నారాయణపేట: మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా నారాయణపేట, దామరగిద్ద, కోస్గి మండలాల్లో గుర్తించిన గ్రామాల్లో భూ సేకరణ సర్వేను మరింత వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, నీటిపారుదలశాఖ అధికారులు, తహసీల్దార్లతో ఎంఎనన్‌కేఎల్ ప్రాజెక్టు భూ సేకరణ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. దామరగిద్ద మండలంలోని ఇట్లాపూర్, గత్ప, కానుకుర్తి, అన్నాసాగర్, ఉల్లిగుండం గ్రామాల్లో సర్వే, భూ సేకరణ ఎంతవరకు పూర్తయిందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే కోస్గి మండలం నాచారం, తోగాపూర్ గ్రామాల్లో సర్వేపై సర్వే ల్యాండ్ ఏడీని ఆరా తీశారు. ఈ రెండు గ్రామాల్లో రెండ్రోజుల్లో సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. ముశ్రీఫా, మీర్జాపూర్‌లో ఎంజాయ్‌మెంట్ సర్వేను వేగవంతం చేయాలని సూచించారు. అలాగే చంద్రవంచ, ముక్తిపాడ్, చెన్నారం గ్రామాల్లోనూ వారం రోజుల్లో సర్వే పూర్తి చేసి భూ సేకరణ వేగవంతం చేయాలని ఆదేశించారు. అవసరమైతే ఆయా గ్రామాల సర్పంచుల సహకారం తీసుకోవాలని ఆర్డీఓ రమేష్‌కు సూచించారు. భూ నిర్వాసితులకు నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వచ్చే శనివారం సర్వే, భూసేకరణ పురోగతిపై మరోసారి సమీక్ష నిర్వహిస్తానని కలెక్టర్ స్పష్టం చేశారు.


