ఓటు.. ఒడిసిపట్టు! | - | Sakshi
Sakshi News home page

ఓటు.. ఒడిసిపట్టు!

Oct 2 2026 1:28 AM | Updated on Oct 2 2026 1:28 AM

గెలుపే లక్ష్యంగా వ్యూహాలు..

మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి 2021లో జరిగిన ఎన్నికల్లో నమోదైన మొత్తం ఓటర్ల సంఖ్య 5,17,883 కాగా.. మొత్తం పోలైన ఓట్లు 3,57,354. ఇందులో 3,37,039 ఓట్లు చెల్లుబాటయ్యాయి. ప్రస్తుతం ఓటర్ల సంఖ్య పెరగనుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉండగా.. అంతకు ముందుగా ఈ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుండడంతో మూడు ప్రధాన పార్టీలు ఈ పోరును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహప్రతివ్యూహాలు అమలు చేసేలా కసరత్తు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో రాజకీయ వేడి రాజుకోనున్నట్లు తెలుస్తోంది.

‘పట్టభద్రుల’ పోరుపై

ప్రధాన పార్టీల కీలక కసరత్తు

● మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌ స్థానం

కై వసమే లక్ష్యంగా వ్యూహాలు..

● బీఆర్‌ఎస్‌, బీజేపీలో

అభ్యర్థిత్వాల జల్లెడ..

కాంగ్రెస్‌ నుంచి ‘సామా’ ఖరారు

● ఓటరు నమోదుపైనే

నేతల ప్రధాన దృష్టి..

పార్టీల వారీగా సహాయ కేంద్రాలు

● గత ఎన్నికల్లో నమోదైన

గ్రాడ్యుయేట్‌ ఓటర్లు 5,17,883.. పోలైన ఓట్లు 3,57,354

● ఈసారి మరింత పెరిగే అవకాశం.. వాట్సాప్‌ల ద్వారా విస్తృత ప్రచారం

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానంపై ప్రధాన రాజకీయ పార్టీలు నజర్‌ వేశాయి. ఇప్పటికే ఓటరు నమోదుకు నోటిఫికేషన్‌ వెలువడిన నేపథ్యంలో పోరు కసరత్తు ముమ్మరం చేశాయి. అధికార కాంగ్రెస్‌ అభ్యర్థి ఖరారు కాగా.. బీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థిత్వాలను ఫైనల్‌ చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. దీంతో పాటు ఓటు ఒడిసిపట్టేలా ఓటరు నమోదుపై అన్ని పార్టీల ముఖ్య నేతలు దృష్టి కేంద్రీకరించారు. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో మండలాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటరు నమోదు కోసం ఆయా పార్టీల ఆధ్వర్యంలో సహాయకేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. పట్టభద్ర ఓటర్లను ఆకర్శించే లక్ష్యంతో పావులు కదిపేలా స్థానిక నాయకత్వం, తమ తమ అనుబంధ ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల ముఖ్యులకు దిశానిర్దేశం చేసే పనిలో నిమగ్నమయ్యారు.

తెరపైకి పలువురి పేర్లు..

బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవాలని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇటీవల ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, ముఖ్య నేతలతో సమావేశమై అభ్యర్థిపై చర్చించారు. మహబూబ్‌నగర్‌కు చెంది హైదరాబాద్‌లో ఓ ప్రధాన ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్య సేవలందిస్తున్న ప్రముఖ డాక్టర్‌తో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి పేర్లు తెరపైకి వచ్చినట్లు సమాచారం. బీజేపీలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పేరు వినిపిస్తున్నా.. ఆయన సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. గతంలో ఈ స్థానం నుంచి ఆయన గెలుపొందగా.. ఆ పార్టీలో దేవరకద్రకు చెందిన డోకూరి పవన్‌కుమార్‌తో పాటు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు చెందిన పలువురు నేతలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

ప్రత్యేక ఏర్పాట్లు.. విస్తృత ప్రచారం..

అభ్యర్థుల ఖరారును పక్కనబెడితే ప్రధాన రాజకీయ పక్షాలు ఓటరు నమోదుపైనే ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాయి. గత ఎన్నికల్లో పట్టభద్ర ఓటర్లు అవగాహన లేకపోవడంతో ఓటు నమోదుకు దూరం కావడం, ఇతరత్రా లోపాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడా తప్పిదాలు జరగకుండా గ్రామ, మండల, పట్టణాల వారీగా అర్హులైన పట్టభద్రులను గుర్తించి.. ప్రత్యేక కార్యాచరణతో ముందుకుసాగుతున్నాయి. పట్టభద్రులతో దరఖాస్తు చేయించే ప్రక్రియపైనే ప్రధానంగా నజర్‌ వేశాయి. పార్టీల వారీగా సహాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో కూడా ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉండగా.. ఇందుకు తగిన విధంగా మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లో కార్యాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాయి. తగిన ధ్రువపత్రాలతో వచ్చేవారివి కంప్యూటర్లలో అక్కడికక్కడే నమోదు చేస్తున్నారు. అంతేకాదు.. పట్టభద్రులను ఆకర్షించేలా పార్టీల నేతలు సామాజిక మాధ్యమాల్లో ఇప్పటినుంచే ప్రచారం మొదలుపెట్టారు. ఓటరు నమోదుపై అవగాహన కల్పిస్తున్నారు. పట్టభద్రుల ఫోన్‌ నంబర్లు సేకరించి ఓటు నమోదుకు కావాల్సిన ధ్రువపత్రాలు.. ఫారం–18 నింపే విధానంపై మెసేజ్‌, వీడియోల రూపంలో పంపుతున్నారు.

కాంగ్రెస్‌ క్లియర్‌.. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఆచితూచి..

మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానానికి 2007 నుంచి ఇప్పటివరకు నాలుగు పర్యాయాలుగా ఎన్నికలు జరగగా.. ఆ పదవి ఒక్కసారి కూడా కాంగ్రెస్‌ను వరించలేదు. ప్రస్తుతం అధికారంలో ఉండడంతో ఆ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ మేరకు ముందస్తుగా పార్టీ అభ్యర్థిగా రంగారెడ్డి జిల్లాకు చెందిన సామా రామ్మోహన్‌రెడ్డి పేరును ఖరారు చేయడమే కాకుండా.. జిల్లాల వారీగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకుసాగుతోంది. అయితే బీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థిత్వాల ఖరారుపై ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement