
సాక్షి, న్యూఢిల్లీ: ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దసరా,దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్, రిటైరైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను మూడు శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పెరిగిన డీఏ జూలై 1 నుండి అమలులోకి వస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా ప్రకటించారు.
బుధవారం (అక్టోబర్1) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ 3 శాతం పెంపుకు ఆమోదం తెలిపింది. ఇక తాజా డీఏ పెంపు ఈ ఏడాదిలో ఇది రెండో సారి. మొదటిసారి మార్చిలో డీఏను రెండు శాతం పెంచింది. దీంతో బేసిక్ పే చెల్లింపులు 53 శాతం నుండి 55 శాతానికి చేరుకున్నాయి. ఇవ్వాళ రెండోసారి డీఏను 3శాతం పెంచింది. కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో డీఏ 55 శాతం నుంచి 58 శాతానికి పెరుగుతుంది. ఈ పెంపు 1.2 కోట్ల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చనుంది. తద్వారా కేంద్ర బడ్జెట్‌పై మొత్తం రూ.10,084 కోట్ల భారం పడనుంది.
చెల్లింపులు ఇలా ఉంటాయి
కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రకటించిన 3శాతం డియర్‌నెస్ అలవెన్స్ పెంపు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జులై 1, 2025 నుండి అమల్లోకి వస్తుంది. అయితే, ఈ పెంపు ప్రకటన అక్టోబర్ వచ్చింది కాబట్టి జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల బకాయిలు (అరియర్స్) కూడా చెల్లించాల్సి ఉంటుంది. అక్టోబర్ జీతంలో పెరిగిన డీఏ 3శాతంతో పాటు గత మూడు నెలలు జులై, ఆగస్టు, సెప్టెంబర్ డీఏ బకాయిలు సైతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందనున్నారు.
