● ఎస్‌బీఐలోనే ఎందుకింత
తిరస్కరణ?
● ఆగష్టు 15లోగా
100 శాతం గ్రౌండింగ్
పూర్తి చేయాలి
● కలెక్టర్ సీహెచ్ ప్రియాంక
నారాయణపేట: స్వయం ఉపాధి పథకాల అమలులో బ్యాంకుల పాత్ర కీలకమని.. అర్హులైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెనన్స్ హాల్‌లో పీఎంఎఫ్‌ఎంఈ, పీఎం విశ్వకర్మ, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, పీఎం డీడీకేవై తదితర పథకాల పురోగతిపై బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించారు. ఇతర బ్యాంకులతో పోలిస్తే ఎస్‌బీఐ శాఖల్లో రుణ దరఖాస్తుల తిరస్కరణలు అధికంగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రతి దరఖాస్తును నిబంధనల మేరకు నిష్పక్షపాతంగా పరిశీలించాలన్నారు. ఈ అంశంపై లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ప్రత్యేక చొరవచూపి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. పీఎం విశ్వకర్మ పథకం కింద బ్యాంకుల వారీగా పెండింగ్, తిరస్కరణ దరఖాస్తులపై సమీక్షించి అర్హులైన వారికి వెంటనే రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్ రుణ దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలన్నారు. బ్యాంకర్లు, ఏపీఎంలు, డీపీఎంలు సమన్వయంతో పనిచేయాలన్నాని సూచించారు. పీఎం డీడీకేవైపై కేంద్రం ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తున్నందున లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని కోరారు. ఇప్పటికే ఆమోదం పొందిన దరఖాస్తులను వెంటనే గ్రౌండింగ్ చేసి ఆగష్టు 15లోగా 100 శాతం పూర్తి చేయాలన్నారు. సీ్త్రనిధి రుణాలు, స్వయం సహాయక సంఘాల ఆర్థిక కార్యకలాపాల పురోగతిపైనా దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీఓ వెంకట్రాములు, ఎల్‌డీఎం విజయ్‌కుమార్, జిల్లా పరిశ్రమలశాఖ మేనేజర్ రామలింగేశ్వరగౌడ్, పుర కమిషనర్ శంకర్, వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.


