భూ సర్వేలో వేగం పెంచండి : కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

భూ సర్వేలో వేగం పెంచండి : కలెక్టర్‌

Jul 14 2026 1:36 AM | Updated on Jul 14 2026 1:36 AM

నారాయణపేట: మక్తల్‌– నారాయణపేట–కొడంగల్‌ ఎత్తిపోతల పథకం భూ సేకరణ ప్రక్రియలో భాగంగా చేపడుతున్న భూ సర్వేను వేగవంతం చేయాలని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో సర్వేయర్లతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఇంకా పూర్తి చేయాల్సిన భూ సర్వే, భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వొద్దని సూచించారు. నిర్ణీత గడువులోగా సర్వే పనులను పూర్తిచేసి.. భూసేకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

● ఓటరు ఎన్యూమరేషన్‌ ప్రక్రియ జిల్లాలో కీలక దశకు చేరుకుందని.. ప్రతి ఓటరు వివరాలు కచ్చితంగా నమోదై, అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీల భాగస్వామ్యం అత్యంత కీలకమని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక అన్నారు. కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి ఓటరు ఎన్యూమరేషన్‌ పత్రాన్ని పూర్తిచేసి బీఎల్‌వోలకు అందిస్తేనే డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఈ నెల 24వ తేదీలోగా జిల్లాలోని అర్హులైన ఓటర్లు ఎన్యూమరేషన్‌ పత్రాలను సమర్పించేలా చూడాలన్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పించడం, సందేహాలు నివృత్తి చేయడం, పత్రాలను పూరించడంలో సహకరించడం వంటి బాధ్యతలను బీఎల్‌ఏలు సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు. సమావేశాల్లో అదనపు కలెక్టర్‌ శ్రీను, డీఆర్వో రాజేశ్వరి ఆర్డీఓ రమేశ్‌, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ వేణుగోపాల్‌, ఎన్నికల విభాగం అధికారి జయసుధ, రాజకీయ పార్టీల ప్రతినిధులు సుదర్శన్‌రెడ్డి, అబ్దుల్‌ సలీం, వెంకట్రాంరెడ్డి, రాఘవ చౌదరి, కె.నారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement