అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం : ఎస్పీ

Oct 1 2026 4:52 AM | Updated on Oct 1 2026 4:52 AM

నారాయణపేట: జిల్లాలో అక్రమ కార్యకలాపాలు నిర్వహించే వారి పై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ డా. జి.వినీత్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయ కాన్ఫరెన్‌న్స్‌ హాల్‌లో శాంతిభద్రతలు, నేర నియంత్రణ, ఎనన్‌ఫోర్స్‌మెంట్‌, పెండింగ్‌ కేసులు, రోడ్డు ప్రమాదా ల నివారణ తదితర అంశాలపై డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మద్యం అక్రమ విక్రయాలు, ఇసుక, రేషన్‌ బియ్యం అక్రమ రవాణా, గంజాయి, డ్రగ్స్‌, మత్తు పదార్థాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగించాలని సూచించారు. రోడ్డు పక్కన ఉన్న దాబాలు, బార్లు, ప్రమాదకర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు విస్తృతం చేయాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. పోలీసు ఉద్యోగార్థులను ప్రోత్సహించేందుకు జిల్లాలో ఉచిత పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ కోచింగ్‌ను విస్తృతంగా నిర్వహించాలని కోరారు. ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రతిభ ఆధారంగా కనీసం 100 మందిని ఎంపిక చేసి ఉచిత శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్‌ అందించాలని సూచించారు. ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేసేందుకు సిబ్బంది వారి ఇళ్ల వద్దకు వెళ్లి ఫిర్యాదులు స్వీకరించి అక్కడికక్కడే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే విధానాన్ని ప్రోత్సహించాలని ఆదేశించారు. గ్రేవ్‌, నాన్‌ గ్రేవ్‌ కేసులను వేర్వేరుగా సమీక్షిస్తూ దర్యాప్తు పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. న్యాయ అధికారులతో సమన్వయం చేసుకుని పెండింగ్‌ కేసులను గణనీయంగా తగ్గించాలని కోరారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, నేర నియంత్రణ, రోడ్డు భద్రత, ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాల్లో పనితీరును మెరుగుపర్చుకోవాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి అధికారి, సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో డీఎస్పీలు మహేష్‌, నల్లపు లింగయ్య, సీఐలు శివశంకర్‌, రాంలాల్‌, భగవంత్‌రెడ్డి, సైదులు, ఎస్‌ఐలు భాగ్యలక్ష్మిరెడ్డి, పురుషోత్తం, కేటీ మల్లేష్‌, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement