గురువులకూ పరీక్షే! | - | Sakshi
Sakshi News home page

గురువులకూ పరీక్షే!

Aug 5 2026 2:05 AM | Updated on Aug 5 2026 2:05 AM

కర్నూలు సిటీ: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహించేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. నేటి (బుధవారం) నుంచి మొదలయ్యే పరీక్షకు జిల్లాలో ఐదు కేంద్రాలు, తెలంగాణలోని హైదరాబాద్‌లో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో నిర్వహించనున్న పరీక్షలు ఈ నెల 16వ తేదీ వరకు జరుగనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కచ్చితంగా టెట్‌ అర్హత సాధించి ఉండాలని, ఉచిత, నిర్భంద విద్యాహక్కు చట్టం (ఆర్‌టీఈ) 2009లోని సెక్షన్‌ 23 ప్రకారం టెట్‌ అనేది ఉపాధ్యాయ నియామకానికి ఉండాల్సిన కనీస అర్హతలలో ఒకటని, ఈ చట్టం పరిఽధిలోకి వచ్చే స్కూళ్లలో ఉపాధ్యాయులందరికీ టెట్‌ కచ్చితంగా ఉండాలని సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతం నిర్వహించనున్న టెట్‌కు అత్యధిక శాతం మంది ఉపాధ్యాయులు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. మెగా డీఎస్సీకి ముందు నిర్వహించిన టెట్‌కు కొంత మంది ఉపాధ్యాయులు మాత్రమే దరఖాస్తు చేసి పరీక్ష రాశారు. ప్రస్తుతం తప్పనిసరి చేయడంతో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు టెట్‌ పరీక్ష రాసేందుకు ఆన్‌ డ్యూటీ అవకాశం ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు టెట్‌ కన్వీనర్‌, పాఠశాల విద్య కమిషనర్‌కు సైతం విన్నవించారు. అయితే పరీక్షలకు హాజరయ్యే వారికి ఎలాంటి ఓడీ ఇవ్వడం లేదని, వ్యక్తిగత సెలవు పెట్టుకోవాలని విద్యాశాఖ అనధికారికంగా సంఘాల నాయకులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. పాఠశాలల్లో చదువు చెబుతున్న టీచర్లకు టెట్‌ కంపల్సరీ చేయడంతో ఒకవైపు తరగతులు, మరోవైపు టెట్‌ పరీక్ష ప్రిపరేషన్‌కు సమయం సర్దుబాటు చేసుకోలేని పరిస్థితుల్లో.. పరీక్షలో అర్హత సాధిస్తామా? లేదా? అనే ఆందోళన ఉపాధ్యాయుల్లో నెలకొంది.

జిల్లాలో టెట్‌ రాయనున్న 31,773 మంది!

జిల్లావ్యాప్తంగా 2254 అన్ని యాజమాన్యాల స్కూళ్లు ఉన్నాయి. ఈ స్కూళ్లలో 16,866 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. 2010 సంవత్సరానికి ముందు నియామకం అయిన టీచర్లందరూ టెట్‌ అర్హత పొందాల్సిందే. ఇందులో పదవీ విరమణకు రెండేళ్ల సమయం ఉన్న టీచర్లకు టెట్‌ నుంచి మినహాయింపు ఇచ్చారు. విద్యాశాఖ గణాంకాల ప్రకారం 2010కి ముందు నియామకం అయిన టీచర్లలో సుమారుగా 10 వేల మంది టీచర్లు టెట్‌ అర్హత పొందాల్సి ఉంది. ప్రస్తుతం జరుగనున్న టెట్‌కు జిల్లాలో 31,773 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇందులో టీచర్లు 5 వేల మంది వరకు దరఖాస్తు చేసి ఉంటారని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరీక్షకు జిల్లాలోని కర్నూలు నగరంలో నాలుగు కేంద్రాలు, ఆదోనిలో ఒకటి, హైదరాబాద్‌లో 2 కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిర్దేశించిన సమయానికి గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి, హాల్‌ టికెట్‌పై ఫొటో లేకపోతే.. ఒరిజినల్‌ ఆధార్‌, పాన్‌కార్డు, ఓటరు కార్డు, బ్యాంక్‌ పాస్‌ పుస్తకాన్ని గుర్తింపుగా వెంట తీసుకెళ్లాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. పీహెచ్‌సీ అభ్యర్థులు దరఖాస్తు చేసిన సమయంలో పీహెచ్‌సీ అని నమోదు చేయకపోతే, డీఈఓ అనుమతి తీసుకొని సహాయకుడిని పొందవచ్చు.

టెట్‌కు రంగం సిద్ధం

జిల్లాలో ఐదు, హైదరాబాద్‌లో

రెండు కేంద్రాలు ఏర్పాటు

పరీక్షలకు హాజరుకానున్న

31,773 మంది అభ్యర్థులు

ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్ష

ఇన్‌ సర్వీస్‌ టీచర్లకూ టెట్‌ తప్పనిసరి

జిల్లావ్యాప్తంగా ప్రైవేటు,

ప్రభుత్వ బడుల్లో 10 వేలకుపైగా

టెట్‌ అర్హత లేని టీచర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement