నారాయణపేట: జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికిగాను ఆత్మరక్షణ శిక్షకుల (కోచ్‌లు) నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి వెంకటేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్, సమగ్రశిక్ష చైర్మన్ ఆమోదం, జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) ఆదేశాల మేరకు కరాటే, జూడో, కుంగ్‌ఫూ, కలరిపయట్టు, తాయిక్వాండో లేదా గుర్తింపు పొందిన ఇతర యుద్ధకళల్లో అనుభవం, అర్హులైన శిక్షకులు 20వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, సంబంధిత ధ్రువపత్రాల ప్రతులను జతచేసి జిల్లా యువజన, క్రీడలశాఖ కార్యాలయం, మినీ స్టేడియం గ్రౌండ్, నారాయణపేటలో సమర్పించాలని పేర్కొన్నారు.
ఉండవెల్లి: ఉమ్మడి జిల్లాలోని మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల్లో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారి శ్రీనివాస్‌గౌడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత సబ్జెక్టులలో పీజీతోపాటు బీఎడ్ అర్హతతో పీజీలో కనీసం 55 శాతం మార్కులు ఉండాలన్నారు. ఆసక్తి గలవారు విద్యార్హతల ధ్రువపత్రాల జిరాక్స్, అనుభవ ధ్రువపత్రాలు, జడ్చర్లలోని ఆర్‌సీఓ ఆఫీస్‌లో ఈ నెల 20లోగా దరఖాస్తులతోపాటు అందజేయాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి
ఊట్కూర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని.. సెప్టెంబర్ 15 నాటికి పూర్తి చేయాలని హౌసింగ్ పీడీ శంకర్‌నాయక్ తెలిపారు. గురువారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి మాట్లాడారు. లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తుందని.. విడతల వారీగా బిల్లులు ఖాతాలో జమ అవుతున్నాయని తెలిపారు. అవసరం ఉన్న వారికి రెవెన్యూ అధికారులు ఇసుక సరఫరా చేయిస్తారని చెప్పారు. ఆయన వెంట ఎంపీడీఓ పావని, ఏఈ ప్రేమ, కార్యదర్శి శ్రీనివాసరావు, భరత్ తదితరులు ఉన్నారు.
కమీషన్ల కోసమే ఎత్తిపోతల నిర్మాణం : బీఆర్‌ఎస్
మక్తల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కమీషన్ల కోసమే మక్తల్–పేట–కొడంగల్ ఎత్తిపోతల నిర్మాణం చేపడుతున్నారని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం మండలంలోని చిన్నగోప్లాపూర్‌లో భీమా ఫేజ్–1 పంపుహౌజ్‌ను పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మక్తల్–పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం డిజైన్ సరికాదని, దీంతో నిధులు వృథా తప్ప ఒరిగేదేమీ లేదన్నారు. కొడంగల్ రైతులను మోసం చేస్తున్నారని, అధికారులను సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ పథకంతో రైతులకు ఎలాంటి లాభం లేదని.. ప్రభుత్వం రైతులకు న్యాయం చేసేవిధంగా ఆలోచన చేయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ నర్సింహగౌడ్, చిట్యాల జుబేర్‌పాషా, సర్పంచ్ గాలిరెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు అశిరెడ్డి, సాగర్, ఈశ్వర్, నేతాజీరెడ్డి, పంచలింగాల సర్పంచ్ రామాంజనేయులుగౌడ్, శివారెడ్డి పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.8 వేలు
గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు గురువారం 1,945 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా క్వింటాల్ గరిష్టంగా రూ.8,000, కనిష్టంగా రూ.4,409, సరాసరిగా రూ.5,920 ధరలు లభించాయి.


