ఉద్యోగులకు రెండేళ్లయినా పీఆర్‌సీ ఇవ్వలేదు
జీరో అవర్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రసంగం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, దేశంలో ఎక్కడా ఈ పరిస్థితి లేదని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లవుతున్నా పీఆర్‌సీ విడుదల చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. శీతాకాల సమావేశాల్లో భాగంగా జీరో అవర్‌లో ప్రభుత్వంపై హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి రథచక్రాల్లాంటి వారని, వారు సంతృప్తిగా ఉంటేనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు సజావుగా చేరుతాయని చెప్పారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలోని ఉద్యోగులంతా తీవ్ర మనోవేదనలో ఉన్నారన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఆలస్యమవడంతో 39 మంది మనోవేదనతో మరణించారని ఆరోపించారు.
తమ ప్రభుత్వంలో 17 వేల మంది ఉద్యోగులు రిటైర్ అయినప్పుడు అందరికీ సమయానికి నిధులు విడుదల చేశామని తెలిపారు. అక్టోబర్ 2024లో రిటైరైన సిద్దిపేటకు చెందిన జేడీ వెటర్నరీ డాక్టర్ జగత్‌కుమార్‌రెడ్డికి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రాలేదని, హైకోర్టులో కేసు వేసినా ప్రభుత్వం స్పందించడం లేదని చెప్పారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని చెప్పి రెండేళ్లు గడిచినా పురోగతి లేకపోయిందని, సీపీఎస్ కింద ప్రభుత్వం చెల్లించాల్సిన కంట్రిబ్యూషన్లను దారి మళ్లించడం వల్ల రెండు లక్షల మంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు.
పోలీసు శాఖలో ఐదు సరెండర్ లీవులు పెండింగ్‌లో ఉన్నాయని, టీఏ, డీఏలు, స్టేషన్ అలవెన్సులు రావడం లేదన్నారు. జీరో అవర్‌లో సభ్యులు అడిగే ప్రశ్నలకు రాతపూర్వక సమాధానాలు తప్పనిసరిగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచి్చన హామీలు వెంటనే అమలు చేసి ఉద్యోగులు, పింఛన్‌దారులకు న్యాయం చేయాలని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను హరీశ్‌రావు కోరారు.
దెయ్యాలు వేదాలు వల్లించినట్లు..: శ్రీధర్‌బాబు
హరీశ్‌రావు ఉద్యోగుల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 20వ తేదీ వరకు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వని పరిస్థితి ఉండేదన్నారు. జీపీఎఫ్, ఉద్యోగుల రిటైర్డ్ ప్రయోజనాలకు సంబంధించి ఒక విధానాన్ని రూపొందించి అందరికీ మేలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.


