది. అయితే అన్నాదురై నిర్మలకు జీవనాంశం చెల్లించపోవడంతో 2024లో మళ్లీ కోర్టు మెట్లెక్కారు.
ఈ కేసుకు సంబందించి అన్నాదురైకు న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీచేసింది. దీంతో పొదటూరుపేట పోలీసులు అన్నాదురైను మంగళవారం అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసుకు సంబందించి న్యాయస్థానం ఆదేశాలు ఎందుకు పాటించలేదని, జీవనాంశం ఎందుకు చెల్లించలేదని న్యాయమూర్తి వెంకటేశన్ ప్రతివాదిని ప్రశ్నించగా సమాదానం లేక పోవడంతో అన్నాదురైకు 17 నెలల జైలుశిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు అన్నాదురైను అరెస్టు చేసి పుళళ్ సెంట్రల్ జైలుకు తరలించారు.


