నారాయణపేట ఎడ్యుకేషన్: జవహార్ నవోదయ విద్యాలయాల్లో 2027–28 విద్యాసంవత్సరానికిగాను 6వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష దరఖాస్తు గడువును ఆగస్టు 7వ తేదీ వరకు పొడిగించినట్లు కలెక్టర్ సీహెచ్ ప్రియాంక శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. https://cbseitms.rcil.gov.in. /nvs/. వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని.. ఆసక్తిగల విద్యార్థలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
జిల్లాలో మోస్తరు వర్షం
నారాయణపేట: జిల్లాలో శనివారం పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. మొత్తం 13 మండలాలు ఉండగా.. 11 మండలాల్లో వర్షం కురవగా.. సగటు వర్షపాతం 4.1 మి.మీ.గా నమోదైంది. మక్తల్‌లో అత్యధికంగా 10 మి.మీ. కోస్గిలో 8.6, మద్దూరులో 8.0, మాగనూరులో 7.2, గుండుమాల్‌లో 5.3, ధన్వాడలో 4.4, దామరగిద్దలో 4.2 మి.మీ., నారాయణపేట, కొత్తపల్లిలో 1.8 మి.మీ., నర్వ, మరికల్‌లో 1.0 చొప్పున వర్షం కురిసింది. పంటల సాగుకు ఈ వర్షాలు దోహదపడతాయని రైతులు చెబుతున్నారు.
జిల్లాస్థాయి అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక
నారాయణపేట ఎడ్యుకేషన్: క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి రమణ కోరారు. శనివారం జిల్లాకేంద్రంలోని మినీ స్టేడియంలో నిర్వహించిన అండర్–6, 8, 10, 12 మరియు అండర్ 18 జిల్లాస్థాయి సబ్ జూనియర్ యూత్ ఛాంపియన్ పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడలతో శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటామని తెలిపారు. పోటీలకు జిల్లా నలుమూలల నుంచి సుమారు 200 మంది విద్యార్ధులు తరలివచ్చారు. ఎంపికై న విద్యార్థులు ఈ నెల 7, 8 తేదీల్లో హన్మకొండలో జరిగే తెలంగాణ రాష్ట్రస్థాయి 5వ జావెలిన్ డే అథ్లెటిక్స్–2026 మీట్ పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో ఖేలో ఇండియా అథ్లెటిక్స్ కోచ్ హారికదేవి, పీడీ బీరప్ప, రాజశేఖర్, విద్యాసాగర్, సరిత తదితరులు పాల్గొన్నారు.
పెసర క్వింటా రూ.9,652
నారాయణపేట: పెసర రైతులకు మార్కెట్ ధరలు ఊరటనిస్తున్నాయి. జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు శనివారం 41.65 క్వింటాళ్ల పెసర రాగా.. క్వింటాకు గరిష్టంగా రూ.9,652, కనిష్టంగా రూ.8,069 ధర పలికింది.


