Delhi: భవనం కూలిన ఘటనలో ఇద్దరు చిన్నారులు, గర్భిణి మృతి! | 2 Children Pregnant woman among 3 dead in Seemapur Building Collapse | Sakshi
Sakshi News home page

Delhi: భవనం కూలిన ఘటనలో ఇద్దరు చిన్నారులు, గర్భిణి మృతి!

Oct 8 2026 7:46 AM | Updated on Oct 8 2026 7:46 AM

2 Children Pregnant woman among 3 dead in Seemapur Building Collapse

న్యూఢిల్లీ: ఢిల్లీలోని న్యూ సీమాపురిలో ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు చిన్నారులు, నాలుగు నెలల గర్భిణి సహా ముగ్గురు మృతి చెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. శిథిలాల కింద 11 మంది చిక్కుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఘటనాస్థలంలో పలు శరీర భాగాలు లభించడంతో మృతుల సంఖ్య ఆరుకు చేరే అవకాశం ఉందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.

న్యూ సీమాపురిలోని ఇరుకైన వీధుల్లో భవనం కూలిపోవడంతో స్థానికులు వెంటనే సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సమీపంలోని ఈద్గా వైపు నుంచి మాత్రమే ఘటనాస్థలానికి చేరుకునే అవకాశం ఉండటంతో అగ్నిమాపక సిబ్బందికి ఇబ్బందులు ఎదురయ్యాయి. రాత్రి 7.20 గంటల సమయంలో ఓ చిన్నారి మృతదేహాన్ని శిథిలాల నుంచి బయటకు తీశారు. రాత్రి 8.15 గంటలకు నాలుగు నెలల గర్భిణి గులాఫ్సా మృతదేహాన్ని వెలికితీశారు. ఆమె వయసు 21 ఏళ్లు.

ప్రమాదం జరిగిన సమయంలో గులాఫ్సా తన తల్లి ఇంటికి వెళ్లినట్లు ఆమె సోదరి సమీనా తెలిపారు. ఆమెతో పాటు నాలుగేళ్ల కుమార్తె, భవనం యజమాని కుమార్తె కూడా చిక్కుకున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళనతో ఎదురుచూశారు. డీసీపీ (షహదారా) రాజేంద్ర ప్రసాద్ మీనా ఇప్పటివరకు ముగ్గురి మరణాన్ని ధ్రువీకరించారు. అయితే లభించిన శరీర భాగాలు మరికొందరు బాధితులకు చెందినవై ఉండొచ్చని తెలిపారు.

మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) తెలిపిన వివరాల ప్రకారం.. కూలిన భవనం 20 నుంచి 25 ఏళ్ల నాటిది. ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్‌మెంట్ బోర్డు పరిధిలోని జేజే క్లస్టర్‌లో ఇది ఉంది. భవనం యజమాని మహమ్మద్ అన్వర్ మేస్త్రీగా పనిచేస్తూ, గ్రౌండ్‌ఫ్లోర్‌లో స్క్రాప్ వ్యాపారం నిర్వహించేవాడు. అతను తన కుటుంబంతో కలిసి పై రెండు అంతస్తుల్లో ఉండేవాడు. మిగిలిన రెండు అంతస్తులను రెండు కుటుంబాలకు అద్దెకు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: దసరా: ఈ ఏడు ప్రాంతాల్లోనే అసలైన సందడి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement