న్యూఢిల్లీ: ఢిల్లీ పేలుడు కేసులో ఆత్మాహుతి బాంబర్‌గా అనుమానిస్తున్న డాక్టర్ ఉమర్ మొహమ్మద్ మొదటి ఫొటో బయటకు వచ్చింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట సమీపంలో పేలిని తెల్లని హ్యుందాయ్ ఐ20 కారు డాక్టర్ ఉమర్‌కు చెందినది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుమానిత ఆత్మాహుతి బాంబర్ మొదటి చిత్రాన్ని ‘ఎన్‌డీటీవీ’ యాక్సెస్ చేసింది. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో 1989, ఫిబ్రవరి 24న జన్మించిన ఉమర్.. అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలో డాక్టర్‌గా పనిచేస్తున్నారు. జమ్ముకశ్మీర్, హర్యానా పోలీసు బృందాలు అరెస్టు చేసిన వైద్యులు డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్, డాక్టర్ ముజమ్మిల్ షకీల్‌లకు డాక్టర్ ఉమర్ అత్యంత సన్నిహితుడు.
దర్యాప్తు అధికారులు మాడ్యూల్‌లోని ఇద్దరు కీలక సభ్యులను అరెస్టు చేశారని, 2,900 కిలోల అనుమానిత పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారని తెలుసుకున్న డాక్టర్ ఉమర్ ఫరీదాబాద్ నుండి పారిపోయాడు. తరువాత అతను భయాందోళనకు గురై పేలుడుకు పాల్పడ్డాడని సమాచారం. ఉమర్ మొహమ్మద్, అతని సహచరులు దాడి చేయడానికి అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ (ఏఎన్‌ఎఫ్‌ఓ)ఉపయోగించారు. వారు కారులో డిటోనేటర్‌ను ఉంచి ఎర్రకోట సమీపంలోని రద్దీ ప్రాంతంలో దాడికి పాల్పడ్డారని దర్యాప్తు వర్గాలు తెలిపాయి.

ఎర్రకోట సమీపంలో పేలిన తెల్లని హ్యుందాయ్ ఐ20 కారు బదర్‌పూర్ సరిహద్దు నుండి ఢిల్లీలోకి ప్రవేశించినట్లు సీసీటీవీ వీడియో, ఫొటోలలో కనిపిస్తోంది. కారు ఔటర్ రింగ్ రోడ్ నుంచి పాత ఢిల్లీకి వచ్చింది. HR 26CE7674 నంబర్ ప్లేట్‌తో ఉన్న ఈ వాహనం ఎర్ర కోట సమీపంలోని పార్కింగ్ స్థలంలో మూడు గంటల పాటు నిలిపి ఉంచారు. మధ్యాహ్నం 3:19 గంటలకు ప్రవేశించి సాయంత్రం 6:30 గంటలకు కారు బయలుదేరిందని భద్రతా వర్గాలు తెలిపాయి. అనుమానిత ఆత్మాహుతి దళ సభ్యుడు కారును ఒక్క నిమిషం కూడా వదిలి వెళ్లలేదని సమాచారం.


