మార్కెట్‌ పీఠం ఎవరికో? | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ పీఠం ఎవరికో?

Oct 5 2026 12:45 AM | Updated on Oct 5 2026 12:45 AM

● నారాయణపేట, కోస్గిలో ముగిసిన

పాలకవర్గాల పదవీకాలం

● మక్తల్‌ మార్కెట్‌ కమిటీకి

డిసెంబర్‌ వరకు గడువు

● పదవుల పొడిగింపుపై పాతవారి ఆశలు.. కొత్త కుర్చీలపై ఆశావహుల గురి

● జోరుగా రాజకీయ పైరవీలు

నారాయణపేట: జిల్లాలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పదవులపై ఉత్కంఠ నెలకొంది. నారాయణపేట, కోస్గి వ్యవసాయ మార్కెట్‌ కమిటీల పదవీకాలం ముగియడంతో రాజకీయ పైరవీలు జోరందుకున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ఆశావహుల్లో టెన్షన్‌ మొదలైంది. జిల్లాకేంద్రమైన నారాయణపేట మార్కెట్‌ కమిటీ గడువు ముగిసి 18 రోజులు దాటగా.. పదవుల కొనసాగింపుపై ప్రస్తుత చైర్మన్‌, డైరెక్టర్లలో ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు కొత్త కమిటీ వస్తుందన్న ఆశతో ఆశావహులు తమ రాజకీయ లాబీయింగ్‌ను వేగవంతం చేసినట్లు అధికార పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ఎవరి లెక్కలు వారివే..

పదవి కొనసాగుతుందన్న ఆశతో ప్రస్తుత సభ్యులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తుండగా.. కొత్త కమిటీ ఏర్పాటైతే తమకు అవకాశం దక్కుతుందని పలువురు నాయకులు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మార్కెట్‌ కమిటీ పాలకవర్గాలు ప్రస్తుతం సాధారణ పరిపాలనా పదవులుగా కాకుండా, స్థానిక రాజకీయ సమీకరణాలకు కీలక కేంద్రాలుగా మారాయి.

పాత కమిటీకి భరోసా!

నారాయణపేట మార్కెట్‌ కమిటీ ప్రస్తుత పాలకవర్గం 2024 సెప్టెంబర్‌ 16న ప్రమాణస్వీకారం చేసింది. అయితే పదవీకాలం ముగియడంతో సభ్యులు తమ పదవుల కొనసాగింపుపై అధికార పార్టీ ముఖ్యుల వద్ద ఆరా తీస్తున్నట్లు చర్చ. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కుంభం శివకుమార్‌రెడ్డి వద్ద పలువురు సభ్యులు ఈ అంశాన్ని ప్రస్తావిస్తుండగా.. తొందరపడొద్దు, ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని భరోసా ఇస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

కోస్గిలో ముగిసిన గడువు..

నారాయణపేట తర్వాత కోస్గి వ్యవసాయ మార్కెట్‌ కమిటీపైనే అందరి దృష్టి పడింది. 2026 అక్టోబర్‌ 3తో కోస్గి పాలకవర్గం గడువు పూర్తవ్వడంతో చైర్మన్‌ మడ్డి భీములు నేతృత్వంలోని ప్రస్తుత పాలకవర్గం భవిష్యత్‌పై స్పష్టత కోసం ఎదురుచూస్తోంది. అదే సమయంలో కొత్తగా అవకాశం కోసం ఆశిస్తున్న నాయకుల్లోనూ ఆసక్తి పెరుగుతోంది. అయితే కోస్గి కమిటీ ప్రమాణ స్వీకారం, పదవీకాలం లెక్కలపై భిన్న అభిప్రాయాలు ఉన్నందున తుది స్పష్టత అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. అయితే ప్రస్తుత కమిటీ పదవుల కొనసాగింపు విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

పాత వారికే పొడిగింపా..

కొత్తవారికి పట్టాభిషేకమా?

మార్కెట్‌ కమిటీ పదవీకాలాన్ని ప్రభుత్వం చట్టపరమైన నిబంధనల మేరకు పొడిగించవచ్చు. ఒక్కసారి ఇచ్చే పొడిగింపు ఆరు నెలలకు మించకూడదు. మరోవైపు కమిటీ పునర్‌వ్యవస్థీకరణలో ఆలస్యం జరిగితే ప్రభుత్వం తాత్కాలిక నిర్వహణకు వ్యక్తి/వ్యక్తులను నియమించే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే వరకు నారాయణపేట, కోస్గి మార్కెట్‌ కమిటీల్లో పాలన కంటే పదవులపై చర్చ కొనసాగుతోంది. మార్కెట్‌ లావాదేవీల కంటే రాజకీయ లెక్కలే హాట్‌టాపిక్‌గా మారాయి.

మక్తల్‌ వ్యవసాయ మార్కెట్‌ పాలకవర్గం పదవీకాలం ఇంకా ముగియలేదు. కానీ ఆ కుర్చీ ఎవరికి సొంతమవుతుందనే చర్చ మాత్రం అప్పుడే మొదలైంది. రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్న మక్తల్‌ మార్కెట్‌ కమిటీ పదవీకాలం 2026 డిసెంబర్‌ వరకు ఉన్నప్పటికీ.. కొత్తగా అవకాశం కోసం చూస్తున్న ఆశావహుల లెక్కలు తెరపైకి వస్తున్నాయి. నారాయణపేట కమిటీకి సెప్టెంబర్‌ 15తో, కోస్గి కమిటీకి అక్టోబర్‌ 3తో గడువు పూర్తయిన నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మక్తల్‌లోనూ ఆసక్తిని పెంచుతోంది. పాతవారికే మరో అవకాశం దక్కుతుందా? లేక కొత్త ముఖాలకు తలుపులు తెరుచుకుంటాయా? అన్నదానిపై చర్చ సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement