పకడ్బందీగా
ఓటరు జాబితా ప్రక్షాళన
పట్టణంలోనే సవాల్..
జిల్లాలో ఇంకా 1.54 లక్షల ఓటర్ల ధృవీకరణ పెండింగ్
● ఆగస్టు 3 చివరి తేదీ
● పట్టణాల్లో నెమ్మదించిన ప్రక్రియ
● గ్రామాల్లో మెరుగైన పురోగతి
నారాయణపేట: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం తుది దశకు చేరుకున్న వేళ జిల్లాలో ఓటర్ల ధృవీకరణ ప్రక్రియ అధికారులకు సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం జూలై 24తో ముగియాల్సిన గడువును ఆగస్టు 3 వరకు పొడిగించడం జిల్లా ఎన్నికల యంత్రాంగానికి కొంత ఊరటనిచ్చింది. మక్తల్, నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి 4,95,574 మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటివరకు సగటున 69 శాతం మేర మాత్రమే ధృవీకరణ పూర్తైంది. ఇంకా 1,53,989 మంది ఓటర్ల ధృవీకరణ పెండింగ్‌లో ఉండటంతో ఇంటింటి సర్వేలు, ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్, బీఎల్‌ఓల పరిశీలించాల్సి ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు అందుబాటులో లేకపోవడం, ఉద్యోగాలు, వలసలు, చిరునామా మార్పులు, మొబైల్ నంబర్ల లభ్యత వంటి కారణాలతో ప్రక్రియ మందగిస్తుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం బీఎల్‌ఓలు ఇంటింటికీ చేరుకుని మెరుగైన పురోగతి సాధిస్తున్నారు. కలెక్టర్ సీహెచ్ ప్రియాంక వారం రోజులుగా మండలాల వారీగా పర్యటిస్తూ బీఎల్‌ఓల పనితీరు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. దీంతో బీఎల్‌ఓలు ఓటర్లకు ఎక్కడికక్కడ సందేహాలను నివృత్తి చేస్తూ ఎన్యుమరేషన్ ఫారాలను డిజిటలైజేషన్ ముందుకు సాగుతున్నారు.
చివరి దశలో..
ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. ఇంటింటి సర్వే, ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్, ఓటర్ల ధృవీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నప్పటికీ నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంకా 74,151 మంది ఓటర్ల ధృవీకరణ పూర్తి కావాల్సి ఉంది. మొత్తం 2,42,773 మంది ఓటర్లలో 1,68,622 మందికి (69.46%) మాత్రమే ధృవీకరణ పూర్తైంది. మిగిలిన 30 శాతం పూర్తి చేయాల్సి ఉంది.
మక్తల్ నియోజవర్గంలోనూ..
మక్తల్ అసెంబ్లీలో మొత్తం 2,52,801 మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటి వరకు 1,66,055 ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటలైజ్ చేశారు. వీటిలో 1,65,849 ఫారాలను బీఎల్‌ఓలు ధృవీకరించారు. ఇది మొత్తం ఓటర్లలో 68.42 శాతం. ఇంకా 79,838 మంది ధృవీకరణ కోసం ఎదురుచూస్తున్నారు. మక్తల్ మండలంలో 67,891 మంది ఓటర్లలో 44,544 మందిదే ధృవీకరణ పూర్తైంది. 24,247 మంది ఇంకా పెండింగ్‌లో ఉండటం మొత్తం నియోజకవర్గంలోనే అత్యధికం. ఆత్మకూర్ మండలంలో 11,621 మంది, కృష్ణా మండలంలో 7,167 మంది ధృవీకరణ కోసం మిగిలి ఉన్నారు. మాగనూర్ మండలంలో 74.62 శాతం, అమరచింత 71.85 శాతం, మరికల్ 71.19 శాతం, ఊట్కూర్ 70.84 శాతం, నర్వ 70.59 శాతం ఆన్‌లైన్ నమోదు పూర్తైంది.
జిల్లాలోని నియోజకవర్గాల వారీగా..
నియోజకవర్గం మక్తల్ నారాయణపేట
బీఎల్‌ఓలు 284 270
ఓటర్లు 2,52,801 2,42,773
డిజిటలైజేషన్ 1,66,055 1,61,561
ధృవీకరణ పూర్తి 1,72,963 1,68,622
పూర్తయిన శాతం 68.42 69.46
పెండింగ్ 79,838 74,151
సర్‌లో ఓటరు జాబితా ప్రక్షాళనను క్షేత్రస్థాయి లో బీఎల్‌ఓలతో పకడ్బందీగా చేపడుతున్నాం. ఓటరు జాబితా లో ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు ఉంటే ఒక ఓటును తప్పనిసరి, మరణించిన ఓటర్ల పేర్లను శాశ్వతంగా జాబితా నుంచి తొల గిస్తాం.ఓటర్లు సమర్పించిన ఎన్యూమరేషన్ ఫా రాలను వెంటనే డిజిటలైజేషన్ చేయిస్తున్నాం.
– సీహెచ్ ప్రియాంక, కలెక్టర్
నారాయణపేట మండలంలో 85,004 మంది ఓటర్లలో 55,263 ఓటర్ల ధృవీకరణ పూరైంది. 29,741 మంది ఇంకా పెండింగ్‌లో ఉండటం మొత్తం నియోజకవర్గంలోనే అత్యధికం. గ్రామీణ మండలాల్లో మాత్రం సర్ ప్రక్రియ ఆశాజనకంగా కొనసాగుతోంది. కోయిల్‌కొండ 73.47 శాతం ధృవీకరణతో మొదటి స్థానంలో ఉండగా, దామరగిద్ద 71.90 శాతం, మరికల్ 70.93 శాతం, ధన్వాడ 69.55 శాతం ధృవీకరణ పూర్తయ్యాయి.


