ఆత్మకూరురూరల్: నాగార్జునసాగర్ – శ్రీశైలం పులుల అభయారణ్యం ఫీల్డ్ డైరెక్టర్‌గా కన్జర్వేటర్ యశోదాబాయి బాధ్యతలు స్వీకరించారు. ఎన్‌ఎస్‌టీఆర్‌లో పులుల అసహజ మరణాల ఘటనపై విచారణ జరుగుతుండడంతో ఆమె ఫీల్డ్‌లో పర్యటిస్తూ మంగళవారం ఆత్మకూరు చేరుకున్నారు. ఇన్‌చార్జ్ ఎఫ్‌డీపీటీగా వ్యవహరిస్తున్న కర్నూలు సీఎఫ్ సెల్వం నుంచి బాధ్యతలు స్వీకరించారు. కాగా సెల్వం యశోద భర్త కావడం విశేషం. యశోదాబాయి అనంతపురం సోషల్ ఫారెస్ట్‌లో సీఎఫ్‌గా పని చేశారు. అంతకు ముందు తిరుపతి జంతు ప్రదర్శనశాల క్యూరేటర్‌గా కూడా ఉన్నారు.
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ప్రవేశాలు ప్రారంభం
నంద్యాల(న్యూటౌన్): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిఽధిలో ఉన్న పీఎస్సీ, కేవీఎస్సీ ప్రభుత్వ కళాశాలలో 2026–27 విద్యాసంవత్సరానికి ఓపెన్ డిగ్రీ ప్రవేశాలు ప్రారంభమైనట్లు అధ్యాయన కేంద్రం కో ఆర్డినేటర్ దస్తగిరి, కళాశాల ప్రిన్సిపాల్ శశికళ తెలిపారు. మంగళవారం వారు మాట్లాడుతూ.. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈనెల 5వ తేదీ నుంచి సెప్టెంబర్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. బీఏ, చరిత్ర, ఆర్థిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం, బీఎస్సీ గణిత, భౌతిక, రసాయన శాస్త్రం, బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్, బీఎల్‌ఐఎస్‌సీ లైబ్రరీ అండ్ ఇన్‌ఫర్మేషన్ సైన్స్‌లకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం 9052324133ను సంప్రదించాలన్నారు.
బ్యాలెట్ పేపర్ల వివరాలు కోరిన సీపీఆర్
కర్నూలు(అర్బన్): గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి బ్యాలెట్ పత్రాలకు ఎంత పేపర్ అవసరమవుతుందనే వివరాలను పంపాలని కమిషనర్ ఆఫ్ పంచాయతీ రాజ్ నుంచి ఆదేశాలు జారీ అయినట్లు జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వారం రోజుల క్రితం ఎన్నికల నిర్వహణకు ఎన్ని బ్యాలెట్ బాక్సులు అవసరమవుతాయనే వివరాలను పంపించామన్నారు. తాజాగా బ్యాలెట్ పత్రాల వివరాలను కోరిందన్నారు. వార్డు సభ్యులకు తెలుపు, సర్పంచు స్థానాలకు పింక్ కలర్ పేపర్‌ను వినియోగిస్తామన్నారు. జిల్లాలో మొత్తం 484 గ్రామ పంచాయతీలకు 237 మజరా గ్రామాలు ఉన్నాయన్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో 5,100 వార్డులు ఉన్నాయన్నారు.
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు
కర్నూలు సిటీ: అన్ని యాజమన్యాలకు చెందిన ఉపాధ్యాయులు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యా య అవార్డుకు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ ఎల్.సుధాకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు అర్హులని, ఎలాంటి నేరారోపణలు, అభియోగాలు ఉండకూడదన్నారు. అవార్డుకు ప్రతిపాదనలతో పాటు, అభ్యర్థిపై ఎలాంటి సివిల్, క్రిమినల్ కేసులు లేవని ధ్రువీకరణ పత్రాలను తనిఖీ అధికారులు జతచేయాలన్నారు. గతంలో జిల్లా స్థాయి ఉత్తమ అవార్డు పొందని వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 15లోపు దరఖాస్తులను డిప్యూటీ విద్యాధికారి కార్యాలయంలో అందజేయాలన్నారు.
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వ విద్యాలయం పరిఽధిలో నిర్వహిస్తున్న ఎల్‌ఎల్‌బీ రెండో సెమిస్టర్ పరీక్షలకు మంగళవారం 37 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ నాగస్వరం నరసింహులు తెలిపారు. రెండు పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరగ్గా 453 మంది విద్యార్థులకు గాను 416 మంది హాజరయ్యారు.
25 మండలాల్లో వర్షం
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో సోమవారం ఉద యం నుంచి మంగళవారం ఉదయం వరకు 25 మండలాల్లో వర్షపాతం నమోదైంది. ఆలూరు, చిప్పగిరి మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు. అత్యధికంగా పత్తికొండలో 36.2 మి.మీ. అత్యల్పంగా సి.బెళగల్‌లో 0.2 మి.మీ వర్షం కురిసింది. ఆదోనిలో 35.2, కోసిగి 32.6, పెద్దకడబూరు 30.6 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 117 మి.మీ ఉండగా నాలుగు రోజుల్లో 15.3 మి.మీ వర్షం కురిసింది. రానున్న రోజుల్లో కూడా ఒకటి రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


