రాజ్యసభ సభ్యుల మొత్తం ఆస్తుల విలువ రూ. 26,047 కోట్లు .. ఏడీఆర్ నివేదికలో వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభలోని 226 మంది సభ్యుల మొత్తం ఆస్తుల విలువ ఏకంగా రూ.26,047 కోట్లుగా ఉంది. సగటున ఒక్కో ఎంపీ ఆస్తి రూ.115.25 కోట్లు. రూ.100 కోట్లకు పైగా ఆస్తులున్న ఎంపీలు ఏకంగా 31 మంది (14%) ఉన్నారు. ఇందులో అత్యధికంగా బీజేపీ నుంచి ఏడుగురు, కాంగ్రెస్ నుంచి ఆరుగురు ఉన్నారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ సంయుక్తంగా రాజ్యసభ ఎంపీల ఆర్థిక, నేర, విద్యా, ఇతర నేపథ్యాలపై తాజాగా నివేదిక వెల్లడించింది. జూన్ 2026 నాటికి రాజ్యసభలో మొత్తం 233 స్థానాలు ఉండగా.. అందులో నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 229 మందిలో ముగ్గురు ఎంపీల అఫిడవిట్లు అందుబాటులో లేకపోవడంతో మొత్తం 226 మంది వివరాలను ఏడీఆర్ క్షుణ్ణంగా విశ్లేషించింది.
టాప్–3 కుబేరులు వీరే..: దేశంలోనే అత్యంత సంపన్న రాజ్యసభ సభ్యుడిగా తెలంగాణకు చెందిన బీఆర్‌ఎస్ ఎంపీ బండి పార్థసారథిరెడ్డి నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ.5,300 కోట్లపైనే ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో పంజాబ్ బీజేపీ ఎంపీ రాజిందర్ (రూ.5,053 కోట్లు), తెలంగాణకే చెందిన కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ (రూ.2,558 కోట్లు) ఉన్నారు. ఆస్తులపరంగా చివరన పంజాబ్ ఆప్ ఎంపీ సంత్ బల్బీర్ సింగ్ (రూ.3.79 లక్షలు) ఉన్నారు. అత్యధిక అప్పులున్న సభ్యుడిగా జార్ఖండ్‌కు చెందిన స్వతంత్ర ఎంపీ నత్వానీ పరిమళ్ (రూ.256 కోట్లు) నిలిచారు.
రాష్ట్రాల వారీగా చూస్తే రాజ్యసభలో తెలంగాణ నుంచి ఏడుగురు సభ్యుల మొత్తం ఆస్తుల విలువ అత్యధికంగా రూ.8,310 కోట్లుగా ఉంది. 69 మంది (31 శాతం) తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్, సీపీఎంకు చెందిన వంద శాతం ఎంపీలపై కేసులున్నాయి. టీడీపీలో 75 శాతం (ముగ్గురు), ఆర్జేడీలో 67 శాతం, కాంగ్రెస్‌లో 41 శాతం (12 మంది), ఆప్‌లో 33 శాతం, బీజేపీలో 26 శాతం (28 మంది) సభ్యులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు.
తెలంగాణ నుంచి అత్యధికంగా 71 శాతం (ఐదుగురు) సభ్యులపై క్రిమినల్ కేసులున్నాయి. 182 మంది (81 శాతం) డిగ్రీ ఆపై విద్యార్హత కలిగిన వారున్నారు. రాజ్యసభ సభ్యుల్లో పురుషులు 192 మంది (85 శాతం) ఉండగా.. మహిళలు 34 మంది (15 శాతం) ఉన్నారు. సభలో అత్యంత పెద్ద వయస్కుడిగా ఎన్సీపీ (శరద్ పవార్)–ఎంపీ శరద్ పవార్ (86 ఏళ్లు) ఉండగా అత్యంత పిన్న వయస్కుడిగా బీజేపీ ఎంపీ రాఘవ్ చద్దా (33 ఏళ్లు) ఉన్నారు.


