నారాయణపేట: జిల్లాకేంద్రంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, రహదారులపై అక్రమ పార్కింగ్‌పై పోలీసుశాఖ దృష్టి సారించింది. డయల్ యువర్ ఎస్పీకి వచ్చిన ఫిర్యాదుల మేరకు అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్‌హక్ గురువారం పట్టణంలోని ప్రధాన రహదారులను పరిశీలించారు. సీఐ శివశంకర్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఎస్‌ఐ కృష్ణచైతన్యతో కలిసి సరాఫ్‌బజార్, మెయిన్‌చౌక్, ఓల్డ్ బస్టాండ్, సత్యనారాయణ చౌరస్తా, యాద్గిర్ ప్రధాన రహదారి తదితర రద్దీ ప్రాంతాల్లో పర్యటించారు. రహదారులపై నిలిపిన వాహనాలు, దుకాణాల ఎదుట ఆక్రమణలు, ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తున్న అంశాలను పరిశీలించి వాహన, దుకాణదారులకు హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. రహదారులపై ఇష్టానుసారంగా వాహనాలు నిలిపివేయడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో పాటు ప్రమాదాల ముప్పు పెరుగుతుందని తెలిపారు. వాహనదారులు రోడ్లపై కాకుండా పార్కింగ్ స్థలాల్లోనే నిలపాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనదారులు సీటుబెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని, మద్యం తాగి వాహనాలు నడపొద్దన్నారు. అలాగే వ్యాపారులు తమ దుకాణాల ఎదుట ఉన్న రహదారులపై సామగ్రి ఉంచకుండా సహకరించాలని కోరారు.


