breaking news
total assets
-
సగటున ఒక్కో ఎంపీ ఆస్తి రూ.115 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభలోని 226 మంది సభ్యుల మొత్తం ఆస్తుల విలువ ఏకంగా రూ.26,047 కోట్లుగా ఉంది. సగటున ఒక్కో ఎంపీ ఆస్తి రూ.115.25 కోట్లు. రూ.100 కోట్లకు పైగా ఆస్తులున్న ఎంపీలు ఏకంగా 31 మంది (14%) ఉన్నారు. ఇందులో అత్యధికంగా బీజేపీ నుంచి ఏడుగురు, కాంగ్రెస్ నుంచి ఆరుగురు ఉన్నారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ సంయుక్తంగా రాజ్యసభ ఎంపీల ఆర్థిక, నేర, విద్యా, ఇతర నేపథ్యాలపై తాజాగా నివేదిక వెల్లడించింది. జూన్ 2026 నాటికి రాజ్యసభలో మొత్తం 233 స్థానాలు ఉండగా.. అందులో నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 229 మందిలో ముగ్గురు ఎంపీల అఫిడవిట్లు అందుబాటులో లేకపోవడంతో మొత్తం 226 మంది వివరాలను ఏడీఆర్ క్షుణ్ణంగా విశ్లేషించింది.టాప్–3 కుబేరులు వీరే..: దేశంలోనే అత్యంత సంపన్న రాజ్యసభ సభ్యుడిగా తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ ఎంపీ బండి పార్థసారథిరెడ్డి నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ.5,300 కోట్లపైనే ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో పంజాబ్ బీజేపీ ఎంపీ రాజిందర్ (రూ.5,053 కోట్లు), తెలంగాణకే చెందిన కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ (రూ.2,558 కోట్లు) ఉన్నారు. ఆస్తులపరంగా చివరన పంజాబ్ ఆప్ ఎంపీ సంత్ బల్బీర్ సింగ్ (రూ.3.79 లక్షలు) ఉన్నారు. అత్యధిక అప్పులున్న సభ్యుడిగా జార్ఖండ్‌కు చెందిన స్వతంత్ర ఎంపీ నత్వానీ పరిమళ్ (రూ.256 కోట్లు) నిలిచారు.రాష్ట్రాల వారీగా చూస్తే రాజ్యసభలో తెలంగాణ నుంచి ఏడుగురు సభ్యుల మొత్తం ఆస్తుల విలువ అత్యధికంగా రూ.8,310 కోట్లుగా ఉంది. 69 మంది (31 శాతం) తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్నారు. బీఆర్ఎస్, సీపీఎంకు చెందిన వంద శాతం ఎంపీలపై కేసులున్నాయి. టీడీపీలో 75 శాతం (ముగ్గురు), ఆర్జేడీలో 67 శాతం, కాంగ్రెస్‌లో 41 శాతం (12 మంది), ఆప్‌లో 33 శాతం, బీజేపీలో 26 శాతం (28 మంది) సభ్యులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు.తెలంగాణ నుంచి అత్యధికంగా 71 శాతం (ఐదుగురు) సభ్యులపై క్రిమినల్ కేసులున్నాయి. 182 మంది (81 శాతం) డిగ్రీ ఆపై విద్యార్హత కలిగిన వారున్నారు. రాజ్యసభ సభ్యుల్లో పురుషులు 192 మంది (85 శాతం) ఉండగా.. మహిళలు 34 మంది (15 శాతం) ఉన్నారు. సభలో అత్యంత పెద్ద వయస్కుడిగా ఎన్సీపీ (శరద్ పవార్)–ఎంపీ శరద్ పవార్ (86 ఏళ్లు) ఉండగా అత్యంత పిన్న వయస్కుడిగా బీజేపీ ఎంపీ రాఘవ్ చద్దా (33 ఏళ్లు) ఉన్నారు. -
ఎన్బీఎఫ్సీ కంపెనీలకు మంచి రోజులు
ముంబై: ఎన్బీఎఫ్సీ రంగానికి సంబంధించి క్రిసిల్ రేటింగ్స్ సానుకూల అంచనాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) వాటి ఆస్తులు నాలుగేళ్ల గరిష్ట స్థాయి అయిన 11–12 శాతం మేర వృద్ధి చెందుతాయని అంచనా వేసింది. కరోనా కారణంగా వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాల పాటు ఎన్బీఎఫ్సీ ఆస్తుల వృద్ధి కుంటుపడిందని, 2021–22లో కేవలం 5 శాతం వృద్ధికి పరిమితమైనట్టు వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాటి ఆస్తులు రెండంకెల స్థాయిలో పెరగొచ్చని అంచనా వేస్తూ.. అయినప్పటికీ కరోనా ముందున్న 20 శాతం వృద్ధి కంటే తక్కువేనని పేర్కొంది. బ్యాంకుల నుంచి తీవ్ర పోటీ ఉండడం, వడ్డీ రేట్ల పెరుగుదల కొన్ని విభాగాల్లో ఎన్‌బీఎఫ్‌సీల పోటీతత్వాన్ని ప్రభావితం చేస్తాయని అంచనా వేసింది. దీనివల్ల ఎన్బీఎఫ్సీలు అధిక రాబడులు వచ్చే విభాగాలపై దృష్టి సారించొచ్చని పేర్కొంది. వాహన రుణాల్లో మెరుగైన వృద్ధి.. ఎన్బీఎఫ్సీ ఆస్తుల్లో (అవి ఇచ్చిన రుణాలు) సగం మేర వాహన రుణాలే ఉంటాయి. ఇవి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 11-13 శాతం వరకు పెరుగుతాయని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. క్రితం రెండు ఆర్థిక సంవత్సరాల్లోనూ వాహన రుణాల్లో వృద్ధి 3–4 శాతంగానే ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. పునర్వినియోగ వాహన రుణాల్లో అధిక వృద్ధిని ఎన్బీఎఫ్సీలు చూస్తాయని, వీటిల్లో అధిక మార్జిన్లు ఉంటాయనే విషయాలను ప్రస్తావించింది. వాహన రుణాలు ఆశాజనకంగా ఉండడం, ఇన్ఫ్రా రంగం నుంచి వాహనాలను మార్చేందుకు బలమైన డిమాండ్ ఉంటుందని క్రిసిల్ తెలిపింది. తీవ్ర పోటీ, పెరిగే వడ్డీ రేట్ల వల్ల కొత్త వాహన రుణాల్లో బ్యాంకులు పైచేయి చూపించొచ్చని పేర్కొంది. -
మోదీ దగ్గరున్న నగదు ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ వద్ద పెద్దగా ఆస్తులు లేవన్న సంగతి తెలిసిందే. ఎప్పుడో 13 ఏళ్ల కిందట కొనుగోలు చేసిన ఓ బంగ్లా మాత్రమే ఆయన దగ్గరున్న ప్రధాన ఆస్తి. దీని ధర కాలక్రమంలో 25 రెట్లు పెరిగిపోయి.. దీనివల్లే ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ. 1.41 కోట్లకు చేరుకుంది. అయినా ప్రధాని మోదీ వ్యక్తిగతంగా తన దగ్గర ఉంచుకున్న నగదు ఎంతో తెలుసా? అక్షరాల రూ. 4,700 మాత్రమే. గడిచిన ఆర్థిక సంవత్సరాంతనికి మోదీ వద్ద నున్న చేతిలో నగదు రూ. 4,700 మాత్రమేనని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ మేరకు ఆయన ఆస్తుల వివరాలను పీఎంవో సోమవారం వెల్లడించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో మోదీ వద్ద చేతిలో నగదు 2014 ఆగస్టు 18 నాటికి రూ. 38,700 ఉండగా, ఆర్థిక సంవత్సరం ముగిసిపోయేసరికి రూ. 4,700లకు పడిపోయిందని పీఎంవో వెల్లడించింది. మొత్తానికి ప్రధాని మోదీ స్థిర, చరాస్తులు 2015 మార్చ్ 31 నాటికి కొద్దిగా పెరిగాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో పోల్చుకుంటే రూ. ఒక కోటి 26 లక్షల 12 వేల 288 నుంచి రూ. ఒక కోటి 41 లక్షల 14వేల 893కు పెరిగాయి. మోదీ 2014 మే 26న ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయినా ఆయనకు వ్యక్తిగతంగా ఎలాంటి వాహనాలు లేవు. ఇప్పటికీ మోదీకి గుజరాత్ లోనే బ్యాంకు ఖాతా ఉంది. ఢిల్లీలో బ్యాంకు ఖాతా లేదు. మోదీ వద్ద 45 గ్రాముల బంగారు ఉంగరాలు ఉన్నాయి. వీటి విలువ గత ఏడాదికాలంలో రూ. 1.21 లక్షల నుంచి రూ. 1.19 లక్షలకు పడిపోయింది. ఆయనకు ఎల్ అండ్ టీ ఇన్ ఫ్రా బాండ్స్ (పన్ను మినహాయింపు ఉంటుంది) లో రూ. 20 వేల విలువైన పెట్టుబడులు, రూ. 5.45 లక్షల జాతీయ పొదుపు సర్టిఫికెట్లు, రూ. 1.99 లక్షల జీవిత బీమా, మొత్తంగా రూ. 41.15 లక్షల చరాస్తులు మోదీ వద్ద ఉన్నాయి. మోదీకి ఎలాంటి అప్పులు, రుణాలు లేవు. ఈ మేరకు మోదీ ఆస్తుల వివరాలను 2016 జనవరి 30వ తేదీ నాటికి పీఎంవో వెబ్ సైట్ లో అప్ డేట్ చేశారు. ఇక స్థిరాస్తి విషయానికొస్తే గాంధీనగర్ లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ మాత్రమే మోదీ వద్ద ఉంది. ఈ నివాస ఆస్తిలో 3,531.45 చదరపు అడుగుల స్థలం మోదీ పేరిట ఉంది. ఇందులో 169.81 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించి ఉంది. దీనిని అప్పట్లో మొత్తంగా రూ. 2,47,208లకు కొనుగోలు చేయగా దాని మార్కెట్ విలువ 25 రెట్లు పెరిగిపోయి రూ. కోటికి చేరింది.


