నారాయణపేట: తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున రైతులు సంప్రదాయ సాగు విధానాలకు బదులు పరిస్థితులకు అనుగుణంగా పంటలు ఎంపిక చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్ సూచించారు. గురువారం మండలంలోని ఏక్లాస్‌పూర్‌లో ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితులు.. ప్రత్యామ్నాయ పంటల సాగుపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వర్షాలు ఆలస్యం కావడం, భూగర్భ జలాలు తగ్గిపోవడం, బోర్లలో నీటిలభ్యత తగ్గుతున్న నేపథ్యంలో అధిక నీరు అవసరమయ్యే వరి సాగు రైతులకు భారంగా మారే అవకాశం ఉందన్నారు. బోర్ల కింద వరి విస్తీర్ణాన్ని తగ్గించి తక్కువ నీటితో సాగు చేయగల పంటలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నువ్వులు, ఆముదం, సజ్జ, జొన్న, రాగులు తదతర చిరుధాన్యాలు సాగు చేయడంతో దిగుబడి సాధించవచ్చన్నారు. ఈ పంటలకు వర్షాభావ పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉండటంతో పాటు రైతులకు ఆర్థికపరంగా కూడా భద్రత కల్పిస్తాయని పేర్కొన్నారు. పత్తి రైతులు మొక్కలు వాడిపోకుండా ఉండేందుకు 2 శాతం యూరియా ద్రావణాన్ని ఆకులపై పిచికారీ చేయాలని సూచించారు. నేలలో తేమ నిల్వ ఉంచేందుకు కలుపు నియంత్రణ, తేమ సంరక్షణ చర్యలు చేపట్టాలని అవగాహన కల్పించారు. ప్రభుత్వం అందించే రాయితీలు, పంట నష్టపరిహారం, బీమా, ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి దినకర్, వ్యవసాయ విస్తరణ అధికారి రాజేష్, సర్పంచ్ చంద్రశేఖర్‌గౌడ్, రాంరెడ్డి, తిమ్మప్ప, ఆనంద్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.


